నిన్న శబరిమల, నేడు అగస్త్యర్‌కూడమ్! మహిళ తన అభీష్టాన్ని నెరవేర్చుకుంది. కోర్టు తీర్పులు తొలగించిన నిషేధంతో తన ఆకాంక్షను శిఖరానికి చేర్చుకుంది. రెండువారాల క్రితం కనకదుర్గ, బిందు.. అయ్యప్పను దర్శించు కుంటే.. రెండు రోజుల క్రితం ధన్య అనే ఐఎఎస్ ఆఫీసర్ అగస్త్యకూడమ్‌ను అధిరోహించారు! ఎవర్నీ నొప్పించకుండా తాను అనుకున్నది సాధించారు.
మహిళలు మగవాళ్ల మధ్య ప్రకృతి పెద్ద తేడానే సృష్టించింది. మహిళలను మానసికంగా శక్తిమంతులను చేసింది, మగవారిని శారీరకంగా శక్తిమంతుల్ని చేసింది. శారీరకంగా మగవారికున్నంత దేహదారుఢ్యం లేదనే కారణంగా మహిళలకు కొన్ని జాగ్రత్తలు చెప్పడం మొదలవుతుంటుంది సమాజంలో. ‘అక్కడికి వెళ్లద్దు, ఇక్కడికి వెళ్లడం కష్టం. ఆ కొండ ఎక్కడం ఎంత కష్టం అంటే ఆడవాళ్లు ఎక్కగలిగిన కొండ కాదది’ వంటి అభిప్రాయాలతో మొదలై, అది కాస్తా క్రమంగా జాగ్రత్త స్థాయి నుంచి నిషిద్ధం స్థాయిని చేరుతూ ఉంటుంది. కేరళలోని 1868 మీటర్ల ఎత్తయిన అగస్త్యర్‌కూడమ్ కొండ కూడా మహిళలకు అలాంటి నిషిద్ధ ప్రదేశమే. కేరళలో ఎల్తైన పర్వతాల్లో రెండవది అగస్త్యర్‌కూడమ్.
పర్వత శిఖరాన్ని అధిరోహించడం సాధ్యమయ్యే పని కాదు. ప్రమాదకరమైన భూభాగం అని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గుర్తించిన ప్రదేశం. ఆ కొండ మీదకు ఆడవాళ్లు వెళ్లకూడదనే నిబంధన ఉండేది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుల్లో శబరిమలకు అన్ని వయసుల మహిళలూ వెళ్లవచ్చనే తీర్పుతోపాటు అగస్త్యర్‌కూడమ్ శిఖరానికి మహిళలు కూడా వెళ్లవచ్చని తీర్పు చెప్పింది. ఆ తీర్పు వెలువడగానే ఆ శిఖరం మీదకు ట్రెకింగ్‌కు వెళ్లడానికి వందమంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్, డిఫెన్స్ అధికార ప్రతినిధి ధన్య సనాల్ కూడా ఉన్నారు. అయితే వాళ్లందరి కంటే మొదట అగస్త్యర్‌కూడమ్‌ను అధిరోహించారామె. ఆ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఈ జనవరి 14న రికార్డు సాధించారు.
ఆందోళనలను అధిగమించింది
పర్వత శిఖరాన్ని అధిరోహించడానికి ధన్య సనాల్‌కి ప్రకృతి పెట్టే పరీక్షలు, వాతావరణ ప్రతికూలతలు ఎదురు కాలేదు కానీ స్థానిక ‘కణి’ గిరిజనుల నుంచి ప్రతికూలత ఎదురైంది. పర్వత శిఖరం మీదున్న అగస్త్య ముని ఆలయాన్ని ఆడవాళ్లు దర్శించుకోవడానికి వీల్లేదని పట్టుపట్టారు ఆ గిరిజనులు. అందుకు ధన్య సనాల్ ‘‘నేను ట్రెకింగ్‌ను ఇష్టపడి ఈ పర్వతాన్ని అధిరోహించాను, అంతే తప్ప ఆలయాన్ని దర్శించుకోలేదు. ఒకరి మనోభావాలన ఇబ్బంది కలిగించడం నా ఉద్దేశం కాదు.
ఈ పర్వతం మీదకు ట్రెకింగ్‌కు వెళ్లడానికి తమ పేర్లను నమోదు చేసుకున్న నాలుగు వేల మందిలో వందమంది మహిళలున్నారు. వారిలో నేనూ ఉన్నానంతే’’ అని సున్నితంగా బదులిచ్చారు. ధన్య సనాల్ వయసు 38, ఆమె 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ‘‘అగస్త్యర్‌కూడమ్ పర్వతం నిటారుగా ఉంటుంది. ఎక్కేటప్పుడు ఏ మాత్రం పట్టు తప్పినా ఊహించలేని ప్రమాదం సంభవిస్తుంది. మహిళలకు కష్టమనే ఉద్దేశంతో ఆ నిబంధన పెట్టి ఉండవచ్చు. నేను శారీరక దారుఢ్యం కోసం రోజూ గంట సేపు వ్యాయామం చేస్తాను. పర్వతాన్ని అధిరోహించడానికి అవసరమైన మానసిక, శారీరకమైన దారుఢ్యం నాకుంది. అందుకే ఈ పర్వతారోహణ చేశాను.
ఇక్కడ ఫిట్‌నెస్ ఒక్కటే ప్రధానం’’ అని కూడా అన్నారామె. ధన్య సనాల్ ఆగస్త్య ఆలయానికి వెళ్లకపోవడంతో కణి గిరిజనులు కూడా ఆందోళనను తీవ్రతరం చేయలేదు. సంప్రదాయ వాదులు కూడా నిషేధం ఉన్నది పర్వతాన్ని అధిరోహించడానికా, ఆలయాన్ని సందర్శించడానికా అనే ధర్మ మీమాంసలో పడిపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ధన్య సనాల్ ఎవరినీ నొప్పించకుండా తాను అనుకున్నది సాధించారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment