నిగనిగల శిరోజాలకు...
బ్యూటిప్స్
ఎండకాలం శిరోజాల సంరక్షణ సమస్యగా ఉంటుంది. నిస్తేజంగా లేదంటే జిడ్డుగా మారిన శిరోజాలను ఆరోగ్యంగా నిగనిగలాడేలా చేయాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జిడ్డుగా ఉన్న జుట్టుకు కోడిగుడ్డు తెల్ల సొన పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి. జిడ్డు వదులుతుంది. అదే పొడిబారిన జుట్టు గుడ్డులోని పచ్చసొన మాడుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. నెలకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు. తెల్లసొనను రెండు వారాలకు ఒకసారి అప్లై చేయాలి.
జీవం లేకుండా వెంట్రుకలు చిట్లి ఉన్న జుట్టుకు అర కప్పు పెరుగును పట్టించి, 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే శిరోజాలకు జీవకళ వస్తుంది. మాడు బాగా దురదగా ఉండి, పొట్టులా వస్తుంటే మీరు తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేవని గుర్తించాలి. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌ను తలకు మర్దనా చేసి, 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ప్రతి వారం ఇలా చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఎండ తగిలి నిస్తేజంగా మారిన శిరోజాలకు ఆలివ్ ఆయిల్‌లో తేనె కలిపి పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. శిరోజాలకు తగినంత ప్రోటీన్లు అంది పూర్వపు కళ వస్తుంది.