
తే.గీ. తల్లి బతుకమ్మ పుట్టుక ధన్యమయెను
పుటుక చరిత్ర యెట్లున్న ముదము గలిగె
నిన్ను కొల్వగా తెలంగాణ నెలతలంత
దీవెనలిడుమమ్మ చెలువల్ తేజమలర
తే.గీ. రకరకాల పూవులనన్ని రమ్యముగను
పేర్చి,రంగుల నద్దియు ప్రేమ తోడ
పసుపు ముద్ద గౌరమ్మగ పైన పెట్టి
పువ్వులను దేవతగతల్చి భువినతివలు
సీ. బతుకమ్మ యాడును పడతులు తొమ్మిది
రోజులు వైవిధ్య పూజ చేత
తొలిరోజు బతుకమ్మ నెలతలెంగిలి పూల
నుచునాడెదరువారు నుతము తోడ
రెండవ రోజున మెండుగ ముదముతో
అటుకుల బతుకమ్మ నాడు రంత
మూడవ రోజున ముద్దపప్పు బతుక
మ్మనుచు మురిపెమంత మదిని గలిగి
తే.గీ. ఆడుదురు వనితలు పాట పాడుకునుచు
నాల్గవ దినమునందున నానబియ్య
ము బతుకమ్మనాడెదరంత మోదమొసగి
పలు విధమ్ముల వేడును పడతులంత
సీ. ఐదవ దినమున యట్ల పేరు యనుచు
ముదిత లాడెదరంత ముదము గలిగి
ఆరవ దినమందలిగిన బతుకమ్మ
యనుచు నాపెదరంత యాట నెమ్మి
వీడి,యేడవ రోజు వేపకాయల బతు
కమ్మని కొలుతురు కమ్మగాను
ఎనిమిదవ దినము నెన్నముద్దల బతు
కమ్మను వేడుక గాడురంత
తే.గీ. తొమ్మిదవ దినమున పరితుష్టి హెచ్చి
సద్దుల బతుకమ్మాడ్దురు చక్కగాను
సాగనంప్దురు పూవేల్పు సౌఖ్యమిమ్మ
పంచు కొందురు వాయనాల్ పడతులంత
- నల్లగొండ సురేశ్
7893636501