
రకుల్ ఎలాంటి అబ్బాయితో ప్రేమలో పడాలని కోరుకుంటున్నారు?
రకుల్‌కి అమన్... భాయ్.
అమన్‌కి కూడా రకుల్... భాయ్!
అలా పెరిగారు ఇద్దరూ...
అన్నదమ్ముల్లా!!
చిన్నప్పట్నుంచీ తనను తానే ప్రొటెక్ట్ చేసుకునే కాన్ఫిడెన్స్ ఉన్న అక్కయ్య రకుల్.
అక్కయ్యే కాదు, తమ్ముడిని ఒక ఆట ఆడుకునే అన్నయ్య కూడా!
రాఖీ కట్టి గిఫ్ట్ ఇచ్చే అక్కయ్య రకుల్.
అక్కయ్య మాత్రమే కాదు.. నీ కష్టంలో సంతోషంలో తోడుంటాననే అన్నయ్య కూడా!
అందుకే రకుల్... రకుల్‌భాయ్.
ముందుగా అక్క మాటల్లో తమ్ముడి గురించి.. తమ్ముడి మాటల్లో అక్క గురించి తెలుసుకోవాలని ఉంది..
రకుల్ ప్రీత్ సింగ్: నాకంటే అమన్ మూడేళ్లు చిన్న. హి ఈజ్ ఏ బ్రాట్. చాలా నాటీ. చిన్నప్పట్నుంచి ‘జంగిల్ బుక్’లో మోగ్లీ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మతో నాకు మోగ్లీ కావాలని మారాం చేసేదాన్ని. నిజంగానే మోగ్లీ వచ్చాడు. (నవ్వుతూ అమన్ వైపు చూస్తూ)... చాలా తుంటరి పిల్లాడు.
అమన్: ఐయామ్ నాటీ. నా స్నేహితులు, అక్క స్నేహితులు... ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. (నవ్వుతూ..) అక్క కూడా తక్కువేం కాదు. చాలా నాటీ, తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. షి ఈజ్ వెరీ స్మార్ట్. తను కూడా అల్లరి పనులు చేస్తుంటుంది.
రకుల్: తమ్ముడివైపు చూస్తూ ‘హలో...’
అమన్: హలో.. హాలో.. ఏంటి?
రకుల్: ఏం లేదు. ఇంటర్వ్యూ కదా అని ఓవర్‌గా మాట్లాడకు. మనిద్దరం ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడు.
చిన్నప్పుడూ ఇలానే ఉండేవారా?
అమన్: చేయాల్సిన అల్లరంతా చేసేసి, ఆ తర్వాత భలే కవర్ చేసుకుంటుంది. స్కూల్‌లో అచ్చం టామ్‌బాయ్ టైప్‌లో ఉండేది. క్లాసులు బంక్ కొట్టేది. కానీ, ఒక్కసారి కూడా దొరకలేదు తెలుసా! నేనెప్పుడు బంక్ కొట్టినా దొరికిపోయేవాణ్ణి.
రకుల్: అప్పుడు నన్ను ఎంత ఇరిటేట్ చేసేవాడో తెలుసా? ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మానాన్నలకు అన్నీ చెప్పేసేవాడు. ‘సొంత తమ్ముడు అయ్యుండి ఎందుకిలా చేస్తున్నాడు. అన్నీ ఇంట్లో చెప్తున్నాడు’ అనుకునేదాన్ని. లెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లా. దూరంగా అమన్ కనిపించాడు. రకుల్ తమ్ముడు వస్తున్నాడంటూ అందరూ భయపడ్డారు. ఎట్ దట్ టైమ్.. ఐ హేట్ హిమ్. నాలుగేళ్ల క్రితం నేను ఢిల్లీ నుంచి ముంబ య్‌కి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు బాగా క్లోజ్ అయ్యాం.
అక్కలు ఎప్పుడూ తమ్ముణ్ణి భయపెట్టాలని చూస్తారు. మీరేమో మీ తమ్ముడికి భయపడ్డారన్న మాట..
రకుల్: అప్పుడు ప్రతిదీ ఇంట్లో కంప్లైంట్ చేస్తాడని భయం. నేను కాలేజ్‌కి ఎంటరయ్యే సరికి తను బంక్‌ల కొట్టి, సినిమాలు అని తిరిగేవాడు. ‘సడన్‌గా నువ్ చాలా మారిపోయావ్’ అని ఆటపట్టించేదాన్ని. నిజంగానే హైస్కూల్‌కి వచ్చిన తర్వాత అమన్‌లో మార్పు వచ్చింది. ‘సారీ.. సారీ’ అనేవాడు. ‘నా స్కూల్ లైఫ్ అంతా స్పాయిల్ చేశావ్, ఇప్పుడెందుకు సారీ చెప్తున్నావ్’ అనేదాన్ని. ఇప్పుడు అక్కాతమ్ముళ్ల కంటే మేము మంచి ఫ్రెండ్స్. ఏ విషయాన్నయినా మాట్లాడుకుంటాం.
అమన్: అక్కతో మాట్లాడుతున్నానని ఆలోచించవలసిన అవసరం లేదు. నో ఫిల్టర్స్.
మీ గురించి కంప్లైంట్ చేసిన అమన్ పై కంప్లైంట్ ఇవ్వాలని ఎప్పుడైనా ప్రయత్నించారా?
రకుల్: ఆలోచిస్తూ.. నో. 9వ తరగతి వరకూ రాముడు మంచి బాలుడు టైప్. నా దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఏం లేదు. కానీ, చిన్నప్పడు ఇద్దరి మధ్య ఫైటింగులే. జుట్టు పట్టుకుని మరీ కొట్టుకునేవాళ్లం. నేనే చెంపదెబ్బలు కొట్టి, నన్ను కొట్టాడని ఏడ్చిన సందర్భాలున్నాయి. (నవ్వుతూ...)
ఫైటింగ్స్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
రకుల్: నాకంటే తను చిన్నగా ఉన్నప్పుడు నాదే అప్పర్ హ్యాండ్. పెద్ద అయిన తర్వాత ఫైట్ చేయలేక ‘సారీ’ చెప్పేశాను.
అమన్: నేను ఎప్పుడూ కొట్టలేదు. తనే నన్ను కొట్టి ఏడ్చేది.
రకుల్: నువ్ సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంట్లోనే కరాటే ప్రాక్టీస్ చేసేవాళ్లం. గుర్తుందా?
అమన్: (నవ్వుతూ...) ప్రతిదీ తనే స్టార్ట్ చేసేది. నాకు పంచ్ ఇచ్చేది. ఒకసారి నేను కాలితో కడుపు మీద ఓ కిక్ ఇచ్చాను. సడన్‌గా కింద పడింది, శ్వాస తీసుకోవడం కష్టమైంది.
రకుల్: ‘అసలేం చేస్తున్నారు? ఇలాంటి ఆటలేనా ఆడేది? ఇలా చేస్తే అక్క చచ్చిపోతుంది’ అంటూ ధడక్.. ధడక్.. అని నాన్న అమన్‌కి రెండిచ్చారు.
అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
అమన్: నాన్న బెల్ట్‌కి దొరక్కూడదని పరుగులు పెట్టా.
రకుల్: మీకో విషయం చెప్పాలి... తమ్ముడు పుట్టేవరకూ అందరి అటెన్షన్ నాపైనే ఉండేది. నన్ను ముద్దు చేసేవారు. అమన్ పుట్టిన తర్వాత నా వాకర్‌ని వాడికి ఇచ్చారు. అది నాకు నచ్చేలేదు. ఆ వాకర్ పనికి రాకుండా చేయాలని ఏదేదో చేసేదాన్ని. చిన్నగా వాణ్ణి గిల్లేదాన్ని. అమ్మ చాలా ఇరిటేట్ అయ్యేది. అమ్మానాన్న తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకున్నా, నాకంటే ఎక్కువ అటెన్షన్ వాడికి ఇచ్చినా కోపం వచ్చేది. కానీ, ఆ కోపం లైట్‌గానే. ఎందుకంటే నేను తమ్ముణ్ణి జాగ్రత్తగానే చూసుకునేదాన్ని. చిన్నప్పుడు లిటిల్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫైట్స్ తప్ప బ్యాడ్ ఫైట్స్ ఎప్పుడూ లేవు.
బ్యూటిఫుల్ సిస్టర్ ఉంటే బ్రదర్‌కి టెన్షన్ ఎక్కువ ఉంటుందేమో కదా...
అమన్: నో టెన్షన్. షి ఈజ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ డేంజరస్. ముందు చెప్పానుగా టామ్‌బాయ్ టైప్ అని. ఎవరూ రకుల్‌కి ప్రపోజ్ చేయాలని కూడా అనుకోరు. వెరీ స్ట్రాంగ్ గాళ్. ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే పబ్లిక్‌లోనే కొడుతుంది.
రకుల్: (నవ్వుతూ..) మైండ్ యూజ్ చేశాడు చూశారా? బ్యూటిఫుల్ పర్వాలేదు. స్టిల్ డేంజరస్ అంటున్నాడు.
ఈవ్ టీజింగ్, టీజర్స్‌పై తిరగబడడం వంటివి..?
రకుల్: ఉన్నాయి. కాలేజీ ఫస్ట్ ఇయర్‌లో ఫ్రెండ్స్‌తో కలసి హాలిడేకి నైనిటాల్ వెళ్లాను. మాల్ రోడ్డులో వెళ్తుంటే.. ఒకడు మా ఫొటోలు తీసుకుంటున్నాడు. వాడి దగ్గరకి వెళ్లి కాలర్ పట్టుకుని ‘ఏం కావాలి రా నీకు’ అని గట్టిగా ఒక్కటి పీకాను. వాడికి ఏమీ తెలియనట్లు ‘ఏమైంది’ అన్నాడు. ‘నువ్ ఇక్కడే ఉండరా’ అని పక్కనున్న షాప్‌కీపర్‌తో పోలీసులను పిలవమని చెప్పాను. వాడి ఫొన్ తీసుకుని కింద పడేశాను. నా కడుపు మీద గట్టిగా కొట్టి వాడు పారిపోయాడు. నేనూ వాడి వెనకాలే పరిగెట్టి, రాయి తీసుకుని కొట్టాను. ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే తాట తీస్తా. అమ్మాయిలు ఎందుకు భయపడాలి?
{బదర్స్ ఎప్పుడూ బాడీగార్డ్స్‌లా సిస్టర్స్‌ని కాపాడుకుంటారు. అమన్‌కి ఆ చాన్స్ వచ్చినట్టు లేదు.
అమన్: (నవ్వుతూ..) షి ఈజ్ మై బాడీగార్డ్.
రకుల్: అబద్ధం చెప్తున్నాడు. నా గురించి ఎప్పుడూ కేర్ తీసుకుంటాడు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తనే నా బాడీగార్డ్.
అమన్: నాకు బ్లాక్ కలర్ చాలా ఇష్టం. తనతో నేనెప్పుడు బయటకి వెళ్లినా.. బ్లాక్ వేసుకోవద్దని చెబుతుంది. ‘నా వెనక బౌన్సర్‌లా కనిపిస్తావ్. బ్లాక్ వద్దు’ అంటుంది.
రకుల్: బౌన్సర్ డైలాగ్ అమన్‌దే. పార్టీలకు ఎప్పుడూ ఇద్దరం కలసి వెళ్తాం. ‘అమన్, నాకోసం ఓ గ్రీన్ టీ తీసుకురమ్మని చెప్పు’ అంటే చాలు. ‘యస్, మేడమ్. బ్లాక్ వేసుకున్నాను కదా’ అని సరదాగా అంటుంటాడు కానీ, నా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాలు, పార్టీలకు వెళ్లినప్పుడు ఎవరైనా ఫొటోలని ఇబ్బంది పెడితే వాళ్లను వారిస్తాడు. క్రౌడ్ అంతా క్లియర్ చేస్తాడు.
సెలబ్రిటీ అయిన తర్వాత రకుల్ బిహేవియర్‌లో సడన్‌గా చేంజ్ ఏమైనా వచ్చిందా?
అమన్: నో. అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉంది. రకుల్ సెలబ్రిటీగా ఫీలవదు.
రకుల్: హైదరాబాద్‌లో నాకంటే అమన్ చాలా పెద్ద సెలబ్రిటీ. ఓసారి నేనూ, రెజీనా ఓ పనిమీద ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాం. రాత్రి పదకొండైంది. లిఫ్ట్‌లో పనిచేసేవాళ్లు ‘హలో మేడమ్, అమన్ సర్ రాలేదా?’ అనడిగారు. ఓరోజు బయటకు వెళ్లా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. దగ్గర వచ్చి..‘హాయ్, హౌ ఆర్ యు? మీ తమ్ముడు మీకంటే పెద్ద స్టార్ తెలుసా?’ అంది. థాంక్యూ అని చెప్పాను. అమన్ గోల్ఫ్ నేషనల్ ప్లేయర్‌గా అందరికీ తెలుసు.
ఇద్దరూ కలిసి బయటకు వెళ్లాల్సినప్పుడు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో డిస్కస్ చేసుకుంటారా?
రకుల్: బయటకు వెళ్తున్నప్పుడు సీరియస్‌గా ‘కొంచం మేకప్ వేసుకో. ఎలా కనిపిస్తున్నావో తెలుసా? నీట్‌గా ఉండే డ్రస్ వేసుకోవచ్చు కదా’ అని తనే నాకు చెప్తాడు. ‘రోజంతా మేకప్ వేసుకుంటాను. ఇప్పుడు కూడా ఎందుకు? నా ఫేస్ నా ఇష్టం. నీకేంటి? అవసరమైతే నైట్ సూట్ వెసుకుని వెళతా’ అని కౌంటర్‌ఇస్తా.
