నువ్వులను ఎగుమతి చేస్తున్నది మన దేశమే!
తిండి గోల
అత్యంత ప్రాచీనమైన పంటగా పేరున్నది నువ్వులకే. అడవిజాతి మొక్కగా పేరున్న నువ్వు మొక్క మూలం ఆఫ్రికా దేశంలో ఉన్నట్టు చారిత్రక కథనాలు ఉన్నాయి. ఇది సాగుపంటగా రూపుదాల్చింది మాత్రం మన భారత్‌లోనే. మన దేశానికి ఎలా వచ్చిందనే లెక్కలు మాత్రం ఎక్కడా లేవు. పురాతత్వ లెక్కల ప్రకారం క్రీ.పూ 3500 - 3050లో మన దేశంలో ఉన్నట్టు గుర్తించగా, క్రీ.పూ 2000ల కాలంలో మెసొపొటమియాలో మెరిసినట్టు ఆ తర్వాత కాలంలో ఈజిప్టులో సాగుపంటగా మారినట్టు లెక్కలున్నాయి. బాబిలోనియాలోనూ నువ్వుల ఆనవాలు ఉన్నాయి.
అధిక ఉష్ణోగ్రత ఉన్న, ఇసుకనేలలైనా, ఎలాంటి వాతావరణ పరిస్థితులలైనా తట్టుకునే నిలిచే గుణం ఉన్నందునే ఇది ప్రపంచమంతా పాకింది. గ్లోబల్ వంటకాలలో విరివిగా వాడే వాటిలో ఏకైక దినుసుగా పేరొందినవి నువ్వులే. అందుకేనేమో నువ్వులు ప్రపంచమార్కెట్లో బిలియన్ డాలర్లను డిమాండ్ చేస్తున్నాయి. నువ్వుల దిగుమతిలో ప్రధమస్థానం జపాన్‌ది కాగా ఆ తర్వాతి స్థానం చైనా కొట్టేసింది. ఉత్పత్తిలోనూ, వాడకంలోనూ, ఎగుమతిలోనూ నువ్వులు భారతీయుల జీవనశైలిలో భాగమయ్యాయి. అందుకే ఈ మూడింటి లోనూ ఇండియాదే ప్రధమ స్థానం.