రాజేష్‌ఖన్నా తొలి గురువు ఎవరంటే..
ప్రేమ- ద్వేషం
రాజేష్‌ఖన్నా సూపర్‌స్టార్ కావచ్చు... అతడి కోసం వేలాదిమంది అమ్మాయిలు వెర్రెక్కిపోతుండవచ్చు... కాని ఒకరు మాత్రం అతణ్ణి లెక్క చేసేవారు కాదు. అసలు పట్టించుకునేవారు కూడా కాదు. అతడు మాత్రం ఆమె కోసం వెంపర్లాడేవాడు. ఆమె పేరే అంజు మహేంద్రు. ముంబైలో ఆ రోజుల్లో ఫ్యాషన్ ఐకాన్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నటిగా పేరు పొందిన అంజు మహేంద్రు సినిమా రంగంలో రాజేష్ ఖన్నా పైకి రావడానికి అవసరమైన వేషభాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిన తొలి గురువు. ఆమె అతణ్ణి ఇష్టపడింది. అతడు ఆమెను ప్రేమించడమే కాక చాలా కృతజ్ఞతతో ఉండేవాడు. వాళ్లిద్దరూ దాదాపు ఏడేళ్లు కలిసి ఆ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవారు. అయితే ఆ జోడి విడిపోయింది. దానికి కారణం రాజేష్‌ఖన్నా పొజెసివ్‌నెస్ కావచ్చు.
అంజు మహేంద్రు విస్తృతమైన ఎక్స్‌పోజర్ కావచ్చు. ఆమె ఎప్పుడూ అతడికి దొరికేది కాదు. పార్టీలు స్నేహాలతో బిజీగా ఉండేది. అంతేకాక బయట జనం అంతా పొగుడుతుంటే ఈమె మాత్రం ఏడ్చినట్టు చేశావ్... అక్కడ ఆ బట్టలు సరి కాదు... ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెషన్ సరికాదు అని విమర్శించేది. దాంతో రాజేష్‌ఖన్నా ఇగో బాగా హర్ట్ అయ్యింది. ఎంతగా అంటే అప్పటికి ‘బాబీ’ సినిమా రిలీజ్ కాకపోయినా తన కంటే వయసులో చాలా చిన్నదే అయినా డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకునేంత వరకూ (1973) ఒంటి కాలి మీద ఉన్నాడు. అంజు మీద అతడికి ఎంత కచ్చ పెరిగిందంటే పెళ్లి బారాత్ ఆమె ఇంటి మీదుగా వెళ్లాలని పట్టుబట్టి ఆమె ఇంటి ముందు చాలా హంగామా చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత డింపుల్ ఇంటికి పరిమితమైంది. అంజు మహేంద్రు, రాజేష్ ఖన్నా దాదాపు 17 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు కూడా. అంజు మీద కోపంతో, అప్పటికే తనకు అందివచ్చిన స్టార్‌డమ్‌తో రాజేష్ ఖన్నా ఆమె కెరీర్ మీద ఒత్తిడి తెచ్చాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆమెకు నటిగా వేషాలు రాకుండా చేయడం, ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుపడటం, వాటిని తనే కొనేసి మూల పడేయడం... జువెల్ థీఫ్ (1967), హస్తే జఖ్మ్ (1973) వంటి సినిమాలలో నటించినా హీరోయిన్‌గా పతాక స్థాయికి వెళ్లలేకపోవడానికి రాజేష్‌ఖన్నా ఒక కారణం అని చెబుతారు.
అయితే ఆ తర్వాత వాళ్లు మళ్లీ స్నేహితులయ్యారు. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో వాళ్లిద్దరూ తరచూ కలిసేవారు. రాజేష్ ఖన్నా జీవితంలో ఆ తర్వాత కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు. అతడితో 11 సినిమాలు చేసిన టీనా మునిమ్ (ఇప్పుడు టీనా అంబాని) అతణ్ణి దాదాపు పెళ్లి చేసుకోబోయిందని అంటారు. కాని డింపుల్‌తో చట్టపరంగా విడాకులు కాకపోవడం వల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉండటం వల్ల వాళ్ల మీద ఎటువంటి ప్రభావం పడుతుందోనని రాజేష్‌ఖన్నా ఆమె కోరికను తిరస్కరించారని అంటారు. రాజేష్ ఖన్నా జీవితంలో ఏమి జరిగినా ఆయన ఎప్పుడూ కాంట్రవర్శీలకు దూరంగా ఉన్నాడు. ఎప్పుడూ ఏ గొడవలో దూరకుండా తన పనేదో తాను చేసుకుంటూ బతికాడు. ఇప్పటి స్టార్లను చూస్తే ఆ సూపర్‌స్టార్ వ్యక్తిత్వం ముందు కొంచెం చిన్నగానే కనిపిస్తారు.