పొదుపు.. ఓన్లీ పొదుపు
కంట్రీ కథ - చైనా
ఇప్పుడిప్పుడు కొంత పరిస్థితి మారుతున్నా.. చైనాలో సాధారణంగా పొదుపునకు పెద్ద పీట వేస్తారు. వైద్య చికిత్స ఖర్చులు, విద్య వ్యయాలు అడ్డగోలుగా పెరిగిపోతుండటంతో భవిష్యత్‌లో ఖర్చుల కోసం ముందునుంచే చైనీయులు జాగ్రత్తపడతారు. మిగతా దేశాలన్నింటితో పోలిస్తే.. చేతిలో ఉండే డబ్బులో ఏకంగా 50 శాతం దాకా పొదుపు చేసేస్తున్నారట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది.
చైనాలో ఒకరే సంతానం సిద్ధాంతం ఉండటం, అత్యధికులు మగ సంతానానికే ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల ఆడ పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఉన్న అమ్మాయిలు బాగా స్థితిమంతులైన అబ్బాయిలనే ఎంచుకుంటూ ఉండటంతో మిగతా వారు సోలోగానే ఉండిపోవాల్సి వస్తోంది. అందుకే, ఖర్చులు తగ్గించుకునైనా డబ్బు కూడబెట్టుకుంటే మ్యారేజ్ మార్కెట్లో నెగ్గేయొచ్చన్నది కూడా చైనీయుల పొదుపు మంత్రం వెనుక కారణం కావొచ్చని పరిశీలకుల అభిప్రాయం.
రియల్టీ ఖరీదైనప్పటికీ సొంత ఇంటిపై చైనీయులు ఇన్వెస్ట్ చేస్తుంటారు. సాధారణంగా ఇల్లు కొనుక్కోవాలంటే పాతిక శాతం నుంచి 30 శాతం దాకా డౌన్‌పేమెంట్ చేయాల్సి వస్తుంటుంది. రియల్ ఎస్టేట్ చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో సగటు చైనీయులకు ఇది చాలా పెద్ద మొత్తం. ఇందుకోసం కూడా వారు బాగా పొదుపు చేయాల్సి వస్తోంది. కాస్త స్థితిమంతులు.. పెళ్లి కానుకలుగా తమ సంతానానికి ఇళ్లను బహూకరిస్తుంటారు.
ఇక, తమ దేశంలో కన్నా విదేశీ చదువు బాగుంటుంది, అక్కడికెళ్లి వస్తే ఉద్యోగావకాశాలు కూడా బాగా వస్తాయనే ఉద్దేశంతో విదేశీ విద్య కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇవి కాకుండా ఖరీదెక్కువైనా దిగుమతి చేసుకున్న కార్లనే కొనుక్కోవడానికి ఇష్టపడుతుంటారు చైనీస్. పాత తరంతో పోలిస్తే కొత్త తరం యువత ధోరణి మారుతోంది. ఇతర లగ్జరీ వస్తువుల కొనుగోళ్లవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా పొదుపు రేటును తగ్గించి వినియోగాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది.