కరోనా వైరస్ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని అందరికీ తెలిసిందే. ఇటీవల మనం చూస్తున్న కొత్త పరిణామం ఏమిటంటే... కరోనాతో బాధపడుతున్న కొందరు అకస్మాత్తుగా గుండెపోటు/గుండెజబ్బుతో కన్నుమూస్తున్నారు. ఇలాంటివారిలో కొంతమంది యువకులూ ఉన్నారు. ఇలా వారు మరణించడం ఎంతో విషాదకరం. ఇటువంటి వార్తలు అందరిలో ఆందోళననూ పెంచడం సహజం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌తో వచ్చే కోవిడ్–19... కొందరు రోగుల్లో గుండెను ఎలా ప్రభావితం చేస్తోంది, ఎందుకలా జరుగుతోంది, దాన్ని నివారించడం ఎలా... లాంటి విషయాలపై అవగాహన కోసమే ఈ కథనం.
గుండెను ఎలా ప్రభావితం చేస్తుందంటే...
కరోనా వైరస్ దేహంలోకి ప్రవేశించడానికి కారణం మన శరీరంలో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్. దేహంలో ఉన్నట్లే మన గుండెపై కూడా ఈ రిసెప్టార్స్ ఉంటాయి. దీని ద్వారానే కరోనా వైరస్ కొందరిలో గుండె కండరంలోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించాక అది గుండె కండరాన్ని బలహీన పరిచి ఆ తర్వాత దెబ్బతీస్తుంది. ఇలా జరిగినప్పుడు... అదివరకే గుండెజబ్బులు ఉన్నవారు... లేదా గతంలో గుండెపోటు వచ్చి ఉన్నవారి పరిస్థితి మరింత విషమించేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ విషమించడం అన్నది... హార్ట్‌ఎటాక్ రూపంలో కనిపించవచ్చు; హార్ట్ ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు; లేదా మరికొందరిలో గుండె స్పందనల తాలూకు లయ (హార్ట్ రిథమ్) దెబ్బతినవచ్చు. అంటే గుండెస్పందనలు వేగవంతమైనా కావచ్చు. లేదా చాలా స్లో అయిపోవడం... కాసేపు వేగం, కాసేపు నెమ్మది... ఇలా ఒక నియతి లేకుండా (ఇర్రెగ్యులర్‌గా) కొట్టుకుంటుండవచ్చు.
గుండెపోటును మిమిక్రీ చేసే కరోనా వైరస్...
గుండెసమస్యలను తెలుసుకోడానికి చేసే తొలి పరీక్ష ఈసీజీ. కరోనా కారణంగా గుండె ప్రభావితమైన వారికి ‘ఈసీజీ’ తీస్తే... కొందరిలో ‘గుండెజబ్బు’ను సూచించేలా ఈసీజీలో కనిపించవచ్చు. ఇలా అది గుండెపోటును మిమిక్ చేస్తుందన్నమాట. అప్పుడు మనం ఆ తర్వాతి పరీక్ష అయిన ‘యాంజియోగ్రామ్’ నిర్వహించి చూస్తే... దాంట్లో మాత్రం గుండెపోటు వచ్చిన దాఖలాలేవీ కనిపించవు. అంతమాత్రాన సంతోషించలేము.
ఎందుకంటే... కరోనా వైరస్ గుండెకు సోకి కోవిడ్–19 వచ్చిన వారిలో గుండె కండరానికి ఇన్ఫెక్షన్, కండరంలో వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్) రావడం వల్ల అది హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. కొంతమందిలో రక్తపోటు (బీపీ) బాగా తగ్గిపోయి, రోగి షాక్‌కు గురై చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఒక్కోసారి కంప్లీట్ హార్ట్‌బ్లాక్ అని చెప్పే కండిషన్ కూడా కనిపించవచ్చు. అందుకే కోవిడ్–19 కొందరు ఆకస్మికంగా చనిపోవడానికి ఇక్కడ పేర్కొన్న అంశాలే కారణం. అప్పటికే గుండెజబ్బు ఉన్నవారు అకస్మాత్తుగా చనిపోవడానికి అవకాశాలు ఎలాగూ ఎక్కువే. దాంతోపాటు గుండెజబ్బులేమీ లేనివారిలో కూడా 20 శాతం మందిలో ఇవే పరిణామాల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.
