నాట్‌ మిస్సింగ్‌ | New York City is not the first woman Melanie does not appear | Sakshi
Sakshi News home page

నాట్‌ మిస్సింగ్‌

Published Thu, Jun 7 2018 12:03 AM | Last Updated on Wed, Oct 17 2018 4:36 PM

 New York City is not the first woman Melanie does not appear - Sakshi

ప్రథమ మహిళ మెలానియ కనిపించడం లేదంటూ న్యూయార్క్‌ సిటీలో వెలసిన ఒక పోస్టర్‌

చీమ చిటుక్కుమన్నా పసిగట్టి, విషయాన్ని వెంటనే వైట్‌ హౌస్‌కి చేరవేసే నెట్‌వర్క్‌ ఉన్న అమెరికాలో.. నెల రోజులుగా ఆ దేశపు ప్రథమ మహిళ ఆచూకీ తెలియకపోవడం విశేషమే! ఎట్టకేలకు ట్రంప్‌ భార్య మెలానియ జూన్‌ 4 సోమవారం ప్రత్యక్షమయ్యారు. యుద్ధంలో అమరులైన వీరుల కుటుంబాలను (గోల్డ్‌ స్టార్‌ ఫ్యామిలీస్‌) గౌరవించే వేడుకల్లో మెలనియా కనిపించడంతో ఇంతకాలం ఆమె ఏమయ్యారు, ఎక్కడున్నారు అనే సందేహాలు సద్దుమణిగాయి. ఈ నెల 12న సింగపూర్‌లో జరుగుతున్న జి7 దేశాల సదస్సుకు భర్తతో పాటు కనుక ఆమె కనిపించకపోతే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పచార్లు చేస్తున్న పలు రకాల అనుమానాలకు బలం చేకూరడం ఖాయం అనుకుంటుండగా ఆఖరి నిముషంలో మెలానియ ఒక నక్షత్రంలో మెరిశారు. సోమవారం నాటి సాయంత్రపు వేడుకలకు ప్రెస్‌ను అనుమతించనప్పటికీ మసకగా కనిపిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. అందులో మెలానియ కనిపించారు! ఈ వీడియోను సోషల్‌ మీడియాకు విడుదల చేసింది జెనా గ్రీన్‌ అనే రిపోర్టర్‌. ఆమె తండ్రి 2004 ఇరాక్‌పై ఆమెరికా యుద్ధంలో మరణించారు. దీనిని బట్టే మెలానియ హాజరయింది ‘గోల్ట్‌స్టార్‌ ఫ్యామిలీస్‌’ ఈవెంట్‌ అని మీడియా అంచనా వేయగలిగింది. ఆ తర్వాత మెలానియనే స్వయంగా ‘నేలకొరిగిన వీరులకు నివాళి ఘటించే గౌరవం నాకు దక్కింది’ అని ట్వీట్‌ చేయడంతో ఆ వీడియో వార్త నిజమేనని నిర్థారణ అయింది. ‘నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయిందని మీడియా అనుమానిస్తోంది. అది నిజం కాదు. ఆ ముందు వరుసలో కూర్చొని ఉన్నది ఆమే’నని ట్రంప్‌ ఓ మీడియా ప్రతినిధితో జోక్‌ చేశారు కూడా. 

ఇంతవరకు సంతోషమే కానీ, అసలు ఇన్నాళ్లూ మెలానియ ఏమైనట్లు? మెలానియ చివరిసారిగా ఒక అధికార కార్యక్రమంలో కనిపించింది మే 10న. ఉత్తర కొరియా నుంచి విడుదలై వచ్చిన ముగ్గురు యు.ఎస్‌. మాజీ ఖైదీలకు ఈ భార్యాభర్తలు వెల్‌కమ్‌ చెప్పిన సందర్భం అది. తర్వాత నాలుగు రోజులకు మెలానియ కిడ్నీ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.  మే 19న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ ట్రంప్‌ తన భార్య పేరు తప్పుగా టైప్‌ చేశారు కూడా. వెంటనే పొరపాటు తెలుసుకుని ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసి, కరెక్ట్‌ స్పెల్లింగ్‌తో మళ్లీ పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత మొన్న సోమవారం వరకు మెలానియ కనిపించలేదు. ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని, జీవితంమంటే విసుగొచ్చి ఏవో దూర తీరాలకు చేరుకున్నారనీ, ట్రంప్‌తో విడిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఇంటర్నెట్‌లో రకరకాలుగా ప్రచారం జరిగింది. న్యూయార్క్‌లో ‘మిస్సింగ్‌’ అని ఆమె ఫొటోతో పోస్టర్లు కూడా వెలిశాయి! అప్పటికే మెలానియ ‘బి బెస్ట్‌’ అనే యాంటీ బుల్లీయింగ్‌ (భయపెట్టి వేధించడం) ప్రచారోద్యమాన్ని నడుపుతున్నారు. దీనిపై బిల్లీ అనే టీవీ వ్యాఖ్యాత, ‘కనిపించకుండా పోతే బి బెస్ట్‌ ఎలా అవుతారు మీరు’ అని ట్వీట్‌ కూడా చేశారు. వీటన్నిటికీ సమాధానంగా మెలానియ.. ‘‘నేను వైట్‌ హౌస్‌లోనే ఉన్నాను. చక్కగా, ఆరోగ్యంగా ఉన్నాను.  పిల్లల కోసం, అమెరికన్‌ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. అయితే దాన్ని కూడా మీడియా నమ్మలేదు. అది మెలానియ ఇచ్చిన ట్వీట్‌ కాకపోవచ్చని అనుమానించింది. చవరికి మెలనియా కనిపించడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement