
నో మెడిసిన్ గ్యాస్ గాన్..!
కొందరికి పొడుపు కథలు ఎంతగా చెప్పినా అర్థం కావు. కానీ...
కొందరికి పొడుపు కథలు ఎంతగా చెప్పినా అర్థం కావు. కానీ... సాధారణంగా మనలో 40 ఏళ్లు దాటిన ప్రతివారికీ ఓ పొడుపు కథ వెంటనే అర్థమవుతుంది. అదేమిటో ఓసారి చెప్పుకుందాం. కాళ్లు లేకపోయినా పొట్టలోంచి పైకి తన్నేదేమిటి? గాలి లాంటి తేలిక పేరున్నా గుండెల మీద బరువు పెట్టినట్లుగా ఉండేదేమిటి? కేవలం ఈ రెండు ప్రశ్నలతోనే సమాధానం వచ్చేస్తుంది. ఆ జవాబే ‘గ్యాస్ ట్రబుల్’ అని. పేరులోనే ట్రబుల్ ఉన్నా... మందులేవీ వాడకుండానే గ్యాస్ వల్ల ట్రబుల్ లేకుండా చూసుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
మనం ఆహారం తీసుకోగానే అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం ఆసిడ్ ఉత్పత్తి అవుతుంటుంది. కొందరిలో ఆ ఆసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేకపోతే మరింత ఆసిడ్ ఉత్పన్నం అవుతుంది. ఆసిడ్‌కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. అప్పుడది మన కడుపు కండరాలపైన పనిచేస్తుంటే కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దాంతోపాటూ గ్యాస్ తాలూకు పొగలు (ఫ్యూమ్స్) పెకైగసినప్పుడు దాని ప్రభావం గొంతులోనూ తెలుస్తుంది. కొన్నిసార్లు ఆసిడ్ గొంతులోకి కూడా ప్రవేశించి, చేదుగా అనిపిస్తుంది. దీన్నే ‘వెట్ బర్ప్’ అని కూడా అంటారు. అప్పుడు గొంతు మంటగా అనిపించడం సహజం.
హార్ట్‌బర్న్ అనుకోవడమూ సహజమే!
మనం తిన్న ఆహారం ఈ ఈసోఫేగస్‌లోకి వెళ్లగానే అక్కడ దానిపై ఆసిడ్ ప్రభావం మొదలవుతుంది. ఈసోఫేగస్ దాదాపు గుండె ఉన్న ప్రాంతంలోనే ఉండటంతో ఈ ఛాతీలో మంటను ఒక్కోసారి గుండెమంటగా కూడా పొరబడి ‘గుండెపోటు’గా అపోహపడుతుంటారు. అందుకే దీన్ని ‘హార్ట్‌బర్న్’ అనుకోవడం కూడా సాధారణమే. అయితే మరికొన్ని పరిస్థితుల్లో గుండెకు సంబంధించిన నొప్పి వచ్చినా, దాన్ని ‘ఛాతీలో నొప్పి’ లేదా గ్యాస్‌ట్రబుల్ అనుకొని పొరబడ్డ సంఘటనలూ ఉన్నాయి. అందుకే గ్యాస్‌ట్రబుల్‌ను తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
కారణాలు : గ్యాస్‌ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని... కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం తిన్నవెంటనే పడుకోవడం ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉండటం పీచు తక్కువగా ఉన్న ఆహాపపదార్థాలు తీసుకోవడంతో ఆసిడ్ పనిచేసే సమయంలో కండరాలకు తగినంత రక్షణ కరవై కడుపులో మంట, గ్యాస్ ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆహారనాళం, జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్‌లో ఒక మూత (స్ఫింక్టర్) లాంటి నార్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘జీఈ జంక్షన్’ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా ‘జీఈ జంక్షన్’ అనే మూతలాంటి నిర్మాణం అడ్డుపడుతుంది. అయితే కొన్నిసందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావడం, దాంతోపాటు గ్యాస్, ఆసిడ్ రావడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. ‘జీఈ జంక్షన్’ సరిగా పనిచేయడానికి ఎన్నో అంశాలు దోహదం చేయాలి. ఉదాహరణకు... కడుపు కండరాలు మృదువుగా ఉండటం, అక్కడ స్రవించాల్సిన రకరకాల హార్మోన్లు సక్రమంగా స్రవించడం వంటివి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత జీఈ జంక్షన్ అనే ఆ స్ఫింక్టర్ పూర్తిగా మూసుకుపోవాలి. మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల మందులు, నరాల నుంచి ఆదేశాలు కూడా ఈ ‘జీఈ జంక్షన్’ అనే నిర్మాణం బలహీన పడటానికి దోహదం చేస్తుంటాయి. అప్పుడూ ఆహారంతో పాటు ఆసిడ్ పైకి ఎగజిమ్ముతుంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్‌ట్రబుల్‌కు దోహదపడుతుంటాయి.
చికిత్స : దీనికి నివరణే ముఖ్యమైన చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరం.
గ్యాస్ సమస్య నివారణ ఇలా...
చిన్నచిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం స్థూలకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవడం పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయడం. రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి రాత్రి పూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి రాత్రి నిద్రకు ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడిపైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్ అయిన లెస్ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. ఆసిడ్ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ. మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండును తల క్రింద మాత్రమేగాక మీ భుజాల కింది వరకూ ఉంటే మేలు.
ఇంట్లోనే వైద్యం
అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ-బయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి.