
ప్రతీకాత్మక చిత్రం
శాంత మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో నర్సు. భర్త, రెండేళ్ల బాబు, అత్తమామలు గద్వాలలో ఉంటారు. గంట ప్రయాణమే కాబట్టి రెండు రోజులకోసారి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది శాంత. ఉన్నట్టుండి ఇదిగో, ఈ ‘కరోనా భూతం’ విరుచుకు పడటంతో లాక్‌డౌన్ ప్రకటించారు. మరిక టౌన్నుంచి కదలటానికి వీల్లేకపోయింది శాంతకు. మరోవైపు హాస్పిటల్లో పురిటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. తన డ్యూటీ పురుళ్ల వార్డులో కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖానికి మాస్కు, చేతులకు గ్లవ్స్‌తోపాటుగా ఆసుపత్రిలోకి అడుగు పెట్టిన వెంటనే, ఆ తర్వాత ప్రతీ అరగంటకోసారి చేతులు కడుక్కోవటం, శానిటైజర్ ఉపయోగించటం తప్పనిసరి. పేషెంట్సుకి సంబంధించినవారిని రావద్దనీ, చూలింతల, బాలింతల ఆహార, ఆరోగ్య విషయాలు తామే చూసుకుంటామనీ, లాక్ డౌన్ అయ్యేవరకూ డిశ్చార్జ్ చేయము అనీ గట్టిగా చెప్పేశారు హాస్పిటల్ వారు. దానితో శాంతలాంటి నర్సులకు డ్యూటీ గంటలు ఎక్కువ అయ్యాయి. తనకు పనంటే భయం లేదు. పైగా ఎంతో ఇష్టంగా చేస్తుంది. కానీ పిల్లవాడిపైనే బెంగగా ఉంటోంది. తల్లి మనసు కదా.
ఆ రాత్రి శాంత మొబైల్ ఫోన్ మోగింది. అటునుంచి భర్త నరేందర్. ‘‘శాంతా, ఎట్లున్నవ్? తింటున్నవా? మేమంతా మంచిగున్నం. పోరడి గురించి బెంగవద్దు. అమ్మ మంచిగా చూసుకుంటుంది. నువ్వు జెప్పినవుగా మేము ఇంట్లనే ఉన్నం. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు నువ్వు జెప్పిన జాగర్తలు పాటిస్తం... ఫికర్ చేయకు...’’ అని చెప్పాడు. ‘‘అట్లనే... నేను మంచిగున్న..’’ అని ఉబుకుతున్న కన్నీటిని ఆపుకుని చెప్పింది శాంత. తడిసిన కనుకొలకులను కొనగోట తుడుచుకుని ఫోన్ కాల్ కట్ చేసాడు నరేందర్.– నండూరి సుందరీ నాగమణి