ఎక్కడో అంటార్కిటికాలోని పక్షులు... ఉత్తరాన సైబీరియాకు వలస వెళుతూంటాయి. ఎలా? వాటిల్లో భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించే కంపాస్ లాంటిది ఉంటుంది కాబట్టి! మరి.. ఈ అయస్కాంత క్షేత్ర ధ్రువాలు తిరగబడితే? అలా ఎందుకు అవుతుందనుకోవద్దు. త్వరలోనే ఇది జరగబోతోంది. కొంచెం గందరగోళంగా అనిపిస్తోందా...? వివరంగా అర్థం చేసుకుందాం. భూగర్భంలో కుతకుత ఉడికే ఇనుము ఉంటుంది. ఇది అటు ఇటు ప్రవహించే క్రమంలో భూమి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి కాబట్టే.. మన కంపాస్‌లలో చూపే ఉత్తరం.. అయస్కాంత క్షేత్రం తాలూకు దక్షిణ ధ్రువమై ఉంటుంది. త్వరలో ఉత్తరం.. దక్షిణంగా మారనుంది. అలాగే దక్షిణ ధ్రువం కాస్తా ఉత్తరంగా మారనుంది.
ఇంకోలా చెప్పాలంటే ఆర్కిటిక్ ప్రాంతం అయస్కాంతక్షేత్ర దక్షిణ ధ్రువంగా మారితే.. అంటార్కిటికా కాస్తా ఉత్తర ధ్రువ ప్రాంతంగా మారుతుందన్నమాట. గత శతాబ్ద కాలంలో అయస్కాంత ధ్రువం ఏటా దాదాపు 64 కిలోమీటర్ల చొప్పున స్థానభ్రంశం చెందుతూ వస్తోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే దీనివల్ల మనకేమీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఎందుకంటే దాదాపు రెండు మూడు లక్షల ఏళ్ల క్రితం కూడా ధ్రువాలు తారుమారైనప్పుడు ఎలాంటి విపత్తూ జరగలేదని శిలాజాల ద్వారా తెలుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాకపోతే మెదడులోనే కంపాస్‌లు కలిగి ఉండే వలస పక్షులపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
పిలిస్తే పలికే అలెక్సా చేతుల్లోకి వచ్చేస్తోంది..
అమెజాన్ అలెక్సా గురించి మీరు వినే ఉంటారు. కృత్రిమ మేధ సాయంతో నిర్మాణమైన ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ మీరు ఏ ప్రశ్న అడిగినా ఠకీమని సమాధానమిస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకూ అంటే.. త్వరలోనే ఇది వాచీల్లోకి ఇమిడిపోనుంది కాబట్టి! ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉండే అలెక్సా – ఎకో చిన్న డబ్బా సైజులో ఉంది. దీన్ని ఇంట్లో ఉంచుకుని.. తగిన నెట్‌వర్కింగ్ చేసుకుంటే.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ దీని సాయంతోనే నియంత్రించవచ్చు.
‘‘అలెక్సా.. ఏసీ ఆఫ్ చేసేయ్’’ అంటే వెంటనే కట్టేస్తుందన్నమాట. ఇంతటి శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్‌ను త్వరలో లాస్‌వెగాస్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారని సమాచారం. ఇప్పటికే అందుబాటులో ఉన్న అలెక్సా మొబైల్ యాక్సెసరీ కిట్ సాయంతో డెవలపర్లు దాదాపు అన్ని రకాల వేరబుల్స్ (ధరించగలిగేవి)లోకి అలెక్సాను జొప్పించవచ్చునని అమెజాన్ అంటోంది. ఆడియో పరికరాల తయారీ సంస్థ బోస్ అలెక్సా సాయంతో అత్యాధునిక ఇయర్‌ఫోన్లను తయారుచేసేందుకు రెడీ అవుతూంటే మొబైల్ ద్వారా కూడా అలెక్సా సేవలు అందించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మొబైల్ యాక్సెసరీ కిట్‌ను అందుబాటులోకి తేవడం వల్ల హార్డ్‌వేర్ కంపెనీలు సాఫ్ట్‌వేర్ కోడింగ్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని అమెజాన్ ప్రతినిధి గగన్ లూథ్రా తెలిపారు.
కళ్లలోకి చూస్తే... జబ్బులేమిటో తెలుస్తాయా?
కళ్లు మన మనసులోని భావాలను ప్రదర్శించేందుకు కొద్దోగొప్పో ఉపయోగపడతాయిగానీ.. బబ్బుల వివరాలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోనవసరం లేదు. అంతా డీప్ లెర్నింగ్ టెక్నాలజీ మహిమ. విషయం ఏమిటంటే.. గూగుల్‌కు చెందిన పరిశోధన విభాగం కేవలం కళ్లలోని భాగాల తాలూకూ ఫొటోల (ఫండూస్ ఇమేజెస్ అని పేరు) ద్వారా వారి వయసుతోపాటు రక్తంలోని చక్కెర శాతం (హెచ్‌మీఏ1సీ), రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వంటి వివరాలన్నింటినీ సేకరించవచ్చునని ప్రకటించారు. ఇందుకోసం గూగుల్ రీసెర్చ్ విభాగపు శాస్త్రవేత్తలతోపాటు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు దాదాపు 2.8 లక్షల మంది కనుగుడ్డు తాలూకు చిత్రాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశీలించారు.
టెన్సర్‌ఫ్లో అనే కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ సాయంతో జరిపిన ఈ పరిశీలన ద్వారా చెప్పుకోదగ్గ కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫిలిప్ నీల్సన్ తెలిపారు. డీప్ లెర్నింగ్, మెషీన్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్లు కనుగుడ్లను మాత్రమే కాదు... అతిసూక్ష్మమైన కణాల ఛాయాచిత్రాలతోనూ మనుపు ఎన్నడూ సాధ్యం కాని పనులు చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం తాము ఉపయోగించిన సమాచారం చాలా చిన్నదని, మరింత ఎక్కువ సంఖ్యలో చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ పద్ధతులకు పదును పెట్టవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment