మాంద్యం మబ్బున ఉత్సాహపు వాన!
స్పెయిన్‌లో జరిగే ‘టొమాటినా’ ఫెస్టివల్ ప్రస్థానం ఇప్పటిది కాదు. 1945 నుంచి యేటా ఒకటే ఉత్సాహంతో జరుగుతోంది ఈ పండగ. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ ఫ్రూట్‌ఫెస్టివల్ కు ఎంతోమంది హాజరవుతారు. ఎంతో ఉత్సాహంతో దీంట్లో పాలు పంచుకుంటారు. అక్కడి ప్రభుత్వం ఉత్సాహవంతుల కోసం అన్ని ఏర్పాట్లనూ తనే చూసుకునేది.
వేల కేజీల టొమాటోలను సరఫరా చేసి.. పండగ చేసుకోమనేది. అయితే యూరప్ దేశాలను పట్టిపీడిస్తున్న ఆర్థికమాంద్యం ఈ టొమాటో ఫెస్టివల్‌ను కూడా వదల్లేదు. ఇప్పటికే ప్రజాసంక్షేమ పథకాలను ఆపేసి, అభివృద్ధి నిధులకు కోతపెట్టిన ప్రభుత్వం టమోటినా ఫెస్టివల్‌కు డబ్బు ఖర్చు చేయడంలో కూడా చేతులెత్తేసింది. ఈ ఫెస్టివల్ పాల్గొనేవారికి ఎంట్రీ టికెట్‌ను పెట్టింది. పది యూరోలు చెల్లించి ఎవరైనా ఈ పండగలో పాలుపంచుకోవచ్చనే నియమాన్ని పెట్టింది.
దీంతో ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి వచ్చిన ఉత్సాహవంతులు ‘ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకిలా అన్నారు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతిమంగా పది యూరోలు చెల్లించిన వారే పండగలో పార్టిసిపేట్ చేశారు. చెల్లించలేమనుకున్నవారు వెనుదిరిగారు! పాల్గొన్నవారు మాత్రం ఫెస్టివల్‌ను కలర్‌ఫుల్‌గా జరుపుకున్నారు!