
ప్రభుత్వాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిన కొద్దీ అవినీతి తగ్గుముఖం పడుతుందని అంటున్నారు వర్జీనియా టెక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ ఎకనమిక్ బిహేవియర్ అండ్ ఆర్గనైజేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. దాదాపు 125 దేశాల నుంచి సేకరించిన వివరాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. అంతేకాకుండా.. అన్నిస్థాయుల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉండటం అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది.
యూరప్ స్థానిక సంస్థల్లో మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల లంచం ఇవ్వాల్సిన అవసరం చాలా తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త చందన్ ఝా, సుదుప్తా సారంగి అంటున్నారు.ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు పురుషుల కంటే భిన్నంగా ఆలోచించడం తక్కువ అవినీతికి కారణం కావచ్చునని వీరు అంచనా వేస్తున్నారు.
మహిళా నేతలు కుటుంబం, మహిళల సంరక్షణ తదితర అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారని ఇవి కాస్తా ఆర్థిక, సాంస్కృతిక, వ్యవస్థాగతమైన అంశాలపై ప్రభావం చూపడం వల్ల అవినీతి తక్కువవుతుందని అంచనా. అవినీతి విషయంలో మహిళలకు, పురుషులకు ఉన్న వ్యత్యాసంపై ఇప్పటివరకూ తగిన పరిశోధన జరగకపోయినా మహిళలు ఎక్కువగా ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుందని గత పరిశోధనలూ చెబుతున్నాయని అంటున్నారు వీరు.
గుండె సమస్యలకు నిద్రలేమి కారణం!
కౌమార వయసులోని పిల్లలు తగినంత సేపు నిద్రపోకపోయినా.. నాణ్యమైన నిద్ర కాకపోతే... భవిష్యత్తులో వారికి గుండెజబ్బులు లేదంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు మాస్‌జనరల్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఇలాంటి పిల్లల్లో కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువగా ఉండటమే కాకుండా పొట్ట ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
నిద్రకు ఊబకాయానికి సంబంధం ఉందని గతంలోనే కొన్ని పరిశోధనలు స్పష్టం చేయగా ఇతర ఆరోగ్య సమస్యల గురించి తెలిసింది మాత్రం ఇప్పుడే అని శాస్త్రవేత్తలు వివరించారు. 1999 – 2002 మధ్య కాలంలో సేకరించిన కొన్ని వేల మంది పిల్లలను దాదాపు ఇరవై ఏళ్లపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు. పిల్లల సగటు నిద్ర సమయం 441 నిమిషాల నుంచి 7.35 గంటల వరకూ ఉండగా కేవలం 2.2 శాతం మంది అవసరమైన దానికంటే ఎక్కువ సమయం నిద్రపోయినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.
కాంక్రీట్‌కు క్యారెట్, బీట్‌రూట్ శక్తి
వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఈ వార్త. భవన నిర్మాణానికి మనం వాడే కాంక్రీట్ మరింత దృఢంగా మారేందుకు క్యారెట్లు, బీట్‌రూట్ బాగా ఉపయోగపడతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండు కాయగూరల నుంచి సేకరించే నానో ప్లేట్‌లెట్లు జోడిస్తే కాంక్రీట్ మరింత దృఢంగా మారుతుందని బ్రిటన్‌లోని లాంకస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. క్యారెట్, బీట్‌రూట్ల నారలోని నానోప్లేట్‌లెట్లు కాంక్రీట్‌లో సిలికేట్ల మోతాదును పెంచడం ద్వారా దృఢత్వానికి దోహదపడిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మహమ్మద్ షఫీ తెలిపారు.
కాంక్రీట్‌ను గట్టి పరిచేందుకు ఈ ఏడాదిలో మొదట్లో కొంతమంది శాస్త్రవేత్తలు గ్రాఫీన్‌ను ఉపయోగించారని.. దీంతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన పద్ధతి చాలా చౌక, పర్యావరణానికి హాని కలిగించనిది కూడా అని షఫీ వివరించారు. స్కాట్లాండ్ కంపెనీ సెల్లూకాంప్ ఈ రెండు కాయగూరలను ప్రాసెస్ చేసిన తరువాత వృథాగా పారబోసే వ్యర్థాల నుంచి నానో ప్లేట్‌లెట్లను వేరు చేసి అందించిందని వివరించారు. కాంక్రీట్‌కు ఈ ప్లేట్‌లెట్లను కలిపినప్పుడు దృఢత్వం పెరగడం మాత్రమే కాకుండా ప్రతి ఘనపు మీటర్ కాంక్రీట్ తయారీకి అవసరమయ్యే సిమెంట్ మోతాదు 40 కిలోల వరకూ తగ్గిందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment