
క్లిక్ చేసేముందు...
రోజంతా ఉద్యోగ బాధ్యతలతో ఆఫీసులో బిజీబిజీగా ఉండే సృజనకి పెద్ద సమస్య ఎదురైంది. మరో నాలుగు రోజుల్లో కీలకమైన పార్టీ .. వెళ్లడానికి సరైన డ్రెస్‌లేదు.. గంటల తరబడి తిరిగి, షాపింగ్ చేసేందుకు తీరిక లేదు. అప్పుడే తనకో ఐడియా తట్టింది. ఆఫీస్ నుంచి రాత్రి వచ్చీ రాగానే ఆన్‌లైన్లో కొంత సేపు షాపింగ్ సైట్లు వెతికింది. నచ్చిన డ్రెస్‌ని సెలక్ట్ చేసుకుని ఆర్డరిచ్చింది. రెండురోజుల్లో అందుకుంది. నాలుగో రోజున పార్టీలో మెరిసిపోయింది.ఈ ట్రెండ్ కేవలం సృజనకే పరిమితం కాదు. ఇటు సౌలభ్యంతో పాటు అటు చౌకగా కూడా నచ్చినవి కొనుక్కునే వీలు కల్పించే ఆన్‌లైన్ షాపింగ్ ప్రస్తుతం దేశీయంగా శరవేగంగా విస్తరిస్తోంది. వంటింట్లో స్పూన్లు మొదలుకుని కార్ల దాకా ఆన్‌లైన్లోనే కొనేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో అత్యధికంగా మహిళలు, యువత ఉంటున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది వీరంతా ఒక్క క్లిక్‌తో రూ.15,000 కోట్ల విలువైన వస్తువులు కొన్నారంటే నమ్మగలరా? ఆన్‌లైన్ లావాదేవీలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అదే స్థాయిలో మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే షాపింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి భయాలకు దూరంగా ఉండొచ్చు...
స్మార్ట్‌ఫోన్ల రాకతో షాపింగ్ స్వరూపమే మారిపోయింది. గతంలో షాపింగ్‌కి వెళ్ళాలంటే ఒక పెళ్ళికో, శుభకార్యానికో వెళ్ళినట్లు తయారు కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లోనో లేదా ఆఫీసులోంచో నచ్చిన సమయంలో కావాల్సిన వస్తువులను కొనేస్తున్నారు. సంప్రదాయ షాపింగ్ విధానం నుంచి ఆన్‌లైన్ షాపింగ్‌కి మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఒకే చోట అనేక వస్తువులు ఉండటం, సమయం కలిసి రావడమేనని తెలుస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు కూడా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలను రచిస్తున్నాయి. డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో పాత ఖాతాదారులను కాపాడుకుంటూ కొత్త వారిని ఆకర్షించడానికి కొత్తకొత్త ప్రయోగాలను చేస్తున్నాయి.
సమయం ఆదా...: ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక అలా సరదాగా కుటుంబాన్ని తీసుకొని బయటకెళ్లి షాపింగ్ చేయాలని చాలామందికి అనిపించినా... రద్దీ రోడ్లు.. ట్రాఫిక్ జామ్‌లు గుర్తుకు రాగానే ఆ ఊహలకి అక్కడితోనే ఫుల్‌స్టాఫ్ పెట్టేస్తాం. ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినా ప్రతీ షాపింగ్ కాంప్లెక్స్‌లో బిల్లు చెల్లించాలన్నా.. కాఫీ తాగాలన్నా చాంతాడంత క్యూలే... ఆన్‌లైన్ షాపింగ్‌లో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. చక్కగా వేడివేడి కాఫీ తాగుతూ నచ్చిన వస్తువును మీకు అనువైన సమయంలోనే కొనుక్కోవచ్చు.
నచ్చితేనే డబ్బులివ్వండి: వివిధ వస్తువులను కొనడానికి పది షాపులు తిరగకుండా ఒకే చోట పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్ శరవేగంగా వృద్ధి చెందడానికి క్యాష్ ఆన్ డెలవరీ సౌకర్యం ఒకటి. వస్తువు తీసుకున్న తర్వాతనే డబ్బు చెల్లించే అవకాశం ఉండటంతో నమ్మకం మరింత పెరుగుతోంది. దీనికి తోడు ఆన్‌లైన్ సంస్థలు ఎప్పటికప్పుడు డిస్కౌంట్ డీల్స్‌ను ప్రకటిస్తూనే ఉంటాయి.
సెక్యూరిటీ మరవద్దు ఎక్కడ చేస్తున్నదీ ముఖ్యం
సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్ లావాదేవీలను ఆఫీసులు, ఇంటర్నెట్ సెంటర్లు వంటి పబ్లిక్ కేంద్రాల్లో చేయొద్దు. సొంత కంప్యూటర్నే వినియోగించండి. అలాగే మీ కంప్యూటర్‌లో ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడమే కాకుండా మాలేవేర్ నుంచి పూర్తి రక్షణ ఉండే విధంగా చూసుకోండి.
మెయిల్స్‌కి దూరంగా ఉండండి
తెలియని వెబ్‌సైట్స్ కంటే తెలిసి నమ్మకమున్న వాటికేసే మొగ్గు చూపండి. అలాగే ఆన్‌లైన్ పోర్టల్స్ ఎప్పటికప్పుడు ఆఫర్లు, డిస్కౌంట్స్‌ను మెయిల్స్‌కి పంపుతాయి. ఇలా వచ్చే మెయిల్స్ కొన్ని స్పామ్ కూడా ఉండొచ్చు. అందుకే మెయిల్స్‌కి ఆఫర్లు వచ్చినా, అక్కడున్న లింక్ నుంచి కాకుండా నేరుగా ఆ సైట్‌కి వెళ్ళి ఓపెన్ చేయండి. ఇలా వచ్చే మెయిల్స్‌లో యూఆర్‌ఎల్ ఎలా ఉందో గమనించడం మర్చిపోవద్దు. ఏదైనా వెబ్‌సైట్‌కు వెళితే అది ఎంత సెక్యూరిటీ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. యూఆర్‌ఎల్ ఆకుపచ్చ రంగులో కనిపిస్తే ఆ వెబ్‌సైట్ సెక్యూరిటీ ఉన్నట్లు లెక్క. ఉదాహరణకు https://www.onlinesbi.com అనే వెబ్‌అడ్రస్.. టైప్ చేశామనుకోండి. ఈ యూఆర్‌ఎల్ ముందు ఆకుపచ్చరంగులో ఉండి, లాక్ సింబల్ కనిపిస్తే అది సెక్యూరిటీ ఉన్న పోర్టల్ కింద లెక్క. ఒకవేళ మీరు ఎంచుకున్న వస్తువుకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే దానికే మొగ్గు చూపడం ఉత్తమం.
ఇవీ ముఖ్యమే: ఇక మిగిలిన విషయాలకు వస్తే.. పటిష్టమైన పాస్‌వర్డ్ పెట్టుకోవడం, తరచుగా పాస్‌వర్డ్‌లను మార్చడం మర్చిపోవద్దు. మీరు చెల్లింపులు చేస్తున్న సైట్‌కి ‘వెరీసైన్’ గుర్తు ఉందో లేదో చూడండి. అలాగే ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు పాన్‌కార్డ్, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలు అడిగితే అటువంటి సైట్స్‌కి దూరంగా ఉండండి.
విమానం కొన్నాడు!
డల్లాస్ (అమెరికా)కు చెందిన ఇంటర్నెట్ వ్యాపారి మార్క్ క్యూబన్ ఆన్‌లైన్లో ఏకంగా ఓ జెట్ విమానాన్ని కొన్నాడు. 1999 అక్టోబర్‌లో కొన్న ఈ విమానం ధర 4 కోట్ల డాలర్లు... అంటే మన కరెన్సీలో దాదాపు 240 కోట్ల రూపాయలు. ఈ-కామర్స్‌లో ఒకే ఒక్క లావాదేవీ ద్వారా జరిగిన అతిపెద్ద కొనుగోలుగా ఈ ఉదంతం గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది.
విలాసవంతమైన నౌక
పది అంతస్తులతో, సకల సౌకర్యాలున్న గిగా యాట్ (విలాసవంతమైన నౌక)ను ఓ వ్యక్తి ఆన్‌లైన్లోనే కొనుగోలు చేశాడు. హెలిప్యాడ్ సైతం ఉన్న ఈ నౌక ధర 14 కోట్ల డాలర్లు. తన పేరు వెల్లడించవద్దని కొనుగోలుదారుడు కోరడంతో... ఆ వ్యక్తి ఎవరో బహిర్గతం కాలేదు.