త్రీమంకీస్ - 46 | malladhi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 46

Published Wed, Dec 3 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

త్రీమంకీస్ - 46

త్రీమంకీస్ - 46

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 46
 
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘అవును. బెయిల్ టైం అయ్యాక తిరిగి లొంగిపోకపోవడం.’’
 ‘‘అయ్యో!’’
 ‘‘మీరెప్పుడు బయటకి వస్తారు?’’
 ‘‘ఏదీ? లోపలకి వచ్చి ఇవాళ్టికి నాలుగు రోజులేగా?’’
 ‘‘అలాగా? ఐతే రెండు, మూడేళ్ళు కేసు, ఒకటిన్నర ఏళ్ళ జైలు శిక్ష. మొదటి నేరమా?’’
 ‘‘అవును. మొదటి రెండు నేరాలు. బేంక్ దొంగతనం. బైక్ దొంగతనం.’’
 ‘‘మీతో మాట్లాడాలనిపించి వచ్చాను. మీకు బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరా?’’
 ‘‘లేరు.’’
 ‘‘బెస్ట్‌ఫ్రెండ్ ఒక్కడూ లేడా?’’
 ‘‘వాళ్ళంతా లోపలే ఉన్నారు.’’
 ‘‘అరె! నేనా ప్రయత్నం చేస్తాను. మా ఆస్థాన లాయర్ ఎటూ ఉన్నారు.’’
 కపీష్ మొహం వికసించింది.
 ‘‘నా ఫ్రెండ్స్ ఇద్దరి సంగతి కూడా దయచేసి చూడండి. పాపం వాళ్ళిద్దరి బెస్ట్‌ఫ్రెండ్ జైల్లోనే ఉన్నాడు. వాడు వీడే’’ తన వంక వేలితో చూపించుకున్నాడు.
 ‘‘అలాగే. కేసు వివరాలు కోర్ట్‌లో తీసుకుంటాను.’’
 ‘‘ఫస్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.’’
 ‘‘అక్కడి సిబ్బందంతా నాకు బాగా పరిచయం. మా అన్నయ్య మీద అక్కడ పదిహేడు కేసులు నడుస్తున్నాయి. మీకు పెళ్ళైందా?’’
 ‘‘మీరింత దాకా నాకు తారసపడకుండానే? ఇంకా లేదు.’’
 ‘‘ప్రామిస్?’’
 ‘‘ప్రామిస్ లేదా మీ అన్న... మీకూ కాలేదుగా?’’ నవ్వాడు.
 ‘‘ప్రామిస్ పెళ్ళైతే కాలేదు’’ అని చెప్పి వారిద్దరికీ మధ్య అడ్డుగా ఉన్న అద్దం మీద రుధిర తన అరచేతిని ఉంచింది.
 కపీష్ కూడా ఇవతల నించి అద్దం మీద ఆమె అరచేతి మీద తన అరచేతిని ఉంచాడు.
 ‘‘బై’’ చెప్పి లేచింది.
 ‘‘బై... అప్పుడప్పుడు వస్తూండండి.’’
 రుధిర వెళ్తూంటే అనుకున్నాడు, ఈమె సినిమాల్లో ట్రై చేస్తే హీరోయిన్ పక్కన గ్రూప్ డేన్సర్ వేషం దొరికేదని!
 తిరిగి వెళ్తూ గార్డ్‌ని అడిగాడు.
 ‘‘ఇక్కడ సెల్‌ఫోన్ ఎంతేంటి?’’
 ‘‘కావాలా? ఏభై వేలు. విత్ అన్‌లిమిటెడ్ ఫ్రీ టాక్ టైం. ఫ్రం బిఎస్సెన్నెల్ టు బిఎస్సెన్నెల్.’’
 ‘‘చవకే. ఆలోచిస్తాను.’’
 ‘‘హాఫ్ బాటిల్ రమ్ వెయ్యి. కిన్లే సోడా బాటిల్ నూట ఏభై. అదీ ఆలోచించు. సిగరెట్ కూడా కావాలా?’’
 ‘‘అబ్బే! సెల్‌ఫోన్ అలవాటైనట్లుగా ఆ రెండూ ఇంకా అలవాటు కాలేదు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘బయట బిజీగా ఉంటారుగా. ఏదైనా అలవాటు చేసుకోడానికి ఇది మంచి చోటు. ఓ రోజు ముందు అడిగితే చాలు.’’ గార్డ్ సూచించాడు.
 12
 ఉదయం నిద్ర లేచాక రోల్ కాల్‌కి వెళ్ళబోయే ముందు వానర్ బాత్‌రూంలోకి వెళ్ళాడు. అతనికి బాత్‌రూంలోని ఓ కేబిన్‌లోంచి దుర్యోధన్ మాటలు గుసగుసగా వినిపించడంతో ఆ తలుపు పక్కన ఆగి చెవి ఆనించి విన్నాడు.
 ‘‘రేపు రాత్రికే.’’
 ‘‘...’’
 ‘‘మూడున్నరకి.’’    
 ‘‘...’’
 ‘‘అవును. ఆ సెల్‌లోంచే. బయటకి వెళ్ళాక మిగిలిన సగం నీకు ముడుతుంది.’’
 ఫ్లష్ చేసిన నీళ్ళ శబ్దం వినపడగానే వానర్ పక్క కేబిన్‌లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. దుర్యోధన్ బయటికి వెళ్ళాక ఆ కేబిన్ తలుపుని తెరిచి లోపలకి వెళ్ళి వెదికాడు. అతను ఊహించినట్లుగానే ఫ్లష్ టేంక్‌లో వాటర్‌ప్రూఫ్ కవర్లోని సెల్‌ఫోన్ కనపడింది. జైల్లో ఆకస్మిక దాడులు జరిపినప్పుడు మొబైళ్ళ కోసం వెతుకుతారని దుర్యోధన్ దాన్ని అక్కడ దాచాడని వానర్‌కి అర్థమైంది. ఆఖరిసారి డయల్ చేసిన నంబర్ జైల్లో అతనికి సహకరించే సిబ్బందికి చెందిందని వానర్ ఊహించాడు.
 బయటికి వచ్చి ఆరుబయట రోల్ కాల్ కోసం వదిలిన రిమాండ్ ఖైదీల్లోని తన మిత్రులిద్దరి కోసం వెదికాడు. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
 ‘‘నువ్వే బెటర్ బ్రదర్. నీకు బెయిల్ ఇప్పించే గర్ల్‌ఫ్రెండ్ దొరికింది. మేం ఇద్దరం ఉట్టి ఆవారాగాళ్ళం. మాకు బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘నిజమే. డబ్బు లేకపోతే డుబ్బుకి కొరగాడు అనేది మా నాయనమ్మ.’’
 ‘‘డుబ్బు అంటే?’’
 ‘‘అడగలేదు. పారిపోవడానికి ఇంకేదైనా ప్రయత్నం చేయాలి’’ కపీష్ చెప్పాడు.
 వానర్ వాళ్ళ దగ్గరకి ఉత్కంఠగా వచ్చాడు. అతని మొహంలోని భావాలని గ్రహించిన కపీష్ అడిగాడు.
 ‘‘ఏమిటి?’’
 వానర్ వారి దగ్గరకి వెళ్ళి తను విన్న విషయాన్ని వివరించాడు.
 ‘‘అదా సంగతి’’ వెంటనే కపీష్ చెప్పాడు.
 ‘‘ఓ! నీకు అర్థమైందా?’’
 ‘‘అయింది. సొరంగం తవ్వకం పూర్తయింది. రేపు రాత్రే వాళ్ళు పారిపోతున్నారు. సరే. మనం కూడా వాళ్ళతోపాటు ఆ సొరంగం లోంచి బయట పడదాం.’’
 (జైల్లోంచి తప్పించుకునేందుకు కపీష్ చెప్పిన ప్లానేంటి?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement