మనుషులు చేసిన దేవుడు | Movie review | Sakshi
Sakshi News home page

మనుషులు చేసిన దేవుడు

Published Sat, Sep 19 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM

మనుషులు చేసిన దేవుడు

మనుషులు చేసిన దేవుడు

ఇంటికి తీసుకొచ్చి... ప్రతిష్ఠించి... మనస్ఫూర్తిగా ఆరాధించి...
తనకి నచ్చినవన్నీ వడ్డించి... భజన చేసి... గుంజీలు తీసి...
పండగ చేసి... అదేంటో... తీసుకె ళ్లి నీళ్లల్లో వేసేస్తాం.
పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించిన గణపతిని...
ఆయనతో కొద్దిరోజుల్లోనే పెంచుకున్న అపార మైన ఆప్యాయతని...
అంత సులువుగా తెంపుకుని... ఎలా?
దేవాలయంలో ప్రతిష్ఠిస్తే మనం మునకలు తీస్తాం.
ఏంటో... బొజ్జ గణపయ్యని... అలా?!
ఈ సినిమాలో వినాయకుడి బొజ్జలో స్మగుల్డ్ గూడ్స్ పెడతారు.
కథ రాసేటప్పుడు అపచారం అనిపించే ఉంటుంది.
సెంటిమెంట్‌ని దెబ్బతీస్తామేమో అన్న భయం కూడా ఉండే ఉంటుంది.
అయినా... అలా చేశారంటే...
దేవుడు... దేవుడు చేసిన మనుషుల్లోనే ఉంటాడు...
మనుషులు చేసిన దేవుళ్లలో ఇహబంధాలే ఉంటాయి...
వాటిని నిమజ్జనం చేయగలిగితేనే...
పరిహారం అవుతుందని కావచ్చు.
నిమజ్జనాలు మొదలయ్యాయి.
పెద్ద నిమజ్జనం... వచ్చే ఆదివారం.


కానీ ఈ ఆదివారం ఫ్యామిలీలో మీరు కనులారా వీక్షించబోయే నిమజ్జనం దానికన్నా పెద్దది! సొసైటీలో పెద్దవాళ్లుగా చెలామణి అవుతున్నవారు సర్వసంగ పరిత్యాగుల్లా తయారై దేవుణ్ని తలకెత్తుకుని నిర్వహిస్తున్న మహాయజ్ఞంలాంటి మహా నిమజ్జనం ఇది. కొద్ది క్షణాల్లో రథంపై ఊరేగబోతున్న ఈ వినాయకుడిని అడుగుల్లో కాదు, తులాల్లో కొలవాలి. విగ్రహంలోని మట్టిని కాదు, బంగారాన్ని తూచాలి.
 
గోల్డ్ గణేశ!
ఊరేగింపు ఎటు వెళ్లాలో, ఎలా వెళ్లాలో స్కెచ్ గీసి చెబుతున్నాడు కొంగర జగ్గయ్య.
శ్రద్ధగా వింటున్నాడు విదేశీ ఏజెంటు.
‘వెల్. హియర్ ఇటీజ్. వినాయకుడి రథం ఈ స్పాట్ నుంచి బయల్దేరుతుంది. పురవీధుల గుండా ఊరేగిస్తాం. చిట్టచివరకు ఈ సముద్రపుపాయ ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడ ప్రజలందరూ చూస్తుండగా... ఈ విగ్రహాన్ని నీళ్లల్లో తోసేస్తాం. నీళ్ల అడుగున మీ మనుషులు హుక్స్‌తో రెడీగా ఉంటారు. నీళ్లలో పడగానే విగ్రహానికి ఆ హుక్స్ తగిలిస్తారు. అటు తర్వాత నీళ్ల అడుగు నుంచి దాన్ని షిప్ వరకు లాక్కెళతారు. దట్సాల్.
 
‘డన్’ అన్నాడు ఏజెంటు.
లోపల ఉన్నది కోటి రూపాయల సరుకు! వట్టి సరుకు కాదు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ సంపద.
 
జగ్గయ్య స్మగ్లర్.
ఎప్పుడూ పూల కుండీల్లో దేవతా విగ్రహాలు పెట్టి స్మగుల్ చేసే జగ్గయ్య... ఈసారి హోల్‌సేల్‌గా బొజ్జ గణపయ్య కడుపులో ఉండ్రాళ్లలా దాచి బంగారు విగ్రహాలను విదేశాలకు తరలించడానికి ఏర్పాటు చేసుకున్నాడు.
 
సీన్ క్లైమాక్స్‌కి వచ్చింది!
అడ్డు పడేవాళ్లెవరూ లేరు. అడ్డు పడబోయిన ఎన్టీఆర్ ఆల్రెడీ జగ్గయ్య డెన్‌లో బందీగా చిక్కుకొని ఉన్నాడు. ఎన్టీఆర్‌తో పాటు అతడికి మనసిచ్చిన చిన్నది జయలలిత కూడా అతడితోపాటు బందీగా ఉంది. ఎన్టీఆర్ చెల్లెలు కాంచన మరో సెల్‌లో బందీగా ఉంది. కాంచన ప్రియుడు జగ్గయ్య అదే సెల్‌లో బందీగా ఉన్నాడు. జగ్గయ్య అంటే స్మగ్లర్ జగ్గయ్య కాదు. సాఫ్ట్ క్యారెక్టర్ జగ్గయ్య. (డబుల్ యాక్షన్). ఎన్టీఆర్‌ను ‘బావా’ అంటుండే తాగుబోతు సత్యనారాయణ సేమ్ డెన్‌లో తప్పతాగి పడి ఉన్నాడు.  
 
అప్పుడొచ్చాడు కృష్ణ. దారి వెతుక్కుంటూ డెన్‌లోకి ప్రవేశించాడు.
‘అన్నయ్యా’ అన్నాడు ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి.
‘తమ్ముడూ.. ఆ దుర్మార్గులు మమ్మల్నందర్నీ అంతం చెయ్యడానికి టైమ్ బాంబ్ పెట్టారు’  చెప్పాడు ఎన్టీఆర్.

ఎక్కడుందా టైమ్‌బాంబ్?
స్పృహలేకుండా పడివున్న సత్యనారాయణ చేతుల్లో ఉంది. ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉంది.
 
అక్కడ ఇంకో టైమ్ బాంబ్!
అక్కడ నిమజ్జనం స్టార్ట్ అయింది. వినాయకుడి భారీ విగ్రహం ఊరేగింపునకు సిద్ధమైంది. అదీ ఒక టైమ్ బాంబులా ఉంది. బొజ్జ గణపయ్య కడుపులో బోలెడంత గోల్డ్. ఎన్టీఆర్, కృష్ణ... సమయానికి అక్కడికి చేరుకోలేకపోతే అది విదేశాలకు తరలి వెళుతుంది. ఆపాలి. ఎలా?
ఎన్టీఆర్‌లో టెన్షన్. కృష్ణలో టెన్షన్. ప్రేక్షకులలో టెన్షన్. విలన్ జగ్గయ్య మాత్రం కూల్‌గా ఉన్నాడు. ఎప్పుడూ కనిపించే దానికి భిన్నంగా సూటూబూటులో కాకుండా తెల్లటి లాల్చీ పైజమాలో ఉన్నాడు. మెడలో మాల. ముఖంపై చిరునవ్వు. నుదుటిపై నిలుపు బొట్టు.
 ‘భక్త మహాజనురాలా... పవిత్రమైన మన భారతదేశం ఈనాడు అనేక ఈతిబాధలకు గురవుతున్నదంటే అందుకు కారణం ప్రజల్లో దైవభక్తి లోపించడమే. అందుచేత దేశక్షేమం, ప్రజాక్షేమం కోరి ఈ ఆస్తికతా మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు’ అని ప్రారంభోపన్యాసం చేశాడు.  
 
జై విఘ్నరాజా... జై గణాధిపా...
ఊరేగింపు మొదలైంది. ఊరేగింపు చాటున బంగారు విగ్రహాల తరలింపూ మొదలైంది.
బందిఖానా బద్దలు కొట్టుకుని వచ్చేశారు మన హీరోలు! ‘పాపం బద్దలు కావాలి. మోసం బయటికి రావాలి’ అని పాడారు. ‘నాటి గణపతికి పొట్ట పగిలితే రాలేను ఉండ్రాళ్లు... ఉండ్రాళ్లు. నేటి గణపతికి  బొజ్జ పగలితే రాలను రత్నాలు... రత్నాలు’ అని జనానికి హింట్ ఇచ్చారు. జగ్గయ్య షాక్ తిన్నాడు.
 
‘భక్తులారా... వీళ్లెవరో మన ఆస్తికత్వాన్ని నాశనం చెయ్యడానికి వచ్చిన మతద్రోహులు. జాతిద్రోహులు. ఇలాంటి దైవద్రోహులను ఊరికే విడిచిపెట్టకూడదు. కొట్టండి. పెడ రెక్కలు విరవండి. రథచక్రాలకు కట్టిండి. ఈ నాస్తికుల శవాల మీదుగా మన జగన్నాథ రథాన్ని నడపండి. జై గణాధిపా...’ అని పిలుపునిచ్చాడు జగ్గయ్య.
 
కలకలం మొదలైంది. భక్తజనం కకావికలం అయ్యారు. కోపోద్రిక్తులు అయ్యారు. గాలిలోకి రెండు కాల్పులు కాల్చి వారి దారికి తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ. టెంకాయతో గణపతి పొట్టను పగులగొట్టారు. రత్నాలు, వజ్రాలు పొదిగిన విగ్రహాలు బయటపడ్డాయి. జగ్గయ్య బండారమూ బద్దలైంది.
 
ఎన్టీఆర్‌దే కీ రోల్
దేవుడు చేసిన మనుషులు 1973లో విడుదలైంది. క్లైమాక్స్‌లో నిమజ్జనం సీన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మాటలు త్రిపురనేని మహారథి. పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి.  నిమజ్జనం సీన్, మాటలు, పాటలు... ఈ మూడూ... సినిమాను సూపర్ హిట్ చేశాయి. వాటితో పాటు రమేశ్‌నాయుడు సంగీతం. అప్పటి వరకు మాయాబజార్, గుండమ్మ కథ, పాండవ వనవాసం... ఇవే తెలుగు సినిమా హిట్స్. ఆ వరుసలోకి దేవుడు చేసిన మనుషులు కూడా చేరింది.  నిజానికప్పుడు ఎన్టీఆర్ ఏవరేజ్‌లో ఉన్నాడు. కృష్ణ సాహసం చేసి ఎన్టీఆర్‌ని హీరోగా తీసుకున్నాడు.
 సినిమా ఎన్టీఆర్‌తో మొదలౌతుంది. ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ అనే పాటతో ప్రారంభం అవుతుంది. ఎండ్ సీన్‌లో కూడా ఎన్టీఆర్‌దే కీ రోల్. దేవుడు చేసిన మనుషుల్లారా.. అనేదే కీ సాంగ్. అలా అడుగుడుగునా... ఇరవై రీళ్ల పాటు చిక్కగా కథలను అల్లుకొచ్చారు దర్శకుడు వి.రామచంద్రరావు.
 
‘పోయిన’ కొడుకుపై ఎస్వీఆర్ బెంగ
ఎస్వీరంగారావు పెద్ద జమీందారు. టీ ఎస్టేట్ ఓనర్.  ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఎన్టీఆర్. చిన్నకొడుకు కృష్ణ. కూతురు కాంచన. భార్య ఎస్. వరలక్ష్మి. వారితో పాటు వాళ్ల ఇంట్లో  భార్యగారి తమ్ముడు సాక్షి రంగారావు. ఎన్టీఆర్ చిన్నప్పుడే తప్పిపోతాడు. (తిప్పిపోలేదు, సాక్షి రంగారావే తప్పిస్తాడని తర్వాత తెలుస్తుంది). ‘పోయిన’ కొడుకు కోసం ఎస్వీఆర్ బెంగపెట్టుకుంటాడు. చివర్లో తను చేరదీసిన రామూనే ఎన్టీఆర్ అని తెలుస్తుంది. ఎస్వీరంగారావు (చనిపోయిన) మొదటి భార్య కొడుకే ఎన్టీయార్. చిన్నప్పుడు ఎన్టీఆర్ బర్త్‌డే పార్టీ జరుగుతుంటే... ఆస్తి దక్కకుండా ఉండడం కోసం సాక్షి రంగారావే అక్కతో కలిసి ప్లాన్ వేసి, అతణ్ణి నీళ్లలో తోసేస్తాడు. అలా నిర్మలమ్మకు దొరుకుతాడు ఎన్టీఆర్.
 
కథ మొత్తం ఎస్వీఆర్, ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతుంది. ఇంకో ట్రాక్‌లో జగ్గయ్య అండ్ గ్యాంగ్. కామెడీ ఉండీలేనట్లు ఉంటుంది. అల్లురామలింగయ్యకు, సత్యనారాయణకు మధ్య నాలుగు ముక్కలేవో ఉంటాయి. సినిమా అంతా ఫుల్ ఆఫ్ ఎమోషన్స్.  ఒక రొమాంటిక్ సాంగ్ (దోరవయసు చిన్నది). ఒక ఐటమ్ సాంగ్ (మసక మసక చీకట్లో). ఒక లవర్‌బాయ్ సాంగ్ (ఏ తారలోనూ, నీ తీరు లేదు...) దీన్ని కృష్ణ పాడతాడు. కాసేపు జమునతో, కాసేపు మంజులతో. ఆ తర్వాత వాళ్లిద్దరూ కనిపించరు. గెస్ట్‌రోల్‌లో ఇలా మెరిసి, అలా వెళ్లిపోతారు. ఇవి కాకుండా, ఒక ఉద్వేగ గీతం.. ‘అలనాటి వేణుగానం మోగింది మరల...’ ఇంకోసాంగ్... ‘నీ దగ్గర ఏదో ఏదో ఉంది...’ వలపు సంకెల వేసే పాట. కాంతారావును మాయ చేసి ధ్యాస మళ్లించడానికి జయలలిత పాడుతుంది.
 
నాన్నగారిపై కృష్ణ కినుక
ఎన్టీఆర్ మొదట దొంగ! ఇంటినుంచి తప్పిపోయాక, ఎక్కడెక్కడో పెరిగి, దొంగల సావాసం పట్టి అలా అవుతాడు. ఓ సంఘటనతో అతడికి జయలలిత పరిచయం అవుతుంది. అమె జగ్గయ్య చెల్లెలు (సొంత చెల్లి కాదు). ఇంకో సంఘటనతో అతడు ఎస్వీరంగారావు ఇంటి మనిషి అవుతాడు. ఇది కృష్ణకు ఇష్టం ఉండదు. ఎవడినో తెచ్చి నాన్నగారు ఇంట్లో పెట్టుకున్నారు అనే కోపంతో ఉంటాడు. ఎన్టీఆరే తన అన్న అని తెలిసేంతవరకు అలానే ఉంటాడు. ఈ వాస్తవాలన్నీ ఎన్టీఆర్‌కు తెలిసినా, సమయం వచ్చే వరకు బయటపెట్టడు.
 
చెడపకురా చెడేవు
ఇక విజయనిర్మల పేదింటి అమ్మాయి. సత్యనారాయణ చెల్లెలు. ఎస్టేట్‌లో పని చేస్తుంటుంది. కృష్ణ ఆమె మీద మనసు పడతాడు. ఆ అమ్మాయి కాదంటుంది. ఇతడి పంతం పెరుగుతుంది. అదో ట్రాక్. విజయనిర్మల తల్లి నిర్మలమ్మ చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కృష్ణ వెళ్లి ఆదుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సత్యనారాయణ తన అలవాటుగా రోడ్డుపై నాడా విసిరి, కృష్ణ కారుకు పంక్చర్ వేయడానికి వస్తాడు. టైరు మార్చడానికి వచ్చి కారులో ఉన్న తల్లిని చూసి కుప్పకూలిపోతాడు. సినిమాలో ఇదొక హృద్యమైన సన్నివేశం. చెరపకురా చెడేవు అన్నది నీతి.
 
ఇన్ని ట్విస్టులతో సాగే ఈ కథలో మొదట చెడ్డవాళ్లుగా ఉన్న ఒక్కొక్కరూ ఒక్కో గుణపాఠంతో మారుతూ వస్తారు. ఎట్ ది ఎండ్... చెడ్డవాళ్లు జైలుకు వెళతారు. మంచివారు అనుబంధాలలో చిక్కుకుంటారు. ఎన్టీఆర్‌కి జయలలితకి, కృష్ణకి విజయనిర్మలకి, కాంచనకీ, మంచి జగ్గయ్యకి పెళ్లి.
ఎస్వీరంగారావు ఎస్టేట్ మళ్లీ కళకళలాడుతుంది. స్మగ్లర్లు దొంగిలించుకెళ్లిన శ్రీకృష్ణుడి విగ్రహం తిరిగి ఆ ఇంటికి చేరి శ్రీరామరక్షలా ఉంటుంది. దేవుడు చేసిన మనుషులు రకరకాలు. ఆ మనుషుల్లో కొందరు సాటి మనుషులకు దేవుళ్లలా అనిపిస్తారు. అలాంటి ఒక దేవుడే... కుటుంబాన్ని చక్కదిద్ది, సమాజాన్ని మేల్కొలిపిన ‘రాము’ పాత్రధారి ఎన్టీఆర్.    
 
విశేషాలు
ఎన్టీఆర్ తొలిసారిగా బెల్‌బాటమ్ ప్యాంట్‌తో ఈ సినిమాలో కనిపిస్తారు. కాంతారావు (స్మగ్లింగ్ ముఠా సభ్యుడు)ఇందులో చిన్నపాటి విలన్.  అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఆయన్ని హీరోగా మాత్రమే చూశారు. ఈ చిత్రంలో సూటు బూటుతో కనిపించే కాంతారావు ఆ తర్వాత జానపద చిత్రాలలో నటించడం తగ్గించారు. ఈ చిత్రం సమయంలోనే ఎన్టీఆర్ నా అభిమాన నటుడని కృష్ణ ప్రకటించారు. దేవుడు చేసిన మనుషులు 29 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
 
మళ్లీ చూడండి
రామ్
ఎడిటర్, ఫీచర్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement