
వన్ వార్.. హండ్రెడ్ డేస్!
రాజులు చేసిన యుద్ధాలు గురించి పుస్తకాలు చదివి తెలుసుకున్నాం. ఆ యుద్ధాలు ‘ఇలా ఉంటాయి’ అని చూపించింది మాత్రం సినిమానే. వెండితెరపై యుద్ధ సన్నివేశాలు చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. కళ్లార్పడం మర్చిపోతుంటాం కూడా.
‘బాహుబలి’లో వచ్చిన భారీ యుద్ధ సన్నివేశం అలాంటిదే. ఇప్పుడు దీన్ని తలదన్నే యుద్ధాన్ని ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’లో చూడనున్నాం. మొదటి భాగంకన్నా రెండో భాగం అన్ని విధాలుగా భారీగా ఉండేలా దర్శకుడు రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వార్ సీక్వెన్స్‌ని భారీగా ప్లాన్ చేశారట. చిత్రంలోని ప్రధాన తారాగణంతో పాటు ఐదు వేల మంది పాల్గొనగా ఈ వార్ చిత్రీకరణ జరుపుతున్నారని సమాచారం.
‘బాహుబలి’లోని యుద్ధ సన్నివేశంలో దాదాపు వెయ్యి మంది పాల్గొన్నారట. సీక్వెల్‌లో అందుకు ఐదింతలు పాల్గొంటున్నారంటే ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. దాదాపు వంద రోజులు ఈ చిత్రీకరణ జరుగుతుందని టాక్. మధ్యలో బ్రేక్ లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరుపుతారట. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితర భారీ తారాగణంతో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.