సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే.
బిందు, కనకదుర్గే అనుకున్నాం. అంతకుముందు జనవరి ఒకటిన తమిళ సంతతి మలేసియా మహిళలు ముగ్గురు, వాళ్లు కాకుండా మరో నలుగురు కూడా గర్భగుడిలోకి వెళ్లొచ్చినట్లు బయటపడింది. బిందు, కనకదుర్గ వెళ్లొచ్చిన మర్నాడు కూడా శ్రీలంక మహిళొకరు దర్శనం చేసుకుని వచ్చారు. అయితే ఈ పది మందిలో బిందు, కనకదుర్గ తప్ప మిగతా వారెవరూ తాము గుడిలోకి ప్రవేశించినట్లు ఒప్పుకోవడం లేదు. బిందు, దుర్గ యాక్టివిస్టులు కనుక సుప్రీం కోర్టే అనుమతి ఇస్తే అడ్డుకోడానికి మీరెవరు అన్నట్లు చొచ్చుకుని వెళ్లొచ్చారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోయినా వాళ్లు ఇదే పని చేసి ఉండేవారు. స్త్రీ, పురుషులు సమానమన్నది కోర్టు మాత్రమే చెప్పగలిగిన విషయం కాదు. ‘తమరి దగ్గర తక్కెడ ఉంది కదండీ, కాస్త తూచి చెప్పండి.. అటువైపు ఆడ మనిషి, ఇటు వైపు మగ మనిషి.. ఎవరి బరువు ఎక్కువుందో’ అని మనమే వెళ్లి అడిగాం. ‘ఎవరి బరువు ఎంతున్నా, దేవుడి దగ్గర అందరి బరువూ ఒకటే’ అని కోర్టు తీర్పు చెప్పేసింది.
చెప్పి, ఊరుకోలేదు. తీర్పుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే శిక్ష ఉంటుంది అని కూడా హెచ్చరించింది. తీర్పు కోసం వెళ్లి శిక్షను తూయించుకొచ్చాం! వేరే గ్రహాల్లో మనిషికి బరువుండదు. దైవం దగ్గరా అంతే. స్వర్గం అనేది కూడా ఒక గ్రహమే అని మనం అనుకుంటే. తీర్పు ఒకటుండబట్టి, ఆ తీర్పును గాఢభక్తులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి.. ఒకటి.. రెండు.. మూడూ.. అని దర్శనం చేసుకున్న యాభై ఏళ్ల లోపు మహిళా భక్తుల్ని లెక్కిస్తున్నాం కానీ, తీర్పుకు ముందు సంవత్సరాల్లో మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకుని ఉండరా?! ఇంతకంటే ఎక్కువమందే ఉండి ఉంటారు. పట్టింపు కోసమే దర్శనానికి వచ్చేవాళ్లెవరూ ఉండరు. ఆ ఒకరిద్దరు పంతం కోసమే వచ్చారనుకున్నా.. తీర్పు తర్వాత అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంది! అంటే, అయ్యప్ప దర్శనభాగ్యం కోసం ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారనే కదా.
‘ఘనకార్యమా ఇది! వీళ్లేమైనా చంద్రమండలం మీద కాలు మోపారా?’ ఎందుకింత రాస్తున్నారు, ఎందుకింత చూపిస్తున్నారు?’.. అనే ఆగ్రహాలు, ఆవేశాలు శరణు ఘోషలా ప్రకంపిస్తు న్నాయి. ఘనకార్యమే. చంద్రమండలంపైకి వెళ్లడం కన్నా, మండలపూజా దర్శనానికి వెళ్లి రావడం ఘనకార్యమే. చంద్రుడి పైకి వెళ్లడానికి తోడుగా భూలోకపు పంచభూతాలను తీసుకెళతారు. భూలోకంలో ఉన్న ఈ ‘నిషిద్ధ’ భక్తి మండలాన్ని చేరుకోడానికి మహిళలకు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లే ప్రాణాలు తప్ప వేరే తోడు ఉండదు. మరి ఊరుకోవచ్చుగా. దర్శనాన్ని కోరుకుంటున్న మనసు ఊరుకోనిస్తుందా? ఇష్టంలేని పనిని చేయవలసి వచ్చినప్పుడు మనసెంత బాధపడుతుందో, ఇష్టమున్న పనిని చేయకుండా ఉండాల్సి వచ్చినప్పుడూ అంతే బాధపడుతుంది. ఇష్టంలేని పనిని ‘చెయ్యి’ అనడం, ఇష్టమున్న పనిని ‘చెయ్యొద్దు’ అనడం.. ‘నేను నీ కన్నా ఎక్కువ’ అనే భావనలోంచి వచ్చే ఆజ్ఞాపనే.
స్త్రీ విషయంలో.. ‘నీ ఇష్టం’ అనే మాట మనకింకా రాలేదు. ఇంత భాషొచ్చి, ఇంత కవిత్వం రాసీ.. ఆమె దగ్గర ‘నీ ఇష్టం’ అనే మాట మనకు నోరు తిరగడం లేదు. శబరిమల వెళ్లొచ్చిన మహిళల్ని అభినందిస్తూ.. ‘విక్టరీ కాదు. పీరియడ్ ఇది’.. అన్నారు శోభా డే. చరిత్రలో ఇదొక ‘ఎర్ర’ గుర్తు అని. కచ్చితంగా. బిందు, దుర్గ సాధించిన విజయాన్ని హిస్టారిక్ విక్టరీ అంటే తక్కువ చేసినట్లే అవుతుంది. ‘పీరియాడిక్’ హిస్టరీ ఇది. శోభా డే స్త్రీవాద రచయిత్రి. స్త్రీ జీవితంలో అనివార్యమైన ఎరుపు రంగు గురించి కదా మన అభ్యంతరాలు. వాటిని నవ్వుతూ తవ్వుతారు ఆవిడ. మగవాళ్ల గుండె జారిపోతుంది. మానవ సంతతికి ఎరుపు, తెలుపు రెండూ అవసరమైనప్పుడు తెలుపు కూడా బ్లీడింగే కదా.. అది మాత్రం పవిత్రమై, రెండోది కాకుండా పోతుందా అని శోభా డే సందేహం.
సందేహం కాదు. క్లారిటీ అది. సమానత్వ ప్రదర్శనకు దేవుడి గుడే దొరికిందా అనే మాటలో న్యాయం లేదనలేం. అయితే సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే. ఆలయాలకు పద్ధతులుంటాయి నిజమే. ఏ ఇంటికి ఆ పద్ధతి ఉన్నప్పుడు, ఏ ఆలయానికి ఆ పద్ధతి ఉండదా! ఇళ్లల్లో కూడా తమ ఇష్టాలను ఇంటి పద్ధతులకు భిన్నంగా నెరవేర్చుకోకుండా ఏమీ లేరు అమ్మాయిలు. స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాటం కాదది. గుండె నిండా ఊపిరి తీసుకునే ప్రయత్నం. స్పేస్ సరిపోవడం లేదనిపిస్తే పద్ధతుల్ని పక్కకు తోసేయడం సహజంగా జరిగే పనే. ∙
Comments
Please login to add a commentAdd a comment