నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రిటర్న్స్
సార్... మీరు లేకపోతే లేకపోయారు. మా నీలాంబరినైనా సమాధానం చెప్పమనండి. ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది మీరు ప్రాక్టీస్ మానేసి! ఇంచుమించు 1800 డేస్. నా లవ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ దొరకడం లేదు. ఓ అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తున్నాను సార్. మీరు మానేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అమ్మాయిని ఫాలో అవుతున్నాను. రోజూ ట్రై చేస్తున్నా అస్సలు పట్టించుకోవడం లేదు. నిద్రలేదు. ఆకలి లేదు. చదువు లేదు. మీకు దండం పెడతాను. ఏం చెయ్యమంటారో నీలాంబరితోనైనా చెప్పించండి డాక్టర్... ప్లీజ్.
– సురేశ్, చిత్తూరు
కిటికీలోంచి బయటికి చూస్తోంది నర్సు నీలాంబరి... లవ్ ప్రాబ్లమ్‌లు పట్టనట్టు, నన్ను పట్టించుకోనట్టు. ‘సో మెనీ డేస్... వేర్ డిడ్ యు గో’ అన్నట్టు. ఈ సమ్మర్ టైమ్‌లో వీధిలో చూడ్డానికి ఏముంటుందని! నాజూగ్గా... గాలి రాకుండా నాకు అడ్డం నిలబడడం తప్ప. ఉక్కబోస్తోంది.
నా అనుమానం ఏంటంటే ఈ ఉత్తరం అసలు ఒక లవర్ దగ్గరి నుంచి కాకుండా... నీలాంబరి రాసి పోస్ట్ చేసి ఉంటుందని! నన్ను ఎలాగైనా వెనక్కి రప్పించేసి, ఈ లవ్ ప్రాబ్లమ్‌లలో నన్ను కుక్కేసి, ఆమె లవ్ నర్స్‌గా ఎక్కేయాలని చేసిన సర్జికల్ స్ట్రయిక్‌గా అనిపించింది.
‘‘హలో... నీలాంబరీ... ఒక అరటిపండు ఉందా?’’ అని అడిగా.
‘‘ఫైవ్ ఇయర్స్ బ్యాక్‌ది ఉంది. తింటారా?’’ అంది!‘‘ఆ ఉత్తరం రాసినవాడి ప్రేమలాగే ఉంటుంది. కుళ్లిపోయి, ఎండిపోయి, కంపుకొడుతూ. ఏదో జూనియర్ ఎన్టీఆర్ అంటే అనుకోవచ్చు. ఫాలో... ఫాలో... ఫాలో... ఫాలో... ఫాలో... అని నాలుగైదుసార్లు అంటే హీరోయినే కాదు, ఆడియన్స్ కూడా ఫాలో అవుతారు. ఫైవ్ ఇయర్స్... ఈ లవ్ ప్రాబ్లమ్స్ భరించలేక అరటితోట సాగు చేసుకుంటున్నా.
కరవొచ్చి, నీళ్లు లేక, సేద్యానికి సర్వమంగళం పాడి, ఇక లాభం లేదు... నాలుగు సమాధానాలు వెనకేసుకుందామని వెనక్కి వచ్చేశా. నువ్వు బెట్టు చెయ్యకుండా ఒక్క ఫ్రెష్ అరటిపండు ఇవ్వు నీలాంబరీ. అదే చేత్తో ఆ లవర్ బాయ్‌కి కూడా ఒక అరటిగెల పంపించు. అరటిపండును ప్రేమించడం మొదలుపెడితే పండు లాంటి కెరియర్ మీద శ్రద్ధ పెరుగుతుంది. అమ్మాయిల మీద ధ్యాస తగ్గుతుంది. ఏమంటావు నీలాంబరీ’’ అన్నాను. ‘‘అరటితోట వర్కవుట్ కాక, మీరు అరటిపండు దగ్గరికి వచ్చారు. అలాగే లవర్ బాయ్‌కి లవ్వు వర్కవుట్ కాలేదు కాబట్టి అరటిగెల పంపిస్తున్నారు’’ అంటూ ఫక్కున నవ్వింది నీలాంబరి.
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్