కాలర్.. కట్‌చేస్తే ఆభరణం...
పార్టీకి వెళ్లాలంటే డిజైనర్ దుస్తులున్నా సరైనా ఆభరణాలు లేకపోతే మేకప్ సంతృప్తినివ్వదు. వేడుక అంతా తమదే అన్నట్టు తిరగాలంటే మెడనిండుగా నప్పే ఆభరణాలతో కళ కళలాడుతూ ఉంటేనే సాధ్యం. అవి బంగారు, వజ్రాభరణాలే కానక్కర్లేదు. కేవలం ఒక షర్ట్... దానికో కాలర్ ఉంటే చాలు. కట్ చేయచ్చు. ఇలా కంఠాభరణంగా రూపుకట్టేయచ్చు.
పాత చొక్కాలు, ఫ్రాక్‌లు బ్యాగు అడుగనో.. పాత బట్టల మూటలోనో చేరుతూనే ఉంటాయి. వాటి కాలర్స్ చూస్తే ఏదైనా ఆలోచన వస్తుందా?! ట్రై చేయండి. ముందుగా నచ్చిన షర్ట్, ఫ్రాక్ (కాలర్ ఉన్నది) తీసుకొని కాలర్ భాగాన్ని కట్ చేయాలి. కాలర్ ప్లెయిన్‌దైతే మీ టాప్‌కి పూర్తి కాంట్రాస్ట్ ఉండే ప్రింట్లు లేదంటే ఎంబ్రాయిడరీ చేసి హారంలా ధరించవచ్చు. ఇది ఫ్యాషన్ జువెల్రీగా కూడా బాగుంటుంది.
కాలర్‌కి ముత్యాలు ఇతర పూసలు, స్టోన్స్, ఎంబ్రాయిడరీ లేసులు కూడా అతికించి అందమైన కంఠాభరణాన్ని రూపొందించుకోవచ్చు. పెద్ద పెద్ద పూసలు, రిబ్బన్ మెటీరియల్‌ను ఉపయోగించి పిల్లల దుస్తుల మీదకు ఫ్యాన్నీ జ్యువెల్రీగా వాడచ్చు. హెయిర్ క్లిప్‌గానూ తయారుచేయవచ్చు. కాలర్‌కి రెండు వైపులా ఆభరణాలను అతికించి, మరో అందమైన ఆభరణాన్ని తయారుచేసుకోవచ్చు. ఈ తరహా కాలర్ డిజైన్స్ మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.