పుట్టి పెరిగిన ఊరిలో సైకిల్‌పై బయటికి వెళ్లేందుకే భయపడిన అమ్మాయి హైదరాబాద్‌కే మణికిరీటం లాంటి మెట్రో రైలును ధైర్యంగా నడిపిస్తోంది! ఒంటరిగా చౌరస్తా వరకు వెళ్లే సాహసం చేయని ఆ యువతి.. రోజుకు వేలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తోంది.
ఏడాది క్రితం హైద్రాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాగా అందులో పైలట్‌గా ఎంపికైన వారిలో హన్మకొండలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల లక్ష్మీప్రసన్న ఒకరు. అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న మెట్రో రైలునే ఏడాదిగా మచ్చలేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు లక్ష్మిప్రసన్న. హన్మకొండ పట్టణంలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల నాగరాజు, శోభారాణిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురైన లక్ష్మీప్రసన్న పదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న సెయింట్ జోసెఫ్ (తోటబడి)లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వాగ్దేవి కళాశాలలో చదివారు. ఆ తర్వాత 2016లో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటివద్దే పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
సంతోషంగా ఉంది
సాధారణ మధ్య తరగతి కుటుంబంలో నుంచి మెట్రో రైలు పైలట్‌గా విధులు నిర్వహించే అరుదైన గౌరవం దక్కడం నాకు సంతోషంగా ఉంది. రోజుకు 6నుంచి 8గంటల పాటు మెట్రో రైలు నడుపుతుంటాను. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సరైన సమయానికి చేరుస్తున్నానని చెప్పేందుకు గర్విస్తున్నాను. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న నేటి సమాజంలో నా ఆకాంక్షలను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రుల గొప్ప మనసు ముందు నాది చాలా చిన్న ఉద్యోగమే అనిపిస్తుంది.
– లక్ష్మీప్రసన్న, పైలట్
మొదటి బ్యాచ్‌లోనే!
స్నేహితుల సమాచారంతో హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభమయ్యే మెట్రో రైలు సంస్థలో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుసుకున్న లక్ష్మీప్రసన్న మెట్రోరైలులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంస్థ నిర్వహించిన రాతపరీక్షకు హాజరై అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు. 2017 జూన్ 12న మెట్రో పైలట్‌గా ఉద్యోగ నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో మొదటి బ్యాచ్‌లో పైలట్‌గా ఎంపికైన సుమారు నలభై మంది అమ్మాయిల్లో లక్ష్మి ప్రసన్న ఒకరు.
ఐదు నెలల శిక్షణ
మెట్రో రైలు సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన లక్ష్మి ప్రసన్న సహచరులతో కలిసి హైద్రాబాద్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్‌లో ఐదు నెలల పాటు శిక్షణ పొందారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే మెట్రో రైలు నిర్వహణపై కియోలిస్ కంపెనీ అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017 నవంబర్ 29న ప్రారంభమైన మెట్రోరైలు సేవల్లో నాటి నుంచి నేటివరకు దిగ్విజయంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎల్‌బినగర్– మియాపూర్ మధ్య మెట్రో రైలును నడిపిస్తున్నారు.
– గజ్జి రమేష్, సాక్షి, హన్మకొండ
Comments
Please login to add a commentAdd a comment