నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్, రామ్ అన్నయ్య. దయచేసి నా ప్రాబ్లమ్‌కి మీరైనా పరిష్కారం చెప్పండి. సెవన్ ఇయర్స్ నుంచి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కాని వేరువేరు కులాలు కావడంతో ఇరువైపులా పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. లవ్ చేసినవాడే కావాలనుకుంటే మా చావుని చూస్తావని అమ్మ, నాన్న అంటున్నారు. ఈ రోజుల్లో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం కామన్ అయినా మేము మాత్రం పెద్దల అంగీకారం కోసమే ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం తను వేరే కంట్రీలో జాబ్ చేస్తున్నాడు. మధ్యలో ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ల పేరెంట్స్‌తో మా పెళ్లి విషయమై గొడవ పడ్డాడు. వాళ్ల ఫ్యామిలీకి పొలిటికల్ బేక్‌గ్రౌండ్ ఉంది. ఆల్ రెడీ వాళ్ల ఫ్యామిలీలో వాళ్ల సొంత బాబాయ్ ఇంటర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరికీ తెలీకుండా ఆ అమ్మాయిని, అమ్మాయి కుటుంబాన్ని బెదిరించి పంపేశారు. డబ్బు తీసుకుని వెళ్లిపోయిందని అబద్ధం చెప్పి వాళ్ల బాబాయ్‌కి వేరే పెళ్లి చేశారు.
10,15 ఏళ్ల తరువాత ఈ మేటర్ వాళ్ల బాబాయ్‌కి తెలిసి ఆ బెంగతోనే ఆయన చనిపోయారు. అలానే నాకు కూడా అన్యాయం చేస్తారేమోనని నా బాయ్‌ఫ్రెండ్ భయపడుతున్నాడు. ఇప్పుడు మా పేరెంట్స్ నాకు 2, 3 నెలల్లో పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. తను కాకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచననే నేను భరించలేకపోతున్నాను. ఫ్లీజ్ రామ్ అన్నయ్యా.. దయచేసి పరిష్కారం చెప్పండి.
– కావ్య, విజయవాడ
అబ్బాయి ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ కుటుంబంలో ఎక్కడో బ్యాలెన్స్ తప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాబాయ్ నుంచి భార్యను దూరం చేశారు. ఒక అందమైన ప్రేమకథకు బాబాయ్ ప్రాణాలను కూడా పణంగా వేశారు. ఎంతో గారాబంగా పెంచుకున్న నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టాలనుకున్నప్పుడు ఆ కుటుంబం బాగోగులు కూడా చూడక తప్పదు కదా?
మీ అమ్మ, నాన్న నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నీకు తెలీదూ? విషయం పరువు, ప్రతిష్ట మాత్రమే కాదేమో. నీ భవిష్యత్ కూడా అయి ఉండొచ్చు. నీ జీవితం బాగుండదేమో అన్న భయంతోనే నువ్వు మాట వినకపోతే ప్రాణాలు సైతం ఇస్తామంటున్నారు మమ్మీ డాడీ. నా మాట విని ఓ పని చెయ్యి. అమ్మనాన్నలని బాగా ప్రేమించు. బాగా అంటే బాగా.. బాగా.. ప్రేమించు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్లకు అన్ని సేవలు చెయ్యి. నువ్వు కూడా అమ్మానాన్నలను ఎంతగా ప్రేమిస్తున్నావో వాళ్లకు తెలియనియ్యి. త్యాగం చూపని ప్రేమ ప్రేమే కాదు. కష్టం చేయని ప్రేమ ప్రేమే కాదు. నీ సమయాన్ని, నీ ఆలోచనల్ని, నీ ప్రేమని, నీ శక్తిని తోడి మరీ అమ్మానాన్నలకు సేవ చెయ్యి. నువ్వైనా అమ్మనాన్నల ప్రేమని అర్థం చేసుకుంటావ్. లేదా అమ్మానాన్నలైనా నీ ప్రేమను అర్థం చేసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ బంగారు తల్లి.
నీలాంబరి దగ్గరకొచ్చేసింది. ఎమోషనల్‌గా నన్ను ఊపేస్తుందా అన్నంత భయమేసింది. చెమ్మగిల్లిన కళ్లు తుడుచుకుంటూ ‘యూ ఆర్ సో నైస్ సార్. ఇవాళ అరటి పండు కాదు, బనానా మిల్క్ షేక్ చేసిపెడతా’ అంటూ లోపలికి వెళ్లింది.
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com