
క్వశ్చన్ పేపర్ అలా లీకైంది..
వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతోంది. అసలే విశాఖపట్నం, సముద్రపు గాలికి ఉక్కపోత విపరీతంగా ఉంది. మధ్యాహ్నం వేళ బయట ఎండ ప్రచండంగా ఉంది. ఇళ్లల్లోని పెద్దలందరూ శుభ్రంగా భోజనాలు ముగించుకుని, కునుకుతీసే వేళ. పిల్లలందరూ ఆటపాటల్లో మునిగిపోయే వేళ. అలాంటి మండువేసవి మధ్యాహ్నం పూట ఆ కుర్రాళ్లందరూ పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. మెట్రిక్యులేషన్ పరీక్షలు మొదలై అప్పటికి రెండు రోజులైంది. అదో కలిగిన వారి ఇల్లు. ఆ ఇంటివారి అబ్బాయి కూడా మెట్రిక్ పరీక్షలు రాస్తున్నాడు. అతడి క్లాస్‌మేట్స్ అంతా వాళ్ల ఇంట్లో చేరి కంబైన్డ్ స్టడీస్ సాగిస్తున్నారు. పది మందికి పైనే ఉంటారు వాళ్లు. ఒక్కొక్కళ్లదీ ఒక్కో నేపథ్యం.
ఈ పరీక్షలు గట్టెక్కితే చాలు, కలిగిన పిల్లలైతే కాలేజీ మెట్లెక్కుతారు. అంత స్తోమతలేని వాళ్లు అక్కడితో చదువుకు మంగళం పాడేసి, ఏ గుమస్తాగిరీతోనో బతుకుబండిని లాగడం మొదలెడతారు. ఏం చేయాలన్నా ఈ పరీక్షలు గట్టెక్కాలి కదా! కర్మకాలి పరీక్ష తప్పితే ఇంట్లో పెద్దలచేత తిట్లు, శాపనార్థాలు తప్పవు. ఇంకొందరికైతే బడితపూజ జరిగే అవకాశాలూ లేకపోలేదు. ఏడాదంతా ఎప్పటి పాఠాలను అప్పుడే చదువుకునే బుద్ధిమంతులైన కుర్రాళ్లు కాస్త భరోసాగానే ఉన్నారు. ఏడాదంతా బలాదూరుగా కాలక్షేపం తిరుగుళ్లన్నీ తిరిగి, పరీక్షల ముందు పుస్తకాల బూజు దులిపిన వాళ్లకే మర్నాడు రాబోయే ప్రశ్నపత్రాన్ని తలచుకుంటే దడతో ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. మర్నాడే ఇంగ్లిష్ పరీక్ష. తేలిగ్గా మార్కులు కొట్టేసే అవకాశాలు చాలా తక్కువ. కుర్రాళ్లందరూ ఎవరి పద్ధతిలో వాళ్లు చదువుకుంటున్నారు.
కొందరు మనసులోనే మననం చేసుకుంటున్నారు. మరికొందరు వినీ వినిపించనట్లు గొణుగుతూ చదువుకుంటున్నారు. కాస్త గొంతున్న కుర్రాళ్లు బిగ్గరగానే పాఠాలు వల్లె వేస్తున్నారు. మధ్య మధ్య కాస్త విరామం ఇచ్చి, మర్నాడు రాబోయే ప్రశ్నపత్రం ఎలా ఉంటుందనే దానిపై ఊహాగానాలు సాగిస్తున్నారు. ముఖ్యమైనవనుకున్న ప్రశ్నలకు సమాధానాలను శక్తి మేరకు బట్టీ పడుతున్నారు.
