సుప్రీంకోర్ట్‌లో చంద్రచూడ్‌గారికి అసిస్టెంట్‌గాపనిచేయడమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను గడించడమే.ముఖ్యంగా ఆ మూడు తీర్పులప్పుడు చేసినపరిశోధనతో చాలా నేర్చుకున్నాను. ఆ చారిత్రాత్మకతీర్పులకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఇంతకు మించినఆనందం ఏం ఉంటుంది? ఆ మూడు సందర్భాల్లోకోర్టు హాలులో వినిపించిన చప్పట్లు.. కోర్ట్ బయట మీడియాతో సహా సామాన్య జనం జరుపుకున్నసంబరాలు ఎప్పటికీ మరిచిపోలేను. – మానసి
హైదరాబాద్.. 2017 సంవత్సరం..
ఒకరోజు రాత్రి పదిగంటల సమయం.. పని ముగించుకొని ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు అడ్వకేట్ మానసి చౌదరి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 దగ్గర సిగ్నల్స్ దగ్గర తన కారును ఎవరో ఢీ కొట్టినట్టని పించింది ఆమెకు. పరిస్థితి అర్థమయ్యేలోపే ఇద్దరబ్బాయిలు కారు దిగి ఆమె కారు దగ్గరకు వచ్చి.. కారు అద్దాలను పగలకొట్టారు విండోస్, రేర్ వ్యూ మిర్రర్స్ సహా. ఈ బీభత్సాన్ని చూసి గట్టిగా అరిచారు మానసి. దాంతో ఆమెకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వెళ్లిపోయారు ఆ ఇద్దరూ. వాళ్ల కారు నంబర్ ప్లేట్‌ను ఫొటో తీసుకొని షీ టీమ్స్‌కి సమాచారమందించి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారామె. తెల్లవారి.. ఆ కుర్రాళ్లిద్దరినీ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పోలీసులు. ఆ అబ్బాయిలిద్దరి నుంచి బేషరతుగా క్షమాపణ రాయించుకున్నారు మానసి. ‘నిజానికి వాళ్ల మీద కంప్లయింట్ చేయాలనేమీ అనుకోలేదు. కాని అలాగే వదిలేస్తే.. ఏం చేసినా ఆడవాళ్లు నోరు మెదపరు, ఏం చేసినా చెల్లుతుంది అనే రాంగ్ మెసేజ్ పోతుంది. అందుకే కంప్లయింట్ ఇచ్చా’ అని జరిగిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకున్నారు ఆమె.
అసలు ఈ ప్రస్తావన ఇప్పడు ఎందుకు?
రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులు, కల్పించిన సమస్త చట్టాలన్నిటినీ ఒక దగ్గర చేర్చి‘పింక్ లీగల్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు మానసి, మొన్న ఎనిమిదో తారీఖు.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున (8 మార్చి, 2020).
ఈ సందర్భమే పైన ప్రస్తావనకు కారణం. ముందు ఆమెను పరిచయం చేసుకుందాం.
ఆమె ముంబైలో పుట్టారు.హైదరాబాద్‌లో పెరిగారు. ఢిల్లీలోని జిందాల్ గ్లోబల్ లా కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేసి హైకోర్ట్ లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. యేడాది తర్వాత అంటే 2018లో మళ్లీ ఢిల్లీ వెళ్లారు సుప్రీంకోర్ట్ లాయర్‌గా అనుభవం గడించడానికి. జస్టీస్ చంద్రచూడ్ అసిస్టెంట్లలో ఒకరిగా చేరారు. ఎల్‌జీబీటీ సంబంధాలు (ఐపీసీ 377పై సడలింపు) నేరం కాదని, అడల్ట్రీ నేరం కాదని (ఐపీసీ 497), శబరిమల ఆలయంలోకి మహిళలకూ ప్రవేశం ఉండాలని వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల్లో జస్టీస్ చంద్రచూడ్ కృషి ఉంది. అందులో మానసికీ భాగస్వామ్యం ఉంది. 2019లో మళ్లీ హైదరాబాద్ హైకోర్ట్‌కి వచ్చేశారు ఆమె.
పింక్ లీగల్ ఆలోచన..
‘లా చదువుతున్నప్పుడే అనుకున్నాను.. మహిళలకు సంబంధించిన అన్ని విషయాలను ఒక్కచోటకు చేర్చే ప్రయత్నమేదో చేయాలని. ఆ ఆలోచన హైదరాబాద్ వచ్చాక కూడా కొనసాగింది. అందుకే 2017లో నల్సార్ లా కాలేజ్ స్టూడెంట్స్‌తో కలిసి ఆన్ లైన్ సర్వే ఒకటి చేశాను. తమకున్న హక్కులేంటి? తమకోసం ఎన్ని రకాల చట్టాలున్నాయి? అని ఎంతమంది ఆడవాళ్లు తెలుసు అనే విషయం మీద. 80 శాతం మందికి తెలియదని తేలింది సర్వేలో. ఆశ్చర్యం ఏంటంటే వాళ్లలో చాలామంది చదువుకున్న, పట్టణాలు, నగరాల్లో ఉంటున్న మహిళలే! అప్పుడు అనిపించింది నా ఆలోచనను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆచరణలో పెట్టాలని. అయితే ఇతర బాధ్యతల్లో పడి ఆలస్యమై.. ఇప్పటికి సాధ్యమైంది’ అంటూ పింగ్ లీగల్ నేపథ్యం చెప్పుకొచ్చారు ఆమె.
ప్రాంతీయ భాషల్లో కూడా..
ప్రస్తుతం పింక్ లీగల్ ఇంగ్లిష్‌లో ఉంది. త్వరలోనే దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటిలోకి అనువదించనున్నారు. ఈ వారం, పదిరోజుల్లోనే రెండువేల మందికి పైగా సబ్‌స్క్రైబ్ చేశారట. వీళ్లలో అబ్బాయిలూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు అంటారామె. ‘చదువురాని, గ్రామీణ ప్రాంతం వాళ్లకూ తేలికగా అర్థమయ్యేలా ఈ హక్కులు, చట్టాలను వివరిస్తూ యూ ట్యూబ్ చానెలూ పెట్టాలనుకుంటున్నాను. నా ఈ ప్రాజెక్ట్‌కు లా స్టూడెంట్స్ సహకారం చాలా ఉంది. మహిళల హక్కులు, చట్టాల మీద మహిళలకే కాదు పురుషులకూ అవగాహన అవసరం. అది హైస్కూల్ స్థాయి నుంచే ఆరంభిస్తే మరీ మంచిది. దీనిని పాఠ్యాంశాల్లో చేర్చాలి’ అంటున్నారు మానసి.– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment