కరోనా కాలం గుండె భద్రం! | Corona Effect Heart System Special Story in Sakshi Family | Sakshi
Sakshi News home page

కరోనా కాలం గుండె భద్రం!

Published Thu, Sep 24 2020 8:05 AM | Last Updated on Thu, Sep 24 2020 8:05 AM

Corona Effect Heart System Special Story in Sakshi Family

ఈ కరోనా సీజన్‌లో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా ఎవరైనా సీరియస్‌ కండిషన్‌లోకి వెళ్లారంటే...  వైరస్‌ వారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ కలగజేయడం... దాంతో వారిని వెంటిలేటర్‌పై ఉంచాల్సి రావడం చాలా సాధారణమని మొదట్లో భావించేవారు. కానీ  ఆ తర్వాత్తర్వాత పరిశోధనల్లో, పరిశీలనల్లో కొత్త విషయాలు తెలిశాయి. కేవలం ఊపిరితిత్తులే కాదు... గుండె కూడా అంతే స్థాయిలో ప్రభావితమవుతుందని స్పష్టమైంది. ఈ నెల 29న వరల్డ్‌ హార్ట్‌డే! ఈ సందర్భంగా అసలు కరోనా వల్ల గుండె ఎన్ని రకాలుగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందీ, అలా జరిగేందుకు కారణాలేమిటీ, వాటిని నివారించడం / అధిగమించడం ఎలా అన్న అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. 

కరోనాతో పెరిగే ముప్పు – అందుకు కారణాలు  
మనలోకి కరోనా వైరస్‌ ప్రవేశించడానికి దోహదపడే అంశాల్లో ‘ఏసీఈ–2 రిసెప్టార్స్‌’ అన్నిటికంటే ముఖ్యమైనవి. సాధారణంగా మన శరీరంలో ఉన్నట్లే మన గుండెపై కూడా ఈ రిసెప్టార్స్‌ ఉంటాయి. సాధారణంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌ (హైబీపీ) ఉన్నవారికి చికిత్సలో భాగంగా ఏసీఈ ఇన్హిబిటార్స్‌ అనే మందులు ఇస్తుంటారు. అలాగే యాంజియోటెన్సిన్‌ 2 రిసెప్టార్‌ బ్లాకర్స్‌ కూడా ఇస్తారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కూడా ఈ ఏసీఈ–2 రిసెప్టార్స్‌ ద్వారానే గుండె కండరంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఈ అంశం ఆధారంగానే ఏసీఈ–2 రిపెప్టార్స్‌కూ, కరోనా ప్రవేశానికీ సంబంధముందని స్పష్టంగానే తెలుస్తుంది. గుండె కండరంపైన ‘ఏసీఈ–2 రిసెప్టార్స్‌’ సంఖ్య మరింత ఎక్కువ. కాబట్టి కరోనా గుండెను ప్రభావితం చేసే అవకాశాలు ఆటోమేటిగ్గా మరింత ఎక్కువవుతాయన్నమాట. 

ఇక డయాబెటిస్, హైబీపీ ఉన్నవారిలో ఇచ్చే మందుల వల్ల కరోనా ప్రవేశానికీ, తద్వారా గుండెకు ప్రమాదం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ కార్డియాలజీ, బ్రిటిష్‌ కార్డియాక్‌ సొసైటీ, అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ వంటి సంస్థలన్నీ కరోనా సీజన్‌లో సైతం ఈ మందుల్ని యథావిధిగా తీసుకొమ్మనే సిఫార్సు చేస్తున్నాయి. ఎందుకంటే... వాటిని తీసుకోవడం కంటే... కరోనా వైరస్‌ సోకుతుందేమో అనే ఆందోళనతో వాటిని మాన్పించడం వల్ల జరిగే అనర్థాల తీవ్రత చాలా ఎక్కువ.  

మరో కారణం ఏమిటంటే... పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులలో రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మన దక్షిణభారతీయుల్లో ఇవి మరింత సన్నగా ఉంటాయి. కరోనా వైరస్‌ కారణంగా రక్తనాళాల్లోని లోపలిపొర  దెబ్బతింటుంది. అంతేకాదు... నాళాల్లో రక్తం గడ్డకట్టే (అంటే క్లాట్స్‌ ఏర్పడే) అవకాశాలూ పెరుగుతాయి. సాధారణంగా రక్తనాళాలు సన్నబారడం / దెబ్బతినడాన్ని వైద్యపరిభాషలో ‘అథెరో స్క్లిరోసిస్‌’ అంటారు. వయసు పెరుగుతున్నకొద్దీ ఇలా జరగడం సాధారణం. కానీ కరోనా కారణంగా ఈ పరిణామం ఠక్కున సంభవించే అవకాశం ఉంది. ఇలా రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోవడంతో పాటు రక్తపు గడ్డలు (క్లాట్స్‌) వల్ల గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా కరోనా సీజన్‌లో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల ఈ కారణంగానూ గుండెపోటు రావచ్చు. ఇలా రక్తనాళాల్లో క్లాట్స్‌ వచ్చే అవకాశాలు కేవలం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కరొనరీ ఆర్టరీలో మాత్రమే గాక... అన్ని ధమనుల్లోనూ ఉంటుంది. కాకపోతే మిగతాచోట్ల రక్తం గడ్డకట్టినా తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు.

కానీ అత్యంత కీలకమైన గుండెకు అనునిత్యం రక్తం సాఫీగా అందకపోవడం వల్ల జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక్కడ గుండెకు నేరుగా కాకుండా పరోక్షంగా వచ్చే ముప్పు గురించి కూడా చెప్పుకోవాలి. కాళ్ల రక్తనాళాల్లో లేదా దేహంలోని మరెక్కడైనా రక్తనాళాల్లో రక్తపు క్లాట్స్‌ వచ్చి అవి గుండెకు చేరి, అక్కడ ఊపిరితిత్తులకు జరిగే రక్తసరఫరాకు అడ్డుపడితే... ‘పల్మునరీ ఎంబోలిజం’ అని పిలిచే ఈ పరిణామం వల్ల కూడా అకస్మాత్తుగా మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ. మన దేశవాసుల్లో వచ్చే ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్‌ ఒబేసిటీ లేదా సెంట్రల్‌ ఒబేసిటీ అంటారు. స్థూలకాయంతో బాధపడేవారిలో (అంటే బీఎమ్‌ఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో) కరోనాతో కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశాలు దాదాపు 40 శాతం ఎక్కువగా ఉందని తేలింది. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఇటీవలే బ్రిటిష్‌ పరిశోధకులు కనుగొన్నారు. మన దేహబరువు పెరుగుతున్న కొద్దీ ముప్పు కూడా అంతే ఎక్కువగా పెరుగుతోందని కూడా ఈ అధ్యయనంలో తేలింది. 

పొగతాగడం అన్నది అటు ఊపిరితిత్తులకూ, ఇటు అథెరోస్కి›్లరోసిస్‌ దోహదపడే అంశం. అందుకే పొగతాగే అలవాటు ఉన్న వారికి కరోనా సోకితే అటు ఊపిరితిత్తులను దెబ్బతీసే అవకాశం ఎంతగా ఉంటుందో... ఇటు గుండెకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశమూ అంతకు తక్కువేమీ కాదు. కరోనా కారణంగా ప్రభావితమయ్యే కీలకమైన రెండు అవయవాలైన ఊపిరితిత్తులూ, గుండెను పొగ కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే పొగతాగడం కూడా కరోనా విజృంభణకు దోహదపడి అటు లంగ్స్‌తో పాటు ఇటు గుండెకూ ముప్పును మరింత పెంచుతుంది.

గుండెకు మరెన్ని రకాల సమస్యలో... 
కరోనా వైరస్‌ గుండెను ప్రభావితం చేసినప్పుడు కొందరిలో నేరుగా హార్ట్‌ ఎటాక్‌ యే రావచ్చు. కరోనా వైరస్‌ వల్ల గుండె కండరానికి ఇన్ఫెక్షన్, కండరంలో వాపు, నొప్పి  (ఇన్‌ఫ్లమేషన్‌) రావచ్చు. దీన్ని మయోకార్డయిటిస్‌ అంటారు. ఈ కారణంగా గుండె పనితీరు దెబ్బతిని అది హార్ట్‌ ఫెయిల్యూర్‌కు సైతం దారితీయవచ్చు. కొందరిలో గుండె స్పందనలు లయ తప్పవచ్చు (అంటే రిథమ్‌ దెబ్బతిని ఇర్రెగ్యులర్‌గా కొట్టుకోవచ్చు).

హాస్పిటల్స్‌కు వెళ్లనివ్వని కరోనా భయం... 
అంతకు ముందు క్రమం తప్పకుండా కనీసం ఏ రెండు నెలలకొకసారో, మూణ్ణల్లకొకమారో రక్తంలో తమ చక్కెర పాళ్లను తెలుసుకునే డయాబెటిస్‌ రోగులు సైతం ఈ కరోనా సీజన్‌లో హాస్పిటల్‌ దిక్కుకు వెళ్లడమే మానేశారు. గుండెజబ్బులు ఉన్నవారు సైతం ఆసుపత్రును అవాయిడ్‌ చేస్తున్నారు. కరోనా కారణంగా పైన పేర్కొన్న రక్తనాళాలు సన్నబారడం, రక్తంలో క్లాట్స్‌ రావడం వంటి ఆరోగ్యవంతుల్లోనే మామూలేతే... మరి డయాబెటిస్, హైబీపీ వంటి వారిలో ఎంత ప్రమాదమో ఎవరికి వారే ఊహించవచ్చు. దాంతో క్రమం తప్పకుండా హాజరుకావాల్సిన ఫాలో అప్స్‌కు వెల్లకపోవడం, వ్యాధి బాగా ముదిరాక మాత్రమే హాస్పిటల్స్‌కు వచ్చే కేసులు సైతం పెరిగిపోయాయి. దాంతో వాళ్లకు సకాలంలో అందాల్సిన చికిత్స అందకపోవడం వల్ల కూడా చాలా అనర్థాలు సంభవిస్తున్నాయి. అందులో గుండెకు సంబంధించిన సమస్యలే ఎక్కువ అని చెప్పవచ్చు.

అసలు గుండె జబ్బు ఎందుకొస్తుంది, ఎలా బయటపడుతుంది? 
కరోనరీ ధమనులు గుండెకు పోషకాలనూ, ఆక్సిజన్‌ను అందిస్తుంటాయి. సాధారణంగా ఏ కారణంగానైనా ఈ ధమనులు సన్నబడవచ్చు లేదా వాటిలో రక్త సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం కూడా జరగవచ్చు. మొదట్లో వయసుపెరగడం లాంటి ఏదైనా కారణంతో రక్తనాళాలు దెబ్బతినడం, సన్నబారడం జరిగితే... ఇప్పుడు కరోనా కూడా అలాంటి ప్రభావాన్నే చూపుతోందని అధ్యయనల్లో తేలింది. ఇలా రక్తనాళాలు సన్నబడినప్పుడు ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను యాంజినా పెక్టోరిస్‌ అంటారు. గుండెకు తగినంత  రక్తసరఫరా జరగని సందర్భాల్లో గుండె కండరాలు క్రమంగా చచ్చుపడిపోవడం మొదలవుతుంది. ఈ కండిషన్‌నే హార్ట్‌ ఎటాక్‌ అనీ లేదా వైద్యపరిభాషలో అక్యూట్‌ మయోకార్డియల్‌ ఇన్‌ఫార్‌క్షన్‌ (ఏఎమ్‌ఐ) అని అంటుంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్‌ వివిధ రూపాల్లో ఉంటుంది. యాంజైనల్‌ చెస్ట్‌ పెయిన్‌ (కేవలం ఛాతీ నొప్పి) మొదలుకొని... తీవ్రమైన పరిస్థితిలో (వరస్ట్‌ కండిషన్‌లో) రోగిని కోల్పోయే పరిస్థితి వరకు ఏదైనా జరగవచ్చు. 

ముప్పునుంచి గుండెను తప్పించండిలా...
ఇటీవల పెరిగిన అవగాహనలో మనలో చాలామంది పల్స్‌ ఆక్సిమీటర్‌ను కొని ఇంట్లో పెట్టుకుని తరచూ  ఆక్సిజన్‌ పాళ్లు చెక్‌ చేసుకుంటూ ఉన్నారు. ఈ ఉపకరణంతో  తమ రక్తంలో ఆక్సిజన్‌ పాళ్లు (ఆక్సీజన్‌ శాచ్యురేషన్‌) తగినంతగా ఉన్నాయా లేదా అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మొదట విశ్రాంతిగా కూర్చుని ఒకసారి చెక్‌ చేసుకుని, ఆ తర్వాత మరో ఐదారు నిమిషాలు నడిచాక మరోమారు చెక్‌ చేసుకోవాలి. ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ 95 కంటే ఎక్కువగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. కానీ అంతకంటే తక్కువగా ఉంటే తక్షణం ఆసుపత్రికి వెళ్లాల్సిందే.

కొందరు చిన్న నొప్పిని కూడా భరించలేరు. కండరాల్లోనూ లేదా ఇతరత్రా ఏదైనా నొప్పి కనిపిస్తే తక్షణం నొప్పినివారణ మాత్ర వేసుకుంటూ ఉంటారు. వీలైనంతవరకు పెయిన్‌కిల్లర్‌ వేసుకోకపోవడమే మంచిది. ఇక ఐబూప్రొఫెన్‌ లాంటి మందులైతే అస్సలు వద్దు. ఒకవేళ వేసుకోవాల్సి వస్తే ఎలాంటి హానీ చేయని నొప్పినివారణ మందును డాక్టర్‌ సలహా మేరకే పరిమితమైన సమయం కోసం మాత్రమే వాడాలి. 

ఒకసారి ఈసీజీ తీయించుకోండి. దాంట్లో ఏదైనా తేడా ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించండి. డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు తాము వాడే అన్ని రకాల మందుల్ని ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఎప్పుడూ గ్యాప్‌ రానివ్వకుండా అందుబాటులో ఉంచుకోవాలి. మామూలు డయాబెటిస్, హైబీపీ ఉన్నవారే ఇంత జాగ్రత్తగా ఉంటే ఇప్పటికే గుండెజబ్బులున్నవారూ, స్టెంట్‌ వేయించుకుని మందులు వాడే వారు, హార్ట్‌సర్జరీ (సీఏబీజీ) చేయించుకున్నవారు తమ మందుల్ని క్రమం తప్పక వాడాల్సిందే అన్న విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కరోనాతో రక్తంలో క్లాట్స్‌ వచ్చే ప్రమాదం ఉన్నందున... గుండెజబ్బులున్నవారు వాడే రక్తాన్ని పలచబార్చే మందులు వారికి మరింత ప్రయోజనకారి అన్న విషయాన్ని గుర్తించి, ఆ మందులతో బాటు... ఇతర ఏ మందులనూ ఆపకూడదు. మందుల పట్ల నిర్లక్ష్యం ఎంత మాత్రమూ తగదు.

కొద్దిపాటి ఆయాసం వచ్చేవారు కోవిడ్‌ పరీక్ష చేయించుకోవడంతో పాటు ఛాతీ సీటీస్కాన్‌ తీయించుకుని, డాక్టర్‌కు చూపించి దాన్ని దగ్గర ఉంచుకోవడం మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతం గా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం, ఒత్తిడికి గురికావడం అన్నది రక్తనాళాల్లో రక్తాన్ని వేగంగా దౌడు తీయిస్తుంది. అది గుండెపై ఒత్తిడిని పెంచి, దాని స్పందనలను వేగవంతం చేస్తుందన్నది మనకు తెలిసిందే. మనం ప్రశాంతంగా ఉంటే గుండె కూడా ఆటోమేటిగ్గా ప్రశాంతంగానూ, ఆరోగ్యంగానూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 

కరోనాతో గుండెకు జరిగే నష్టమేమిటి? 
కరోనా వైరస్‌ మన గుండెకు చేరాక అది గుండె కండరాన్ని బాగా బలహీన పరుస్తుంది. ఫలితంగా గుండె కండరం తీవ్రంగా దెబ్బతింటుంది. మొదట్లో ఎలాంటి గుండెజబ్బులూ లేదా గుండెకు సంబంధించిన సమస్యలూ లేనివారిలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఇక అదివరకే గుండెజబ్బులు ఉన్నవారిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని స్పష్టంగా మనకే అర్థమవుతుంది. ఇక గతంలో గుండెపోటు వచ్చి ఉన్న వారి పరిస్థితి మరింత విషమించేందుకు అవకాశాలు ఎక్కువ.
-డాక్టర్‌ అనిల్‌కృష్ణ గుండాల
సీనియర్‌ కార్డియాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement