నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హలో. రామ్ సర్. మీరు, నీలాంబరిగారు ఎలా ఉన్నారు? సర్... నాకు అబ్బాయిలంటే ఇష్టముండదు. కానీ ఒక అబ్బాయంటే ఇష్టం. తనకు కూడా నేనంటే ఇష్టమే. ముందు సిస్టర్ అనేవాడు. తరువాత లవ్ అన్నాడు. తను మంచివాడు. తెలివైనవాడు. మా కులాలు వేరు. తను జీవితంలో ఉన్నతంగా జీవించాలనుకుంటున్నాడట.
నిన్ను పెళ్లి చేసుకుంటే మా తల్లిదండ్రులు బతకరని చెప్పాడు. కాని, నన్ను జీవితాంతం ప్రేమిస్తానని అన్నాడు. అలాంటివాడు ఎందుకు లవ్ చేసాడు? అర్థం కాలేదు. నేను బాగా చదువుకుని మా అమ్మానాన్నలు చూసిన సంబంధమే చేసుకోవాలను కుంటున్నాను. కాని అతణ్ణి మరిచిపోలేకపోతున్నాను. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. చదవలేక పోతున్నాను. పరిష్కారం తెలుపండి.– తేజస్విని, ఈ–మెయిల్ ద్వారా
నీలాంబరీ... ప్లీజ్ కమ్ హియర్. తొందరపడొద్దు... అరిటి గెల అక్కడ పెట్టి... కమ్ హియర్... నీకు ఎవరైనా చక్కెరకేళి అని కర్పూరం పండు ఇస్తే... చీటా కేలా అని కూర అరటి కాయ ఇస్తే... అమృతపాణి అని కొమ్ము అరటి పండు ఇస్తే...? నీలాంబరి ఫక్కున నవ్వింది. ‘అరటిపండు మీద రీసెర్చ్ చేస్తున్నారా సార్. నిన్నే ఎవరికో సమాధానం పెట్టారు... రీసెర్చ్ ఆపి సెర్చ్ చేసుకోమని’ అంది. ‘మొన్నెప్పుడో నువ్వు డోర్‌లో అడ్డుపడినందుకే ఆన్సర్ ఇచ్చే ముందు నువ్వు గుర్తుకొచ్చావ్. నువ్వు గుర్తు రాగానే అందమైన అరటిపండు గుర్తుకొచ్చింది. అరటిపండు గుర్తుకు రాగానే చక్కెరకేళి, కర్పూరం పండు, చీటా కేలా, కూర అరటి కాయ, అమృతపాణి, కొమ్ము అరటిపండు ఇలా అన్ని రకాలు గుర్తుకొచ్చాయి. మనుషుల్లో కూడా అన్ని రకాలు ఉంటారు. అమ్మాయిలు ఏ రకాన్నైనా ప్రేమించొచ్చు. తినొచ్చు. కోసుకుని కూర చేసుకోవచ్చు. కానీ మై డియర్ తల్లి... డియర్ బంగారు తల్లి... మై స్వీటెస్ట్ చెల్లీ... ఎందుకమ్మా నీకీ లొల్లి. పండులాంటి నీ జీవితాన్ని మింగి తొక్క కాలికింద వేస్తానంటున్నాడు.
కాలు జారి పళ్లు రాలగొట్టుకుంటామా? గుండె పగిలి ముక్కలు చేసుకుంటామా? జీవితం బద్దలు కొట్టుకుంటామా? నిన్ను జీవితాంతం ప్రేమిస్తా్తనంటాడు... కానీ జీవితంలో పెళ్లి చేసుకోనంటున్నాడు... వాడొక దుష్ట్ దుర్మార్గ్ డర్టీ డంకనక డింకుక డర్టీ ఫెలో. వాడిని తలుచుకుని మర్చిపోలేక నీ లైఫ్ లక లక లక చేసుకోకు. వెంటనే బాత్‌రూమ్‌లోకి వెళ్లి, నాలిక గీసుకుని, యాక్ అని ఆ దుర్మార్గుడి జ్ఞాపకాన్ని కాండ్రించి ఊసి ట్యాప్ ఆన్ చేసి వెళ్లి బాగా చదువుకో. బెస్టాఫ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్.
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com