గుండె లయలో మార్పులను సరిచేయవచ్చు!
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. ఒక్కోసారి నా గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకున్నట్లు అనిపిస్తోంది. అది ఫాస్ట్‌గా దడదడలాడటం నాకు తెలుస్తోంది. ఆ సమయంలో నాకు కళ్లు తిరిగినట్లుగా ఉంటుంది. విపరీతమైన ఆయాసం, నీరసం ఫీలవుతుంటాను. నాకుహైబీపీకూడా ఉంది. అది డౌన్ అవ్వడం వల్ల ఇలా జరుగుతోందా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- సత్యనారాయణ, వైజాగ్
మన శరీరంలో నిర్విరామంగా గుండె కొట్టుకోడానికి ఎలక్ట్రికల్ వ్యవస్థ ఒకటి పనిచేస్తుంది. ఇందులో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటే గుండెదడలో కూడా మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా గుండె 70-80 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా అసాధారణంగా గుండెదడ పెరిగినా లేక తగినా దానిని ప్రమాదంగా పరిగణించాలి. తగిన చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు. గుండె నిమిషానికి 100 కంటే ఎక్కువసార్లు కొట్టుకుంటే దానిని ‘ట్యాకి కార్డియా’ అంటారు. గుండె నిమిషానికి 60 సార్ల కంటే తక్కువ సార్లు కొట్టుకుంటే దానికి ‘బ్రాడీ కార్డియా’ అని పేర్కొంటారు. గుండెదడలో మార్పులను ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, ఎలక్ట్రో ఫిజియాలజీ స్టడీ (ఈపీ స్టడీ) పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. మీ విషయానికి వస్తే మీ గుండె స్పీడుగా కొట్టుకోవడం, కళ్లు తిరగడం, ఆయాసం, నీరసం రావడం లాంటివి చోటు చేసుకున్నాయని అంటున్నారు.
ఇవి ‘ట్యాకీకార్డియా’ లక్షణాలను సూచిస్తున్నాయి. కాబట్టి బీపీ డౌన్ అవ్వడం వల్ల మీకు అలా జరిగి ఉండదు. మీరు వెంటనే మంచి నిష్ణాతులైన వైద్యులను సంప్రదిస్తే వారు అన్ని పరీక్షలూ నిర్వహించి, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో నిర్ధారణ చేస్తారు. దానికి అనుగుణంగా చికిత్స అందిస్తారు. ఒకవేళ మీరు ట్యాకీకార్డియాతో బాధపడుతున్నట్లు నిర్ధారణ చేస్తే మీలో గుండెదడ పెరగడానికి కారణమైన అవాంఛిత ఎలక్ట్రికల్ సర్క్యుట్లను తొలగించి క్రమబద్ధీకరిస్తారు. కాబట్టి మీరు ఎలాంటి అనవసరం భయాలూ పెట్టుకోకుండా వెంటనే మంచి డాక్టర్‌ను కలిసి, మీ సమస్యకు తగిన చికిత్స పొందండి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రాథమిక దశలోనే మీ సమస్యకు తగిన చికిత్సను తీసుకొని, ఆనందంగా ఉండండి.
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 55 ఏళ్లు. నేను గత ఐదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. నేను ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని అయన చెప్పారు. గత కొంతకాలంగా క్యాల్షియమ్ ఇస్తున్నారు. అయినా నాకు నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే అవి కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు ఇటీవలే తెలిసింది. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. - శ్రీదేవి, కొత్తగూడెం
ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇచ్చే మందుల్లో భాగంగా ఆయన క్యాల్షియమ్‌ను సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్‌తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా... ‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్‌లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు ఒకసారి మళ్లీ మీ డాక్టర్ గారిని సంప్రదించండి.
హోమియో కౌన్సెలింగ్
నా వయసు 32 సంవత్సరాలు. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. నాకు కొంతకాలంగా విపరీతమైన తలనొప్పి, తలలో ఒకవైపు మొదలై కంటి వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. డాక్టర్‌కి చూపిస్తే మైగ్రేన్ అని చెప్పి, కొన్ని మందులు ఇచ్చారు. ఆ మందులు వాడుతున్నంతకాలం బాగానే ఉంటుంది. వాడటం మానేస్తే నొప్పి మళ్లీ మామూలే. ఈ నొప్పి వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా ఈ సమస్యకి హోమియో చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. - ఎస్. పవన్ కుమార్, తెనాలి
మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మైగ్రేన్‌ని పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్య సాధారణంగా 15 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంది. పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) అంటే చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం, ఏదో ఒకవైపు తలనొప్పి రావడం సాధారణంగా చూస్తుంటాం. ఇది మెడవెనక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. పార్శ్వపు నొప్పికి కారణాల గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపునొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తేలింది.
కారణాలు: శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ సమయం ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, నెలసరి సమయంలో, గర్భిణులలో, మెనోపాజ్ సమయంలో, స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు, అతి వెలుగు, గట్టిశబ్దాలు, ఘాటైన వాసనలు, పొగతాగడం లేదా పొగతాగేవారు ఇంట్లో ఉండటం, మద్యం సేవించ డం లేదా ఇంతర మత్తుపదార్థాలు తీసుకోవడం వంటి అంశాలన్నీ మైగ్రేన్‌కి కారణాలుగా చెప్పవచ్చు.
లక్షణాలు: పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం, కొన్ని రకాల తినుబండారాలు ఎక్కువగా ఇష్టపడటం, వెలుతురు, శబ్దాన్ని తట్టుకోలేక పోవడం, కళ్లు మసకబారడం, కళ్లముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించడం జరగవచ్చు. వీటినే ఆరా అంటారు.
పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు ఎక్కువగా నొప్పి ఉండటం, నొప్పి నాలుగు గంటల నుంచి 72 గంటల వరకు ఉండొచ్చు. కడుపులో వికారం లేదా వాంతులు అవడం జరుగుతాయి. పార్శ్వపునొప్పి వచ్చిన తర్వాత కనిపించే లక్షణాలు: చికాకు, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం.
హోమియోకేర్ చికిత్స: హోమియోలోని జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యవిధానం ద్వారా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతను తగ్గించడమే కాకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం అందించవచ్చు. మీరు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో తగిన పొటెన్సీలో మందులు తీసుకోండి. మీకు మైగ్రేన్ నుంచి ఉపశమనం తప్పక కలుగుతుంది.