శిల్పం - కథ
అసలు శిల్పం ఎవరి కోసం? శిల్పానికి ఏ మాత్రం భంగం కలగకుండా రాసినా, పాఠకుడి చేత చదివించేట్టు లేకపోతే, అప్పుడు శిల్పం ఏం చేస్తుంది? శిల్పంలేని కథనే పాఠకుడు ఇష్టపడితే అప్పుడేం చేస్తుంది? కళ కళ కోసమే అన్నట్టు, శిల్పం శిల్పం కోసమే అంటుందా?
అర్ధ శతాబ్దం క్రిందటి వరకూ కథ రాయడానికి కథాశిల్పం తెలిసివుండాలి అనే మాట గట్టిగా వినిపించేది. ఆ శిల్పం తెలుసు అనుకున్నవారిని ‘కథాశిల్పి’ అని ప్రశంసించేవారు. ఆ మాట వింటూనే, ఆయన ఒక చేత్తో ఉలీ, ఇంకో చేత్తో సుత్తీ పట్టుకున్నట్లు కనిపించి, కొంత భయమేసేది. దాన్తో కథ రాయలన్నా, రాసినదాన్ని బయటపెట్టాలన్నా సంకోచంగా వుండేది. రా.రా. (రాచమల్లు రామచంద్రారెడ్డి)లాంటి వారు కూడా శిల్పం కోసమే కథలు రాశానన్నారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారైతే, ‘కథాశిల్పం’, ‘నవలాశిల్పం’, ‘విమర్శాశిల్పం’ అని మూడు శిల్పాలపైనా మూడు పుస్తకాలు రాశారు. వాళ్ళిద్దరి మీదా నాకు గౌరవం వుంది. అగౌరవించడానికి ఈ మాట అనడంలేదు. శిల్పం అంటే ఏమిటో అన్న ఆలోచనలో భాగంగా అనవలసి వచ్చింది. వాళ్ళే కాదు, కథలు రాయడం ఎప్పుడో మానేసిన వాళ్ళూ, అసలు కథలే రాయనివాళ్ళూ కూడా శిల్పం గురించి చెప్పారు.
శిల్పం గురించి అందరు చెప్పిందీ విని, చూసి, ఆలోచిస్తే, ఆఖరికి తేలేది ‘చెప్పే తీరు’ అనే. చెప్పే తీరు అంటే మరీ తేలిగ్గా వుంటుంది కనుక, ‘శిల్పం’ అని గంభీరంగా అన్నట్ట్టనిపిస్తుంది. సంస్కృతం అందరూ చదవడాన్ని ఇష్టపడని కొందరు దాన్ని ‘దైవభాష’ అన్నారు. దైవభాషను మరి మనుషులే రాశారు, మాట్లాడారు కదా... అని అప్పుడెవరన్నా అడిగారో లేదో తెలీదు. ఇప్పుడు మనం అడగవచ్చు. కథాశిల్పం గురించి తెలుసుకోకుండానే, అసలు దాన్ని గురించి ఆలోచించకుండానే కథలు రాస్తున్నారు కదా... అని. దానికి ‘‘అవును అందరూ రాస్తున్నారు, అలా ఎవరుబడితే వాళ్ళు రాయగూడదనే అలా చెప్పింది’’ అంటారా! నేను వితండవాదం చేస్తున్నట్టు కొంతమందికి కోపం వచ్చివుంటుంది. కోప్పడకండి గురువులూ, నన్ను పూర్తిగా చెప్పనీయండి.
అసలు శిల్పం ఎవరి కోసం? శిల్పానికి ఏ మాత్రం భంగం కలగకుండా రాసినా, పాఠకుడి చేత చదివించేట్టు లేకపోతే, అప్పుడు శిల్పం ఏం చేస్తుంది? శిల్పంలేని కథనే పాఠకుడు ఇష్టపడితే అప్పుడేం చేస్తుంది? కళ కళ కోసమే అన్నట్టు, శిల్పం శిల్పం కోసమే అంటుందా? శిల్పం జవాబు చెప్పలేదు. చెబితే, ‘‘దేనికైనా ఓ పద్ధతి వుండాలి, అలాగే కథ రాయడానికీ వుండాలి’’ అంటుందేమో! దానికి వెంటనే ‘‘ఆ పద్ధతి పనికి రాలేదని తేలిపోయింది కదా...’’ అనే జవాబుంటుంది. అసలు సంగతేమిటంటే, శిల్పం పాఠకుడిని గురించి ఆలోచించనే లేదు. రాసేవాళ్ళకు మాత్రమే ఇలా ఇలా రాయాలని నిబంధనలు పెట్టింది. పాఠకుడి వైపు నుంచీ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోవడం అందువల్లనే. అష్టాదశ వర్ణనలుండాలని పెట్టిన నిబంధన ప్రబంధానికే గతిపట్టించిందీ తెలిసిందే. అప్పుడు ప్రబంధానికి లేని జ్ఞానం ఇప్పుడు కథకుంది. కనుక, శిల్పం సంకెళ్ళను తెంచుకుంది. ‘‘కథకు సంకెళ్ళు వేయడం వంటిదా శిల్పమంటే?’’ అని ప్రశ్నించవచ్చు. అప్పటికి ఆ ఉద్దేశం లేకపోవచ్చు. సమాజం మలుపుల వద్ద వుండిన కొన్ని ఉద్దేశాల ఫలితం, సమాజం ఆ మలుపు దాటిన తర్వాత కాని స్పష్టమవదు. అంతవరకూ అవి సరైనవే అనిపిస్తుంది. శిల్పం అలాంటిదే. కథకు శిల్పం అంతముఖ్యమైనదే అయితే, ఇప్పటికీ వుండాలి గదా!
ఇప్పుడెవరూ శిల్పాన్ని గురించి మాట్లాడ్డం లేదు. ఎవరన్నా మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అన్ని వర్గాల నుంచీ, కులాల నుంచీ కథలు వస్తున్నాయి. అప్పుడు చెప్పని, చెప్పలేని, అసలు ఊహించనే లేనివి కథలుగా వస్తున్నాయి. కథ చెప్పే విషయంతో ఏకీభవించే పాఠకులు ఆసక్తిగా చదువుతున్నారు. ‘విషయంతో ఏకీభవించే పాఠకులు’ అనడం ఎందుకంటే, విషయంతో కూడా ఏకీభవిస్తే తప్ప ఆసక్తితో చదవరు. చెప్పే తీరు మాత్రమే పాఠకుల్ని పూర్తిగా అంగీకరింప చెయ్యలేదు. ‘చెప్పడం బావుంది కానీ...’ అనడంతో ఆగిపోతుంది. ఎదుటి వారి నుంచీ సానుకూల స్పందన రాకపోతే ‘హిప్నటైజ్’ చెయ్యడం సాధ్యం కాదన్నది తెలిసిందే.
ఇప్పుడు కథకూ, పాఠకులకూ స్వేచ్ఛ దొరికింది. స్వేచ్ఛ వున్నప్పుడే ఏదైనా ఎదిగేందుకు అవకాశం వుండేది. ఈ చిన్నవ్యాసం ద్వారా శిల్పం గురించి చెప్పిన అభిప్రాయంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కానీ, శిల్పం వల్ల లభించని విస్తృతీ, ప్రయోజనమూ ఇప్పుడు కథకు లభించినట్టు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను.
పి. రామకృష్ణ