అలాంటి సమయంలో చేతిలోని గొడుగు మడిచి చంకన పెట్టుకుని, చెమటలు తుడుచుకుంటూ ఆ ఇంటికి వచ్చాడతను. కాస్త విచిత్రమైన వేషధారణ. మోకాళ్లు దాటిన పంచె, కాస్త మాసిన లాల్చీ, భుజంపై నీరుకావి గావంచా, తలకు పాగా, చెవులకు సింహతలాటాలు.. ఆ ముసలతని అవతారం చూడగానే చెప్పేయవచ్చు ఒరియా మనిషని.. గుమ్మంలోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు. ‘పెద్దాయన ఉన్నారా..?’ వసారాలో చదువుకుంటున్న పిల్లలను అడిగాడు. ‘నిద్రపోతున్నారు.. లేపమంటారా..?’ అన్నాడు ఆ ఇంటివారి అబ్బాయి. ‘వద్దు.. లేపొద్దు.. పెద్దాయన లేచే వరకు ఇక్కడే కూచుంటాలే..’ అంటూ వసారాలోనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. శ్రద్ధగా చదువుకుంటున్న కుర్రాళ్లను ముచ్చటగా చూశాడు. ‘ఏరా పిల్లలూ..! పరీక్షలా..?’ ప్రశ్నించాడతడు. ‘ఔను తాతగారూ.. రెండ్రోజులుగా జరుగుతున్నాయి!’ ముక్తకంఠంతో బదులిచ్చారు కుర్రాళ్లంతా. ‘పరీక్షలు కష్టంగా ఉంటున్నాయా..?’ అడిగాడతను. ‘మెట్రిక్ పరీక్షలు కదా తాతగారూ..! కష్టంగానే ఉంటున్నాయి’ చెప్పారు వాళ్లు. ‘రేపేం పరీక్షరా పిల్లలూ..’ ఆరా తీశాడతను. ‘ఇంగ్లీషు తాతగారూ..!’ కాస్త దిగులుగా బదులిచ్చారు కుర్రాళ్లు. ‘రేపటి పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నీ ఇప్పుడే మీకు తెలిసిపోతే ఏం చేస్తార్రా..?’ నవ్వుతూ అడిగాడతను. ‘అంతకంటే పండగ ఉంటుందా మాకు.. అయితే, అవి తెలిసే అవకాశమే లేదుగా..’ అన్నారు వాళ్లు.
‘నేనా ప్రశ్నలన్నీ చెప్పేయనా..?’ కవ్వింపుగా అన్నాడతను. ముసలతను ఏదో తమాషాకి అంటున్నాడనుకున్నారు ఆ కుర్రాళ్లు.. ‘అలాగైతే ఇప్పుడే చెప్పండి.. వాటి సమాధానాలన్నీ రాత్రిలోగా బట్టీ పట్టేస్తాం’ అంటూ వాళ్లలో కొందరు ముసలతని చుట్టూ మూగారు. ‘నాకు మీ ఇంగ్లిష్ తెలీదు.. అయినా చెబుతాను.. రాసుకోండి’ అన్నాడతను. ఏం చెబుతాడోననే కుతూహలంతో పిల్లలందరూ కాగితాలు, కలాలు తీసుకుని రాతకు సిద్ధమయ్యారు. కూడబలుక్కుంటూ ఒక్కొక్క ప్రశ్నే చెప్పాడతను. ఏ ప్రశ్న ఎన్ని మార్కులకో కూడా చెప్పాడు. అరగంట గడిచే సరికి మొత్తం ప్రశ్నపత్రం తయారైంది. ఇదేదో నమూనా ప్రశ్నపత్రం అనుకున్నారు ఆ కుర్రాళ్లు. అయితే, ఎందుకైనా మంచిదనుకొని ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు బట్టీ పట్టారు. కాసేపటికి ఆ ఇంటి పెద్దాయన నిద్రలేచాడు. ఇంటికొచ్చిన ఒరియా పెద్దమనిషిని పలకరించాడు. ఇద్దరూ కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. చీకటిపడే వేళకు ఒరియా పెద్దమనిషి తిరుగుముఖం పట్టాడు.
మర్నాడు పరీక్ష జరిగింది. ఆశ్చర్యకరంగా ముందురోజు మధ్యాహ్నం ఆ ఒరియా పెద్దమనిషి చెప్పిన ప్రశ్నలే వచ్చాయి.. ప్రశ్నలేనా..! ఇంటికొచ్చి ముందురోజు కాగితాల్లో రాసుకున్నవి చూసుకుంటే, మొత్తానికి ప్రశ్నపత్రమే యథాతథంగా ఉంది. కుర్రాళ్లందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. తమ అదృష్టానికి పొంగిపోయారు. ఆ కుర్రాళ్లకు ప్రశ్నపత్రాన్ని ముందురోజే చెప్పేసిన ఒరియా పెద్దమనిషి గంజాం జిల్లాలోని ధారాకోట్ సంస్థానంలో ఆస్థాన జ్యోతిషుడు. అతడి అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు గానీ, అందరూ అతణ్ణి ‘సర్వజనా (అన్నీ తెలిసిన) పండితుడు’ అంటారు. అతడు కర్ణపిశాచి సాధకుడని ప్రతీతి. అతడి ద్వారా ముందురోజే ప్రశ్నపత్రం తెలుసుకొని పరీక్ష రాసిన కుర్రాళ్లలో ఒకరు కాలక్రమంలో ప్రొఫెసర్‌గా ఎదిగారు.
- పన్యాల జగన్నాథదాసు