కోటి దీపోత్సవం ఒక ధార్మిక సేవ | NTv Narendra Chowdary special interview | Sakshi
Sakshi News home page

కోటి దీపోత్సవం ఒక ధార్మిక సేవ

Published Sun, Oct 26 2014 10:59 PM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

NTv Narendra Chowdary special interview

దీపం వేద రూపం. దీపారాధన వల్ల గృహానికి కాంతి, దేహానికి శాంతి అందుతాయి. దీపం అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, జ్ఞానజ్యోతిని ప్రసాదించి, సకల దేవతల అనుగ్రహాన్ని చేరువ చేస్తుందని ప్రతి హిందువు విశ్వాసం. ఈ ఆలోచనతోనే ప్రతియేటా కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నారు భక్తి టీవీ వ్యవస్థాపకులు తుమ్మల నరేంద్రచౌదరి. యేటా కోటి దీపోత్సవాన్ని నిర్వహించే ఆయన, ఈ యేడు అక్టోబర్ 27 నుంచి 15 రోజుల పాటు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శతకోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కైలాసాన్ని ఇలకు దించారా అన్నట్టుగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా తెలుగు లోగిళ్లకు దీపం విశిష్టతను తెలియజేస్తున్నారు నరేంద్ర చౌదరి...
ప్రతి యేటాకోటి దీపోత్సవం చేస్తున్నారు.. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రేరణ?
నరేంద్ర చౌదరి: కార్తీకమాసంలో స్త్రీలు దేవాలయాలలో, నదీ తీరాలలో దీపాలు వెలిగించి ఉత్సవాలు జరుపుతుంటారు. వారు చేస్తున్న కార్యక్రమాలు చూశాకే ఈ కోటి దీపోత్సవం ఆలోచన తట్టింది. దానికితోడు పాశ్చాత్య ధోరణులు పెరిగిన నేటి కాలంలో మన వారికి దీప సంస్కృతిని తెలియజేయాలన్న ఉద్దేశంతో కూడా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కేవలం ఆధ్యాత్మిక పరమైనది మాత్రమే కాదు. టీవీ ప్రచారకార్యక్రమం అంతకన్నా కాదు. ధార్మిక సిద్ధాంతాలను కాపాడాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం. దీపం పరబ్రహ్మ స్వరూపం. అది జీవితంలో అశాంతిని పారద్రోలుతుంది. చక్కటి ధర్మ మార్గాన్ని చూపుతుంది. మన సంస్కృతిలో ఒక భాగమైన దీపం మనిషిలోని అంతర్‌జ్యోతికి నిదర్శం. సామూహికంగా దీపోత్సవం జరిపితే, ప్రజలను ఒక మంచి ఆలోచన పట్ల ఆకర్షితులను చేసినవారమవుతామని ఆలోచించాం. ఈ స్ఫూర్తితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రతి తెలుగింటి లోగిలిలో ఎవరికి వారు దీపం వెలిగించుకోవాలనే ఆలోచనతోనే దీన్ని చేపట్టాం. దేశంలోని ప్రధాన పీఠాధిపతులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావాలనుకున్నాం. వారి నోట ధార్మక ప్రవచనాలను ప్రజలకు తెలియజేయాలని ఆశించాం. ఈ దీపోత్సవానికి గత పదేళ్ల నుంచీ ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ఈ ఏడాదీ చేపడుతున్నాం.
     
మీలో ఇంతటి భక్తి పెరగడానికి కారణం... ఇంతకీ మీకు దేవుడంటే భయమా? భక్తా?
ధార్మికంగా భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను. ఉన్నాడంటే ఇవన్నీ చేయడం కరెక్ట్. ఈ కార్యక్రమం అనే కాదు, భక్తి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆచరణలో పెట్టాలనుకుంటున్నాం. ధార్మిక సమ్మేళం ద్వారా శైవం, వైష్ణవం, ద్వైతం, అద్వైతాలకు సంబంధించిన అందరు స్వామీజీలను ఒక దగ్గరకు చేర్చడం, హిందూ ధర్మం మీద చర్చలు జరపడం, దీపోత్సవం ద్వారా ప్రజలలో దీపం ప్రాశస్త్యాన్ని తెలియజేయడం... ఇలా హైందవ ధర్మానికి కట్టుబడి ఉంటాను.  భక్తి కన్నా ముందు ధర్మాన్ని ఇష్టపడతాను. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుందని ప్రగాఢంగా నమ్ముతాను. మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తాను. అవి ముందు తరాలకూ అందజేయాలని ఆశిస్తాను. అలాగే దేవుడు ఉన్నాడనీ నమ్ముతాను. అయితే దేవుడంటే ఉండే భయం వేరు. భక్తి వేరు. నేను దేవుడికి భయపడను. ప్రేమిస్తాను. ఆరాధిస్తాను.
 
ప్రజలలో భక్తి అనే బలహీనతను తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్లాంటివి చేస్తుంటారు అని కొంతమంది అంటుంటారు...
భక్తి అనేది బలమే తప్ప బలహీనత కాదు. అలాగే ధార్మిక కార్యక్రమాలు ఎవరు చేసినా ప్రోత్సహించదగినవే! అనుసరించదగినవే! మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు సాధనంగా ఉపయోగపడతాయి.
 
కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహణ అంత సులువు కాదు. మరి మీరు ఇంత సులువుగా, సజావుగా  నిర్వహణ బాధ్యతలు ఎలా చేపడుతున్నారు?
దేశంలో ఇంత పెద్ద కార్యక్రమం మరెక్కడా జరగడం లేదు. అయినా ఇప్పటి వరకు ఒక చిన్న అగ్నిప్రమాదం కూడా జరగలేదంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరూ ఎంత నిష్టగా, నియమబద్ధంగా ఉంటారో గ్రహించవచ్చు.  భక్తులతోపాటు మా ఉద్యోగులంతా ఈ కార్యమ్రాలలో పాలుపంచుకుంటారు. ప్రతిరోజూ 40-50 వేల మంది పాల్గొనే ఈ కార్యక్రమానికి దీపం వెలిగించడానికి వచ్చేవారికి ప్రమిదలు, నూనె, వత్తులు, అగ్గిపెట్టె... అన్నీ మేమే ఏర్పాట్లు చేస్తాం. వారు వెళ్లేప్పుడు రవికలవస్త్రం, ప్రసాదం కూడా ఇస్తాం. ఇదొక ధర్మకార్యంగా భావిస్తూ చేస్తున్నాం కనుకే ఇప్పటివరకూ ఏ సమస్యలూ తలెత్తలేదు.
 
ఈ కార్యక్రమం చాలా ఖర్చుతో కూడుకున్నదై ఉండాలి..
అవును. పదిహేను రోజుల కార్యక్రమానికి పెద్దమొత్తంలోనే  ఖర్చు అవుతుంది.
 
దీపోత్సవానికి ఇంత ఖర్చు పెడుతున్నారు. దీనికి బదులు మానవ సేవకు ఉపయోగించాలని ఎప్పుడూ అనిపించలేదా? మానవసేవే మాధవ సేవ అంటారు కదా...?
యేటా కార్తీక మాసంలో 15 రోజుల పాటు దేశంలోని కళాకారులందరినీ దీపోత్సవానికి కార్యక్రమానికి పిలుస్తున్నాం. వారిచే ప్రదర్శనలు ఇప్పించి ప్రోత్సిహ స్తున్నాం. అంతరించిపోతున్న కళలను ఈ విధంగానైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం. అలాగే దీపోత్సవం జరిగినన్నాళ్లూ రోజూ 30-40 మంది వేదపండింతులు, అర్చకులను సత్కరిస్తున్నాం. వారిచే ఎంతోమందికి ధార్మిక ఉపన్యాసాలు ఇప్పిస్తుంటాం. వారందరికీ ఈ కార్యక్రమం ద్వారా సత్కారాలు చేస్తున్నాం. దీన్నే గొప్ప సమాజ సేవగా భావిస్తూ చేస్తున్నాను.
 
ఒకసారి ఏదైనా భక్తి కార్యక్రమం తలపెడితే దానిని కొనసాగిస్తూ వెళ్లాలా? ఆపేస్తే ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురవవుతాయని భయం వల్ల చేస్తుంటారా?
అలా ఎప్పుడూ ఆలోచించలేదు. శక్తి ఉన్నంతకాలం ఇలాంటి మంచి పనులు చేస్తూ వెళ్లడమే నా లక్ష్యం. అయినా ముందే చెప్పినట్టు దీన్ని భక్తి కార్యక్రమంగా మేం అనుకోవడం లేదు. ధార్మిక కార్యక్రమంగా భావిస్తున్నాం.
     
యజ్ఞాలు, యాగాల వల్ల సంపద వచ్చిపడుతుందని, పదవులు వరిస్తాయని అంటారు. ఇలాంటి వాటిని మీరు నమ్ముతారా?
నాకలాంటి నమ్మకాలు లేవు. అయితే దేవుడు మనకు మంచే చేస్తాడనే నమ్ముతాను.
     
మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని, ప్రజలకు చేరువ కావడానికే  ఇలాంటి కార్యక్రమాలను వేదికగా చేసుకుంటున్నారని కొందరి అభిప్రాయం...?
అది నిజం కాదు. నాకసలు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. అలాంటప్పుడు లేనప్పుడు, ఈ కార్యక్రమాన్ని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది!
   
భక్తులలో కొందరు మూఢ భక్తులుంటారు. వారినెలా అర్థం చేసుకుంటారు?
దేవుణ్ణి చూశామని చెప్పేవారు ఎవరూ లేరు. కానీ, భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఎవరికైనా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుడికి వెళ్ళి కాసేపు గడిపితే ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడి లేని వారు ఒక రాయిని పెట్టుకొని పసుపు, కుంకుమలు రాసి, బలులు ఇచ్చి పూజిస్తుంటారు. మనం వాళ్లది మూఢభక్తి అనుకుంటాం. వాళ్లేమో మనది మూఢభక్తి అనుకుంటారు. వారికే చిన్న ఆపద వచ్చినా కనపడిన బాబాల కాళ్లు మొక్కుతారు. జబ్బు తగ్గుతుందని చెబితే.. భరోసాగా భావిస్తారు. దానిని మూఢ భక్తి అనకూడదు. అది వారిలోని చిన్న ఆశ. అక్కడే వారికి ప్రశాంతత లభిస్తుంది.
   
మూడేళ్ల క్రితం లక్ష దీపార్చన.. కిందటేడు కోటి దీపోత్సవం.. ఈ యేడాది శతకోటి.. సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. తరువాతి కార్యక్రమం?
2012లో లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని శృంగేరి పీఠాధిపతి జగద్గురువు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి దివ్యసమక్షంలో నిర్వహించాం. విశేష స్పందన వచ్చింది. అదే స్ఫూర్తితో తర్వాతి యేడు కోటి దీపోత్సవం ఏర్పాటు చేశాం. దేశం నలుమూలల నుంచి జగద్గురువులు, పీఠాధిపతులు హాజరయ్యారు. పదిహేను రోజుల పాటు ప్రతిరోజూ పండుగ వాతావరణమే! కైలాసాన్ని తలపించే ప్రాంగణంలో అన్ని రోజుల పాటు కోటిదీపాలను భక్తుల చేత వెలిగింపజేశాం. ఈ సంవత్సరం శతకోటి దీపోత్సవం చేస్తున్నాం. మరిన్ని దీపాలు వెలిగిస్తూ, జీవించినంతకాలం దీపం ప్రాముఖ్యతను ఇలాగే తెలియజేస్తూ, మరిన్ని ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నదే నా ఆకాంక్ష!
 
సంభాషణ: నిర్మలారెడ్డి
 
ఈ మధ్య ప్రజలలో దేవుడి మీద భక్తి విపరీతంగా పెరుగుతోంది. అది భయం వల్ల ఏర్పడిన భక్తా?! టీవీ మాధ్యమం కూడా దీన్ని ప్రోత్సహిస్తోందా?
ఈ ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుందని, ఆ శక్తి పేరు దేవుడని, ఆ దేవుడు తమకు మంచి చేస్తాడని అందరి నమ్మకం. ఆ నమ్మకంతో తమకు తోచిన పూజలు చేస్తుంటారు. భయం కూడా లేకపోలేదు. అలాగని దాన్ని టీవీ మాధ్యమం ప్రోత్సహించట్లేదు. కాకపోతే టీవీ మాధ్యమం ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది. అది తీసుకునేవారిని బట్టి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement