సూదుల బెడద తప్పించే కాగితం సెన్సర్లు... | Paper sensors avoiding needles | Sakshi
Sakshi News home page

సూదుల బెడద తప్పించే కాగితం సెన్సర్లు...

Published Thu, Dec 27 2018 1:05 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Paper sensors avoiding needles - Sakshi

రక్తంలోని గ్లూకోజు మోతాదులను గుర్తించేందుకు రోజూ సూదులతో గుచ్చుకుంటున్నారా? మీ కష్టం ఇంకొంత కాలం మాత్రమే. ఎందుకంటే సౌదీ అరేబియా శాస్త్రవేత్తలు కాగితం సెన్సర్లతోనే ఈ పని కానిచ్చేందుకు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. కింగ్‌ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన సాహికా ఇనాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనల్లో వ్యక్తుల లాలాజలం ఆధారంగానే గ్లూకోజు మోతాదు నిర్ధారణ అవడం ఇంకో విశేషం. సాధారణ ఇంక్‌ జెట్‌ ప్రింటర్‌లో వాడే ఇంక్‌కు విద్యుత్తు ప్రసార సామర్థ్యమున్న ప్లాస్టిక్‌ను కలపడం ద్వారా ఈ కాగితం సెన్సర్ల తయారీ మొదలవుతుంది.

ఈ ఇంకుతో కాగితంపై ఎలక్ట్రోడ్‌లను ముద్రించడం.. దానిపై గ్లూకోజ్‌ ఆక్సిడేజ్‌ ఎంజైమ్‌ను ఒక పూతగా పూయడంతో.. ఈ రెండింటిపై నాఫియన్‌ పాలిమర్‌ తొడుగు ఒకటి ఏర్పాటు చేయడంతో సెన్సర్‌ తయారీ పూర్తవుతుంది. ఈ సెన్సర్లపై లాలాజలం చేరినప్పుడు అందులోని గ్లూకోజ్‌ కాస్తా గ్లూకోజ్‌ ఆక్సిడేజ్‌తో చర్య జరుపుతుంది. ఫలితంగా పుట్టిన విద్యుత్‌ సంకేతాన్ని ఎలక్ట్రోడ్‌లు గుర్తిస్తాయి. సంకేతపు తీవ్రతను బట్టి శరీరంలోని గ్లూకోజ్‌ మోతాదును నిర్ధారిస్తారు. ఈ సెన్సర్లను కనీసం నెలరోజులపాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాటరీలు, తీగల్లాంటివి లేకుండా చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నామని.. సెన్సర్లను మరింత సమర్థంగా పనిచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సాహికా ఇనాల్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement