ఆశావాదం బతికిస్తుంది!
ఆత్మీయం
ఇద్దరు ౖఖదీలు జైలు ఊచలనుంచి బయటికి చూస్తున్నారు. ఒకడు చుక్కలను చూస్తుంటే, మరొకడు కింద ఉన్న బురదను చూస్తున్నాడు. మనిషి ఎంత కష్టంలో ఉన్నా కూడా ఆశావాదిగా ఉండాలి. మొదట్లో అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే..నీవాయిస్ అంత సూట్‌కాదు అని చెప్పి పంపించేశారు. ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు తొలినాళ్ళలో రికార్డింగ్‌కు వెడితే..నీ గాత్రం పాడడానికి యోగ్యంగా లేదు’’ అని నిరాకరించారు. వాళ్లేమన్నా నిరాశావాదానికి గురయ్యారా? లేదే! అదే అమితాబ్ బచ్చన్ ఈవేళ ప్రపంచ ప్రఖ్యాత నటుడయ్యాడు. ఆయన కంఠాన్ని ప్రత్యేక కంఠమని దేశం ఆరాధిస్తోంది.
ఈవేళ ఎవరి కంఠం వినబడితే మనందరం కళ్ళు మూసుకుని ఆపాత మధురమని ఆస్వాదిస్తామో ఆ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు జీవితంలో పొందిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆయన ఎంత ఉన్నతశిఖరాలకు ఎదిగినా, తన మూలాలను, తొలినాటి దుర్భరమైన పరిస్థితులను చెప్పుకోవడానికి ఎన్నడూ సిగ్గుపడలేదు. సగం నిండిన గ్లాసును చూపించి ఇదేమిటి అనడిగితే ఆశావాది అయితే, దానిలో సగం వరకు నిండా ఉంది అంటాడు. అదే నిరాశావాది అయితే, సగం ఖాళీగా ఉంది అంటాడు. మనిషి కష్టంలో ఉన్నప్పుడు కుంగిపోకూడదు. నిరాదరణ వల్ల నిరాశపడి నీరసించకూడదు. అందులోనే అవకాశాలను వెదుక్కోవాలి. గొప్పవారి విజయ గాథలు అందుకే చదవాలి. వాటినుంచి స్ఫూర్తి పొందాలి.