గ్రామ స్వరాజ్ | prakash raj special interview for adapted village.. | Sakshi
Sakshi News home page

గ్రామ స్వరాజ్

Published Sat, Oct 1 2016 11:42 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

గ్రామ స్వరాజ్ - Sakshi

గ్రామ స్వరాజ్

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్ముడు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించారు. రక్తపుబొట్టు కారకుండా స్వరాజ్యాన్ని సంపాదించిన అహింసా తపస్వి గాంధీ.  ప్రపంచానికి మనం మహాత్ములం కాలేకపోయినా, మన ప్రపంచంలో ‘ఆ’ ఆత్మను నాటితే బాగుంటుంది! గ్రామ స్వరాజ్య ఫలసాయం కోసం సేద్యం చేస్తున్న  ప్రకాశ్ స్వరాజ్‌తో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ  -రామ్ ఎడిటర్స్,ఫీచర్స్

ఇవాళ గాంధీ జయంతి. ఏం గుర్తొస్తుంది?
గాంధీజీ అనగానే కరెన్సీ నోట్లలో చూసే బోసినవ్వుల తాత కాదు. గాంధీజీ మన దేశానికి కాన్షస్‌నెస్. ఆయన అహింస గురించే కాదు... వ్యవసాయం, గ్రామ స్వరాజ్యం, ఆర్థిక విధానం, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ - ఇలా చాలా మాట్లాడారు. ఆయన విజన్ గొప్పది. ఆయన అలకలో, కోపంలో, ఉపవాసంలో - ప్రతి దానిలో ధర్మం ఉంది. కానీ, మనం గాంధీ గురించి పెద్దగా మాట్లాడం! నిజానికి, ఆయన సత్య శోధన జీవితాన్ని సమగ్రంగా చూడాలి. నాపై గాంధీ జీవిత ప్రభావం చాలా ఉంది.

మీలోనూ జీవిత వేదాంతం పెరుగుతోందే!
ఏ మనిషైనా కాలంతో పాటు ఎదగాలి. ప్రతిదీ ఆకలితో చూస్తూ, ఆకళింపు చేసుకుంటూ వెళ్ళాలి. జీవితానుభవాలు ఎక్కువవుతున్నకొద్దీ వ్యక్తిగా అవి మనకి అందమి వ్వాలి. లేకపోతే జీవితం వ్యర్థం. ఈ ప్రయాణంలో మనకిక చాలు అనాలి. ఇవ్వడం నేర్చుకోవాలి. ఇతరులతో పంచుకోవాలి.

మీరూ మీ స్థాయిలో తిరిగి ఇస్తున్నట్లున్నారు
యస్. ఏ మనిషీ తన వల్లే పెరగడు. పదిమందీ తనకిచ్చిన దాని వల్లే పెరుగుతాడు. 120 రూపాయలతో నటుణ్ణి కావాలని వస్తే నాకు ఇవాళ అందరి వల్ల ఇంత గుర్తింపు వచ్చింది. భోజనం కోసం కష్టపడాల్సిన పని లేదు! ఇప్పుడు నా దగ్గర ఉంది కాబట్టి, సమాజానికి తిరిగివ్వాలి. వెలగడం గొప్ప కాదు, వెలిగించడం గొప్ప! ఎదిగేకొద్దీ అన్ని రకాల బరువూ తగ్గించుకొని తేలిగ్గా మారితే బెటర్! ఆఖరికి పోయాక ఓ నలుగురు మనల్ని మోయాలిగా! (నవ్వు)

సిన్మాచూసి గ్రామాన్ని దత్తత తీసుకున్నారని.
(మధ్యలోనే) సిన్మా చూసి నేనెందుకు చేస్తా? నాకెక్కడో అనిపించింది, చేశానంతే. అయినా ఊరిని దత్తత తీసుకుని, వాళ్లకు అన్నం పెట్టగానే సరిపోదు. సమస్యలు తెలుసుకోవాలి, తీర్చాలి. ఊరి జనం తమ కాళ్ళపై నిలబడేలా చేయూతనివ్వాలి. ఊరిని దత్తత తీసుకోడానికి డబ్బు కన్నా మనసు, టైమ్, కమిట్‌మెంటే అవసరం!

మీ ఊరు కాని ఊరిని దత్తు తీసుకొన్నారేం?
నా ఊరు, నా జాతి ఏంటి? ఐ యామ్ ఎ వరల్డ్ సిటిజన్. నాకు మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో పొలం ఉంది. నేనక్కడికి వెళుతున్నప్పుడు ఆ ఊరి పరిస్థితి కనిపించింది. చదువుకోవాల్సిన పిల్లలు ఆడుకుంటున్నారు. అరే..నా కూతురు లండన్‌లో చదువుతోంది. తన ఏడాది ఫీజుతో ఇక్కడ వందమంది చదువుతారనిపించింది.

మరి, మీ భార్య, పిల్లల మాటేమిటి?
ఎవరి పిల్లలైనా తమకు తాము కష్టపడి సంపాదించుకోవాలి. కూర్చొని తినాలంటే కుదరదు. ‘నా సంపాదనలో మీ వాటా మీ ఇష్టం. నా వాటాలో కొంత వీటికి ఖర్చు పెడతా’ అని ఇంట్లో డిస్కస్ చేస్తా. నా పెద్ద కూతురు మేఘన లండన్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతోంది. మంచి పెయింటర్. సెలవుల్లో సోషల్‌సర్వీస్‌కి వివిధ ప్రాంతాలకెళుతుంది. ఆ మధ్య 15 రోజులు ట్రైబల్ ఏరియాకెళ్లొచ్చింది. తనకి నా గుణాలొచ్చాయి.

ఊరి దత్తతపై ఇంట్లో ఎలా కన్విన్స్ చేశారు?
ముందు మీకు మీరు కన్విన్స్ అవ్వాలి. మన నిర్ణయం వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడండి వాళ్లతో! అది చాలు! పిల్లలకి మనమే ఆదర్శంగా ఉండాలి. అందుకే, వ్యక్తిగతంగానే కాదు, నేను తీస్తున్న సిన్మాలూ అలాగే ఉంటాయి. ‘ఇలాంటి చిత్రం తీశాడు’ అని వాళ్లు గర్వపడాలే తప్ప, సిగ్గుపడకూడదు.

వచ్చే ‘మన ఊరి రామాయణం’ అంతేనా..?
కచ్చితంగా. రాముడు, సీత, రావణా సురుడు ఇవన్నీ మనిషిలో ఉన్న గుణాలే. అందరూ మనలోనే ఉన్నారు. అందుకే ‘మన ఊరి రామాయణం’... మనలోని రామాయణం. ఓ చిన్న ఊరు. ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకుని, ‘అయ్యో తప్పు చేస్తున్నానే’ అనుకుంటాడు. కానీ, బయటకి రాలేని స్థితి. అలా ఓ కథ చెప్పాలని తీశా.

అసలు దర్శకత్వం వైపు ఎందుకు వచ్చారు?
నాకేదో తెలిసేసిందని దర్శకత్వం చేయ ట్లేదు. అంతా మంచి నటుడంటున్నారు. ఎక్కడో కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోయానేమో అనిపించింది. కొత్తగా ఉండాలంటే, మళ్ళీ పరీక్ష రాయాలనిపించింది. 200 మంది డెరైక్టర్లతో, ఎన్నో భాషల్లో, ఎన్నో క్యారెక్టర్లు చేశా. నాకూ కొన్ని విషయాలు చెప్పేందుకు న్నాయి. అవి పంచుకుందామనే డెరైక్షన్.

కానీ, దర్శకుడిగా సక్సెస్ అయ్యారంటారా?
‘నాను నన్న కనసు’, ‘ధోని’, ‘ఉలవ చారు బిర్యానీ’, ‘మన ఊరి రామాయణం’ - అన్నీ చిన్న చిన్న విషయాల్ని స్పృశించేవే. ఇవన్నీ ప్రేక్షకుడికీ, నాకూ మధ్య ఉభయ కుశలోపరి. అది చాలు, నేను సక్సెసైనట్లే!

నటనకి ఛాన్‌‌సల్లేక దర్శకత్వం చేస్తున్నారని!
నటుడిగా ఒక్కరోజైనా ఖాళీగా లేను. తెలుగు, తమిళ, మలయాళ, హిందీల్లో నటిస్తున్నా. వ్యవసాయం చేస్తున్నా. దత్తత తీసుకున్న ఊరి వద్ద గడుపుతున్నా. కొడుకుతో ఆడుతున్నా. దేశాలు తిరుగుతున్నా. ‘సిల సమయంగళిళ్’ సినిమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కి వెళుతున్నా. టైమే లేదు! ఖాళీగా ఉన్నవాళ్లేదో అంటే, నాకేం!

కొత్తవాళ్లొచ్చాక తెరపై కనపడ్డం తగ్గిందని..
(మధ్యలోనే) కూరగాయలు పెంచు తున్నా. విలేజ్‌లో స్కూల్ కడుతున్నా. నాకు సిన్మాలే జీవితం కాదు. నా జీవి తంలో సిన్మా కూడా ఉంది. ఎదుటివాళ్లకి సిన్మా ఒక్కటే కన్పిస్తే, నా తప్పు కాదు. 

ఎప్పుడైనా నటన ఇక చాలనిపించిందా?
చాలు అని దేన్నీ అనను. కొంచెం ఎక్కువైన దాన్ని తగ్గిద్దామనుకుంటా. అంతే! కడుపునిండా తింటే లాభం లేదు. కొంచెం ఆకలితో ఉండాలి.అప్పుడే రుచితెలుస్తుంది.

ఒకప్పుడు మీరంటే పడిచచ్చిన దర్శకులు, స్టార్‌‌స సినిమాల్లో మీరు కనిపించడం లేదేం?
(నవ్వేస్తూ) నేను లేకపోతే సిన్మా తీయలేమనే అబద్ధాన్ని అప్పుడు వాళ్లు నమ్మారు. నేను లేకుండా కూడా సినిమా తీయొచ్చని ఇప్పుడు తెలుసుకున్నారు. బాగుంది కదా! నాతో సినిమాలు చేసినా, చేయకపోయినా నా జీవితం నేను బతుకుతూనే ఉన్నాను. 

ఇష్టపడ్డవాళ్లకి టైమివ్వచ్చుగా?
జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం నాదే! మనం అర్థం కాకూడదు. జీవితం నదిలా ఉండాలి. మొదలు తుది తెలీకూడదు. ఇచ్చేదివ్వాలి. పొందేది పొం దాలి. వెళ్లిపోవాలి. అక్కడే నిల్చుంటే కష్టం. నది లోపలికెళ్తే కొట్టుకెళ్లిపోతాం. దూరమైతే దాహమేస్తుంది. తగు దూరంలో ఉండాలి.

తామరాకుపై నీటి బొట్టు వ్యవహారమిది!
...అని మీరంటారు. నేను తామరాకు తామరాకే, నీటిబొట్టు నీటిబొట్టే అంటా. అంటుకొని ఉండకపోవడమే ఇంట్రెస్టింగ్.

ఇన్ని విషయాలెలా నేర్చుకోగలిగారు?
అంతా చుట్టూనే ఉంది. చూసే దృష్టి ఉండాలి. దృష్టి వేరు, చూపు వేరు. తీవ్ర తతో బతకాలి. బతుకుతూనే ఉండాలి. బతికుండీ చచ్చిపోకూడదు. పోయినప్పుడు నల్గురూ మంచిమాటలనుకొనేలా బతకాలి.  

అలా బతికే శక్తి, ఉత్సాహం ఎలా వస్తాయి?
ఏదైనా, ఇష్టపడి పని చేయాలి. నచ్చినట్లు బతకాలి. ఇక ప్రతి క్షణం ఉత్సాహమే.

ఇప్పటిదాకా మీరు ఇష్టపడే బతికానంటారా?
యస్. నాకు నచ్చినట్టే బతికా. రాజీ పడడం వేరు, పరిస్థితులకు తగ్గట్లు ఎడాప్టింగ్ వేరు. కొంచెం ఎడ్జెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. కానీ ఆత్మగౌరవం కాపాడుకోవాలి.

ఇంతకీ ఊరు అనగానే ఏం గుర్తొస్తుంది?
ప్రతి ఊరికీ ఒక్కో జ్ఞాపకం. సెలవుల్లో ఊరికెళ్లేవాడిని. ఊళ్ళో పెద్దవారంటే విలువ, దేవుడు, భయముంటాయి. మనస్సాక్షి ఉన్న మనుషులుంటారు. కానీ, సిటీలో అలా కాదు! ఒంటరితనమే.

కానీ, ఇప్పుడు అలాంటి ఊళ్ళున్నాయా?
అలాంటి మనుషులుంటే, అలాంటి ఊళ్ళున్నాయి. ఎక్కడైనా రైతులు రైతులే. కానీ, మనం ప్రకృతిని కాపాడుతున్నామనే అహం వద్దు. ప్రకృతి మనకి అవసరం. దాన్ని కాపాడామనడానికి మనమెవరం?

ఊరు దత్తత చూస్తే పాలిటిక్స్‌లోకేమైనా..
(సగంలోనే) నాకు తెలీనిదానికి నేనెప్పుడూ వెళ్ళను. ఈ క్షణంలో కచ్చితంగా వెళ్ళననే చెబుతా. కానీ, ప్రయాణంలో ఏ రోజున ఏ నిర్ణయం తీసుకుంటామో!

ఇంతకీ ఇంకొన్నేళ్ళకి మీరెలా ఉండాలని?
మరింత మంచిమనిషిగా ఉండాలని! రైతుగా, భూమిపుత్రుడిగా నిలబడతా.

స్వాభిమానం...  సంసారం...  సమకాలీనం...

ఇళయరాజా గారి తెలుగు కాన్సర్ట్‌కి అమెరికా వెళ్ళొచ్చిన విశేషాలు?
రాజా గారి తొలి తెలుగు కాన్సర్ట్ అది. ఆడిటోరియం హౌస్‌ఫుల్. ఇక, ‘తెలుగుగడ్డపై మీరెప్పుడూ విభావరి చేయలేదు. నేను ఆర్గనైజ్ చేస్తా. చేయండి’ అని రాజా గారితో అన్నా. చేస్తానన్నారు.

దర్శకుడిగా ఇళయరాజా లాంటి సంగీత జ్ఞాని వద్దకు సిన్మా కోసం వెళ్ళినప్పుడు మీకు ఛాయిస్ ఉండదేమో. కానీ మీకు కొన్ని ఊహలుంటాయి. మరి ఇద్దరికీ శ్రుతి కుదిరేదెలా?
ఇసైజ్ఞాని దగ్గరకెళ్ళి ‘నాకిలాంటి మ్యూజిక్కే కావా’లంటే ఎలా ఉంటుంది? అలాగే నా దగ్గరకు వచ్చి, ‘మీరు ఇలా కాదు, అలా యాక్ట్ చేయండి’ అంటే నాకెలా ఉంటుంది? ఆయన వద్దకు వెళ్లి నా భావాలు చెబుతా. సందర్భానికి తగ్గ సంగీతం ఇస్తారు. మనకు ఏది తెలియదో తెలిసినప్పుడు, తెలిసినవాళ్ళ దగ్గరకి వినయంగా వెళ్లాలి.

కానీ, మీ ఇద్దరికీ అహంకారమని టాక్!
నా అంతటి వాడు లేడనే అహంకారం వేరు. పాండిత్యం ఉండడం వల్ల కలిగే ధిషణాహంకారం వేరు. ఆత్రేయ గారితో ‘ఏవండీ మీరు బాగా రాస్తారు కానీ రాత్రైతే తాగుతారట, అదంట, ఇదంట’ అని ఎవరో అన్నారట! దానికి ఆయన, ‘నాయనా! చెడు చూసినవాళ్లకి చెడు. మంచి చూసిన వాళ్లకి మంచి’ అన్నారట! రాజాగారూ మనిషేగా! పెద్దరికాన్ని గౌరవించాలి. జడ్జ్ చేస్తే ఎలా?

ఈ వయసులో తండ్రి అవడమెలా ఉంది?
ముప్ఫై ఏళ్ళప్పుడు తండ్రి అయిన అనుభూతి వేరు. యాభై ఏళ్ళకి ఇప్పుడు కొడుకు పుట్టిన అనుభూతి వేరు. దేనికదే బాగుంది. దీనివల్ల నాకూ, నా భార్య - కొరియోగ్రాఫర్ పోనీవర్మకూ బంధం స్ట్రాంగ్ అవుతుంది. నా త ల్లి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే, ‘మాకు ఓ తమ్ముడు పుట్టాడు’ అంటూ ఇద్దరు కూతుళ్ళూ రాఖీ కడుతుంటే హ్యాపీ.

మీపరిణతి మీ అబ్బాయి పేరు వేదాంత్‌లోనూ ఉందే!
(నవ్వేస్తూ) వాడి పేరు నేను పెట్టలేదు. మా ఆవిడ పది పేర్లు రాసి, సెలక్ట్ చేయమంది. వేదాంత్ బావుందన్నా!

ఇంతకీ, మీ అబ్బాయిని ఏం చదివిస్తారు?
వాడు సాహిత్యం, జీవితం చదవాలి. దేశానికి తోడ్పడాలి.

తాజా కావేరీవివాదంతో దహనాలు చూస్తే...
బాధ అనిపించింది. ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి. కానీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని కాల్చడానికి ఎవరి డబ్బది? మనదే కదా! నీకు దహనం చేయాలనుంటే నీ కారు తీసుకొచ్చి దహనం చెయ్. ఎవరో రోడ్డుపై వెళుతుంటే ఆపి, వాడి కారు దహనం చేయడమేంటి? వాడూ మనిషేగా! 
అప్పట్లో వివాదంతో ప్రకాష్‌రై నుంచి రాజ్‌గా పేరు మార్చారట...
బాలచందర్‌గారు మార్చారు. ‘నువ్వు విశ్వనరుడివి. నీ పేరు ఒక భాష, ప్రాంతంతో ముడిపడేలా కాదు... విశ్వజనీనంగా ఉండాలి’ అంటూ ప్రకాశ్‌రాజ్ అని పేరు పెట్టారు.

కానీ, పాతికేళ్ళ నుంచి అదే సమస్య మళ్లీ మళ్ళీ వస్తుంటే...
(అందుకొని) అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. కానీ, పరిష్కారం కానివ్వకపోతేనే కొందరికి లాభం ఉంటుంది. 

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మన మెరుపుదాడి పట్ల ఏమంటారు?
ఇప్పటికైనా వీర జవాన్ల విలువ మనకి అర్థమైంది. వాళ్ళు దాడి చేసింది పాక్‌పై కాదు, తీవ్రవాదంపై! జై జవాన్!
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement