కంకణం కట్టుకుందాం
దైవికం
దేవుడు కనిపించకపోవచ్చు. కానీ దైవభీతి ఉంటుంది. మన చేతికి రాఖీ లేకపోవచ్చు. కానీ ఆడపిల్లల్ని నిశ్చింతగా ఉంచేందుకు మనకై మనం కంకణం కట్టుకోవచ్చు కదా!
రాఖీ పండుగ ప్రతి యేడూ వస్తుంది. అయితే ఈసారి రాఖీ రాకడ వెనుక ‘ప్రత్యేకమైన’ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు రాఖీ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనవి. రాఖీ.. స్త్రీకి భరోసా ఇస్తుంది. అన్న ఉన్నాడని, తమ్ముడు ఉన్నాడని, భర్త ఉన్నాడని, కొడుకు ఉన్నాడని; వీళ్లందరిలో ఒక రక్షకుడు ఉన్నాడని ధీమాను కలిగిస్తుంది.
అయితే అలాంటి ధీమాను, భరోసాను అన్నదమ్ములు, తక్కిన కుటుంబ సభ్యులు, ప్రజా నాయకులు.. వీళ్లెవ్వరూ ఇవ్వలేరని; వాళ్లతో పాటు ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయాలు, నాగరికతలు.. ఇవి కూడా ఏమీ చేయలేవని రూఢీ అవుతున్న ఒక నిస్సహాయ వాతావరణంలో మన ఆడకూతుళ్లు బితుకుబితుకుమంటూ ఉన్నప్పుడు వస్తున్న రాఖీ ఇది! 2012 నాటి ఢిల్లీ బస్సు ఘటన తర్వాత, దోషులకు శిక్ష పడిన తర్వాత, నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్త్రీజాతిపై పగబట్టినట్లుగా దేశమంతటా అత్యాచారాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. వాటికి పదింతలుగా.. రక్షణ కల్పించవలసిన వారి (ప్రజానాయకులు, ప్రభుత్వాధికారులు) నోటి నుంచి స్త్రీలకు వ్యతిరేకంగా వెలువడుతున్న అభ్యంతరకరమైన మాటలు కూడా!
రేప్ అనేది కొన్నిసార్లు తప్పు, కొన్నిసార్లు రైట్ అట. ఓ మంత్రిగారు అంటారు! ‘ఒక్క యూపీలోనే జరగడం లేదు కదా’ అని ఆ రాష్ర్ట సీఎం గారి చికాకు. ‘పాశ్చాత్య నాగరికత చెడగొడుతోందండీ’ అని స్వామీ నిశ్చలానంద సరస్వతి. ఇంకా ఇలాంటివే రకరకాల విశ్లేషణలు. ‘‘టీవీ చానళ్లు మతిపోగొడుతున్నాయి మరి!’’, ‘‘ఇంటర్నెట్ వచ్చాక ఎడ్యుకేషన్ ఎక్కువైంది’’, ‘‘పెద్దపిల్లల్ని, స్త్రీలని రేప్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. మరీ పసికందుల మీద కూడానా?’’, ‘‘ఆ మహిళ గౌరవనీయురాలైతే ఎందుకలా జరిగి ఉండేది?’’, ‘‘మీద పడబోతున్నప్పుడు ‘అన్నయ్యా’ అంటే సరిపోయేది కదా’’, ‘‘ఒంటి నిండా బట్టలుంటే ఇలాంటివి జరగవు’’, ‘‘స్కూళ్లలో స్కర్టుల్ని బ్యాన్ చెయ్యాలి’’, ‘‘సీత లక్ష్మణ రేఖ దాటింది కాబట్టే అపహరణకు గురైంది’’, ‘‘పెట్రోలు, ఫైరు ఒకచోట ఉంటే అంటుకోవా?’’, ‘‘అంతా గ్రహ ఫలం.. గ్రహాలు సరిగ్గా లేకుంటే ఇలాగే జరుగుతుంది’’, ‘‘ఫాస్ట్ ఫుడ్ తింటే ఇంతే’’, ‘‘చీకటి పడ్డాక ఆడపిల్లకు బయటేం పని?’’, ‘‘బడికెళ్లే పిల్ల చేతికి మొబైల్ ఇస్తే అంతే సంగతులు’’, ‘‘బాయ్‌ఫ్రెండ్స్ ఉన్న పిల్లలకే ఎక్కువగా ఇలాంటివి జరుగుతాయి’’, ‘‘ఆ సమయం వస్తే దేవుడు కూడా కాపాడలేడు’’... ఇదీ వరస!
అత్యాచారాలు జరక్కుండా చూడండి నాయనలారా, నాయకులారా అని మొత్తుకుంటుంటే... ఇంట్లోంచి బయటికి రావద్దు, వచ్చినా గాలి పీల్చొద్దు, కంట్లో పడిన నలకను తీసుకోవద్దు, వదులైన జడను పబ్లిగ్గా బిగదీసి కట్టుకోవద్దు అంటుంటే ఏం చెప్పాలి? ఇలా మాట్లాడే పెద్దమనుషులక్కూడా ఇంట్లో ఒక చెల్లో, అక్కో, భార్యో, కూతురో ఉండి ఉంటారు కదా. కనీసం బయటి నుండి రాఖీ కట్టేందుకు వచ్చేవారైనా ఉంటారు కదా. చూడాలి.. ఈసారి ఏ అర్హతతో వారు తమ చేతికి రాఖీ కట్టించుకుంటారో!
అన్నాచెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు ఎంతో ప్రియమైన వేడుక రాఖీ. అన్నగానీ, తమ్ముడు గానీ ఆడపిల్లకు దేవుడిచ్చిన స్నేహితుడు. అలాగే, స్నేహితుడు ఆ పిల్ల ఎంపిక చేసుకున్న సోదరుడు. ఈ స్పృహ ఆడపిల్లలకు ఉంటుంది. ఉండాల్సింది మన ఇళ్లల్లోని అబ్బాయిలకు, రాజకీయాల్లో, ప్రభుత్వ గణాల్లో ఉన్న మొద్దబ్బాయిలకూ.
దేవుడు ప్రతి చోటా తను ఉండలేక స్త్రీని సృష్టించాడని అంటారు. మరి ఆ స్త్రీపై అత్యాచారానికి తెగబడడం, ఆ స్త్రీని నోటికి వచ్చినట్లు తూలనాడడం అంటే దేవుడిని దూషించడమే కదా. దేవుడికి అపచారం జరిగినట్లే కదా! దేవుడు కనిపించకపోవచ్చు. కానీ దైవభీతి ఉంటుంది. మన చేతికి రాఖీ లేకపోవచ్చు. కానీ ఆడపిల్లల్ని నిశ్చింతగా ఉంచేందుకు మనకై మనం కంకణం కట్టుకోవచ్చు కదా.
- మాధవ్ శింగరాజు