కొన్నిసార్లు మందులూ మరణానికి కారణాలే...
హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్ కలిపి తీసుకోవడం నివారణకు (ప్రొఫిలాక్టిక్‌గా) తోడ్పడుతుందని గతంలో మనం చదివిన విషయమే. వాటిని వాడిన వారిలో గుండె ప్రభావితమవుతుంది. దాంతో గుండె స్పందనలను సూచించే ‘క్యూ‘.. ‘టీ’ అనే తరంగాల తాలూకు ప్రకంపనల మధ్య వ్యవధి పెరగడం (క్యూ – టీ ఇంటర్వెల్ ప్రొలాంగ్ కావడం) జరగవచ్చు. ఇది రోగి మరణానికి కారణం కావచ్చు. ఇక చికిత్సలో భాగంగా రోగుల ప్రాణరక్షణ కోసం వాడే లోపినావిర్, రెటినావిర్ వంటి హెచ్‌ఐవీకి వాడే కొన్ని మందులను కూడా కొందరు కోవిడ్–19 రోగులకు వాడుతున్నారు. చాలా అరుదుగానే అయినా ఈ మందులు కొందరు రోగుల్లో ఆకస్మిక మరణానికి దారితీసే అవకాశం ఉంది.
సమస్య తీవ్రతను తెలియనివ్వని ‘హ్యాపీ హైపాక్సియా’!
సాధారణంగా కరోనా వ్యాధి వల్ల ఊపిరితిత్తులలో నీరు చేరడం వల్ల కొద్దిగా నడిచినా తీవ్రమైన ఆయాసం రావడం సహజం. ఆక్సిజన్ అందకపోవడం వల్ల కనిపించే ఈ లక్షణాన్ని హైపాక్సియా అంటారు. కానీ కరోనా వచ్చిన కొందరిలో లంగ్స్ సమస్య ఉన్నప్పటికీ చివరివరకూ ఆయాసం రాకపోవడం, దాంతో హాస్పిటల్‌కు వెళ్లకపోవడంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఈ కండిషన్‌నే ‘హ్యాపీ హైపాక్సియా’ అంటారు. హ్యాపీ హైపాక్సియాలో గుండె కండరానికీ, గుండెకూ జరగాల్సిన చేటు జరుగుతున్నప్పటికీ అది బయటికి తెలియకుండానే రోగి అకస్మాత్తుగా చనిపోయే అవకాశముంది.
గుండెకు చేకూరే మరికొన్ని రకాల చేటు...
కొందరిలో జన్యుపరంగానే లాంగ్ క్యూటీ సిండ్రోమ్, బ్రుగాడా సిండ్రోమ్ వంటి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక కొందరు రోగుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువ. కాళ్ల రక్తనాళాల్లోగానీ లేదా మరెక్కడైనా గాని... ఇలా గడ్డకట్టిన రక్తపు క్లాట్స్... గుండెకు చేరి, అక్కడ ఊపిరితిత్తులకు జరిగే రక్తసరఫరాకు అడ్డుపడ్డా కూడా అకస్మాత్తుగా మరణం సంభవించే అవకాశాలూ ఎక్కువే. ఇక ఇప్పటికే గుండెజబ్బులు లేదా గుండెకు సంబంధించిన ఇతర వ్యాధులు ఉన్నవారు కరోనాకు భయపడి హాస్పిటల్స్‌కు వెళ్లడం లేదు. దాంతో ఫాలో అప్స్ జరగకపోవడం, పూర్తిగా వ్యా«ధి ముదిరాక మాత్రమే హాస్పిటల్స్‌కు రావడంతో... వాళ్లకు అందాల్సిన చికిత్స త్వరితంగానూ, వేగంగానూ అందక కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి.
కోవిడ్–19 రోగుల్లో గుండె సమస్యల నివారణ/మేనేజ్‌మెంట్
► రోగికి కోవిడ్–19 వచ్చాక... అది గుండెజబ్బులు ఉన్నవారైతే మరింత ఎక్కువగా మెడికల్ కేర్, మెడికల్ అటెన్షన్‌లో ఉండాలి.
► ఇలాంటి రోగులు తమకంటూ ఓ ఆక్సీమీటర్ తీసుకొని పెట్టుకోవాలి. తరచూ ఆక్సీమీటర్‌లో తమ రక్తంలోని ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది వేలికి పెట్టుకుని చూసుకునే ఓ చిన్న ఉపకరణం. రోగి విశ్రాంతిగా ఉన్న సమయంలో చెక్ చేసుకొని, తమ రక్తంలో తగినంత ఆక్సిజన్ పాళ్లు తగినంతగా ఉన్నాయా అన్నది రోజుకోసారి చెక్ చేసుకోవాలి. విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఓ ఆరు నిమిషాల పాటు నడిచాక కూడా ఓ సారి చెక్ చేసుకోవాలి. ఈ రెండు సందర్భాల్లోనూ రక్తంలో తగినంత మోతాదులో ఆక్సిజన్ ఉంటే ఇక చాలావరకు బెంగపడాల్సిన అవసరమే ఉండదు. ‘హ్యాపీ హైపాక్సియా’ వచ్చే అవకాశాలు ఉన్నందున తప్పనిసరిగా ఇలా రోజూ చెక్ చేసుకోవడం మంచిది.
► ఒకసారి ఈసీజీ తీయించుకోవాలి. ఏదైనా తేడా ఉంటే వెంటనే గుండెనిపుణుడికి చూపించుకోవాలి. ఎలాంటి తేడాలేకపోతే నిశ్చింతగా ఉండవచ్చు.
► కొన్ని ప్రమాదకరమైన మందులు వాడేటప్పుడు వాటి ప్రభావం గుండె మీద పడుతుందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి.
► గుండెజబ్బులు ఉన్నవారు తమకు అవసరమైన మందులను ముందే తెచ్చి పెట్టుకోవాలి. సరైన మోతాదులను తెలుసుకుని వాటిని క్రమం తప్పకుండా వాడాలి.
► కరోనాకు భయపడి హాస్పిటల్‌కు వెళ్లకుండా ఉండే బదులు గుండెజబ్బులు ఉన్నవారు తమ గుండెవైద్య నిపుణిడికి తరచూ చూపించుకుంటూ ఫాలోఅప్‌లో ఉండటం అవసరం.
► రక్తానికి సంబంధించి సీబీపీ, ఎల్‌డీహెచ్,డీడైమర్, ఫెరిటిన్ అనే కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలను చేయించుకోవడం ద్వారా ఏవైనా సమస్యలు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలున్నాయా అన్న విషయం ముందే తెలుస్తుంది. ఉదాహరణకు డీడైమర్ ఫలితాల్లో అది ఎక్కువగా ఉన్నట్లయితే రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువ అన్న విషయం తెలుస్తుంది. ఇలాంటి వాళ్లు... ఆ ఫలితాన్ని బట్టి రక్తాన్ని పలచబార్చే మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే అయా ఫలితాలను బట్టి కొన్ని మందులను డాక్టర్లు సూచిస్తారు.
► కొద్దిపాటి ఆయాసం వచ్చేవారు ఓసారి ఓసారి ఛాతీ సీటీస్కాన్ తీయించుకుని ఉంచుకోవడం మంచిది. దాన్నిబట్టి డాక్టర్లు ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలను పసిగట్టి, వాటిని నివారించే మార్గాలను సూచిస్తారు.
ఇక అన్నిటికంటే ముఖ్యంగా అవసమైనది ప్రశాంతత. మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడీ ఉండదు. గుండెకూడా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అతి లోపించడం వల్ల పెరిగే ఒత్తిడి అటు గుండెపైనా... ఇటు రోగనిరోధక శక్తిపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండటం వల్ల అటు కరోనానూ, ఇటు గుండెజబ్బులనూ నివారించవచ్చు. జీవితాన్ని సంతోషంగానూ గడపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment