
లీసా బ్లెయిర్
సంకల్పబలం ఉంటే భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టి రావచ్చు.
సాహసం
సంకల్పబలం ఉంటే భూమి చుట్టూ ఒక రౌండ్ కొట్టి రావచ్చు. భూమిపై అతి ఎల్తైన శిఖరాన్ని ఎక్కి రావచ్చు. ఇంకా అలవికాని ఎన్నో సాహసాలను చేసి రావచ్చు. కానీ అంటార్కిటికా సముద్రాన్ని (ఇదే దక్షిణ మహాసముద్రం) చుట్టి రావాలంటే మాత్రం.. ఒక్క సంకల్పమే సరిపోదు. ధైర్యం ఉండాలి. తెగింపు ఉండాలి. ఎదురు తిరుగుతున్న గాలుల్ని లొంగదీసుకుని నౌకను ఒడుపుగా నడిపే నేర్పు ఉండాలి. అంటార్కిటికా.. భూగోళానికి దక్షిణంలో ఉంటుంది. ధృవప్రాంతం. నివురు గప్పిన నిప్పులా... మంచు కప్పిన ముప్పు అంటార్కిటికా. ఇక్కడ మనుషులు ఉండరు. ఉండలేరు. అంత చల్లగా ఉంటుంది. సీల్ చేపలు, పెంగ్విన్‌లు, పిచ్చిమొక్కలు తప్ప జీవం అన్నదే ఉండదు. జీవితంపై ఆశ ఉన్నవారు అటువైపు విహారానికైనా వెళ్లరు. వెళ్లినా మళ్లీ వస్తారో లేదో తెలియదు. అంతటి ప్రమాదకరమైన ఖండంలోని సముద్రాన్ని ఒంటరిగా, తోడెవరూ లేకుండా, మధ్యలో ఎక్కడా ఆగే పనిపెట్టుకోకుండా నిరవధికంగా 100 రోజులలో చుట్టి వచ్చేందుకు లీసా బ్లెయిర్ అనే అమ్మాయి గత సోమవారం ఆస్ట్రేలియా తీరప్రాంత పట్టణం ఆల్బెనీ నుంచి బయల్దేరింది!
కేప్ ల్యూవెన్, కేప్ హార్న్, కేప్ అగలస్ మీదుగా అంటార్కిటికా ప్రయాణానికి లీసా రూట్ మ్యాప్ వేసుకున్నారు. ఇవి మూడూ అంటార్కిటికా సముద్రంలో అతి భయంకరమైన మంచు ప్రదేశాలు. వీటిని డీకొన్ని క్షణమే నావికుల అంతిమ క్షణం. ఆ నిగూఢమైన జల మార్గాలను మచ్చిక చేసుకోవడం కోసం 32 ఏళ్ల క్వీన్స్‌లాండ్ యువతి లీసా ఇప్పటికే నాలుగైదు సార్లు అంటార్కిటికాపై ‘ప్రయాణ సాధన’ చేశారు. నౌకలోని ఎలక్ట్రానిక్ పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోనని సరిచూసుకున్నారు. తనకు తానుగా నౌకను నడుపుకుంటూ లీసా ప్రయాణించబోయే దూరం 1,600 నాటికల్ మైళ్లు. ఫైబర్ గ్లాస్‌తో తయారైన ఆ నౌక.. విడిగా అన్ని నాణ్యతా ప్రమాణాలకు గట్టిగా నిలబడింది కానీ, ప్రయాణమార్గంలో అనూహ్యంగా ఎదరైయ్యే తాకిళ్లను తట్టుకోగలదా అని సందేహం. అయితే ‘ఆ మెళకువ అంతా లీసా చేతుల్లోనే ఉంది. ఆమె తనను, తన నౌకను ఊహించని కల్లోలాల నుంచి కాపాడుకోగలరు’ అని ఆమె నౌకా శిక్షకుడు రాన్ లిల్‌బర్న్ అంటున్నారు. అన్నట్టు లిసా జలయాత్ర చేస్తున్న నౌక పేరు ‘క్లైమేట్ ఛేంజ్ నౌ’. ప్రపంచ దేశాలలో వాతావరణ పరిరక్షణ స్మృహను కల్పించే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారట. ఇక లాసా బ్లెయిర్ తన యాత్రను విజయవంతంగా ముగించగలిగితే తిరిగి ఏప్రిల్ నాటికి ఆమె ఆల్బెనీ చేరుకుంటారు. అప్పుడామె ఒంటరిగా అంటార్కిటికా యాత్ర చేసివచ్చిన తొలిమహిళగా గుర్తింపు పొందుతారు.