
భావన కెరీర్‌తో ఆడుకుంటున్నాడా?
ఒంటరి, హీరో, మహాత్మ.. ఇలా తెలుగులో చేసినవి తక్కువ చిత్రాలే అయినా భావన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మలయాళ బ్యూటీ తన మాతృభాషతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మలయాళంలో ఓ హీరో కారణంగా ఆమె కెరీర్ ఇరుకుల్లో పడిందని సమాచారం. ఆ హీరో పేరు దిలీప్. ఇతగాడు భావనకు అవకాశాలు రానీయకుండా చేస్తున్నాడని వినికిడి. దిలీప్, ఆయన భార్య, నటి మంజూ వారియర్ విడాకులు తీసుకున్నారు.
ఆ సమయంలో మంజూ వారియర్‌ను భావన సపోర్ట్ చేసిందట. దానివల్ల భావనపై దిలీప్ ఆగ్రహం చెందాడని, తనకు అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నాడని మలయాళ పరిశ్రమలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ భావన కనుక నటీనటుల సంఘానికి ఈ విషయం గురించి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దిలీప్ తగిన చర్య తీసుకోవాలనుకుంటున్నారట. మరి.. నిజంగానే భావనకు అవకాశాలు రాకుండా దిలీప్ గేమ్ ప్లే చేస్తున్నారా? అదే నిజమైతే భావన నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.