నవ్వులు, స్నేహితులే.. ఆనందానికి అర్థాలు!
‘‘ఆనందం అనేది బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులో లేదు. ఖరీదైన కార్లు, డిజైనర్ క్లాత్స్‌లో లేదు.. ఆనందం అనేది కుటుంబం, స్నేహితులు, ప్రకృతి సౌందర్యంలోనే ఉంది...’’ అని అభిప్రాయపడ్డారు అధ్యయనకర్తలు. ఈ అభిప్రాయం సర్వేను చేసినవారిది కాదు. సర్వేలో పాల్గొన్నవారిది. ప్రస్తుత సమాజంలో మనస్పూర్తిగా నవ్వగలగడం తమకు అత్యంత ఆనందాన్ని ఇస్తున్నట్లుగా చాలామంది చెబుతున్నారని ఈ సర్వేలో పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 22 శాతం మంది మనసారా...
హాయిగా నవ్వుకోవడం తమకు ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. 21 శాతంమంది స్నేహితులతో గడిపే సమయం తమ జీవితంలో అత్యంత ఆనందకరమైనదని తెలిపారు. ఇంతే శాతం మంది కడుపారా ఇష్టమైన తిండిని తినడం హ్యాపీగా ఉండేలా చేస్తోందంటూ ఆహారంపై ఆసక్తిని ప్రదర్శించారు. ఇష్టమైన వారి సాంగత్యంలో గడపడమే తమకు అత్యంత ఆనందాన్ని ఇస్తోందని 19 శాతం మంది తెలిపారు. వీరంతా కూడా ఇష్టమైనవారిని ‘హగ్’ చేసుకోవడం అంటే ఇష్టమని, అదే తమకు ఆనందమని చెప్పడం విశేషం.
సూర్యోదయాలను గమనించడం, సూర్యాస్తమయాల్లో ఏకాంతంగా గడపడం, మంచి పుస్తకాలు చదవడం, పాతఫోటోలను చూస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, పచ్చటి పంటపొలాల మీదుగా వచ్చే వాసనను ఆస్వాదించడం, క్లీన్‌గా ఉన్న బెడ్‌పై తనివితీరా నిద్రపోవడం, సముద్రపు ఒడ్డున ఇష్టమైన వారితో కలిసి నడవడం.. తమకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అంశాలని అనేకమంది తెలిపారు. ఇంకొందరు తమ ఆనందానికి కీ శృంగారంలో ఉందన్నారు.
ఒకవైపు ప్రపంచం అంతా కమర్షియల్‌గా, మెటీరియలిస్టిక్‌గా మారిపోయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాటి మనిషిని పట్టించుకొనే ఓపిక , బంధాలకూ, బంధుత్వాలకు విలువనిచ్చే పరిస్థితి లేదని, ప్రపంచం యాంత్రికంగా మారిపోయిందనే నిర్వేదం కూడా వ్యక్తమవుతోంది. మరి ఇటువంటి నేపథ్యంలో ఇలా స్నేహితులతో గడపడం, గుండెలనిండుగా నవ్వుకోవడాలే తమకు ఆనందాన్ని ఇస్తున్నాయనే అభిప్రాయాలు వినిపించడం ఒక ఎత్తయితే, తమకు ఆనందాన్ని ఇచ్చే విషయాల గురించి చెప్పమంటే.. డబ్బు అనే పదానికి చాలామంది అల్ప ప్రాధాన్యతను ఇవ్వడం నిజంగా విశేషమే!