అమన్: చెప్పినా వినకుంటే ఏం చేస్తాం.
యాక్టర్‌గా మంచి రెమ్యునరేషన్ వస్తోంది. లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డారా?
అమన్: మనీ వేస్ట్ చేయడం రకుల్‌కి అస్సలు ఇష్టముండదు. వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఓసారి నేనే స్పోర్ట్స్ కార్ కొనిస్తానంటే వద్దని చెప్పింది. సింపుల్ ఫోర్ సీటర్ కారుంటే చాలు అంటుంది.
రకుల్: కోటి రూపాయలు పెట్టి టు సీటర్ కారు కొనుక్కోవాలా? అందులో ఏమీ రాదు. నా బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఎందుకు చెప్పండి?
ఇప్పుడు మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. రకుల్ ఎలాంటి అబ్బాయితో ప్రేమలో పడాలని కోరుకుంటున్నారు?
అమన్: ఫస్ట్... రకుల్ కంటే హైట్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్.. మంచి సెన్సాఫ్ హ్యూమర్, నిజాయితీ, తెలివితేటలు ఉండాలి. (నవ్వుతూ..) ఒకవేళ అటువంటి మంచి లక్షణాలున్న వ్యక్తి ఎవరైనా రకుల్‌ని ప్రేమిస్తే.. ప్రేమ గుడ్డిది
అనుకోవాలి (రకుల్ వైపు సరదాగా చూస్తూ)..
రకుల్: తప్పడ్ మారూంగీ (చెంపపై ఒక్కటిస్తా). నన్ను ఎవరైనా ప్రేమిస్తే ప్రేమ గుడ్డిది అనుకోవాలా? మంచి వ్యక్తి అయితే చాలు.
మంచి వ్యక్తి అయితే చాలా? డబ్బులు వద్దా?
అమన్: రిచ్ అయినా.. పూర్ అయినా.. నో ప్రాబ్లమ్.
రకుల్: మరీ పూర్ అయితే వద్దు. అలాగని ‘దేవుడా.. ఓ వెయ్యి కోట్లున్న అబ్బాయి కావాలి’ అని కోరుకోను.
అమన్ ఎలాంటి అమ్మాయితో ప్రేమలో పడాలనుకుంటున్నారు?
రకుల్: (నవ్వుతూ..) ఒక్క అమ్మాయితో ప్రేమలో పడితే చాలు. ‘పది మంది గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నా ఫర్వాలేదు. ఎవ్వరితోనూ అబద్దం చెప్పకు. డోంట్ బ్రేక్ ఎనీవన్స్ హార్ట్. నీతో అమ్మాయిని బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడేలా ప్రవర్తించకు’ అని అమన్‌కు ఎప్పుడూ చెబుతుంటాను. అర్థం చేసుకున్నాడు.
తమ్ముడిలో నచ్చే విషయం ఏంటంటే...
ఐదేళ్ల పిల్లాడి నుంచి యాభై ఏళ్ల వ్యక్తి వరకూ అందరితోనూ ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. యాక్టర్స్, నా స్నేహితులందరూ తమ్ముడి స్నేహితులే. ఒకవేళ నేను ఊరి (హైదరాబాద్)లో లేననుకోండి.. ‘సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం రా’ అని అమన్‌కి కాల్ చేస్తారు. చిన్నప్పట్నుంచీ అంతే. ఎవ్వరితోనైనా చైల్డ్‌హుడ్ బడ్డీస్ అన్నట్టు ఐదు నిమిషాల్లోనే ఎదుటి వ్యక్తితో మాట్లాడేస్తాడు. సైమాలో.. రవితేజగారి నుంచి ప్రకాశ్‌రాజ్ గారి వరకూ, లక్ష్మీ మంచు నుంచి హ్యూమా ఖురేషి వరకూ అందరూ అమన్ జోకులకు నవ్వలేక చచ్చిపోయారు.
అక్కలో నచ్చే విషయం ఏంటంటే...
17 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. 19 ఏళ్లకు ఢిల్లీలో సొంతంగా ఇల్లు కొనుక్కుంది. హైదరాబాద్‌లో ఉన్న ఇల్లు తను కొనుక్కున్న మొదటి ఇల్లు కాదు. సాధారణంగా ఆ వయసులో ఎవరైనా ఫ్రెండ్స్, పార్టీలు, షాపింగ్ అంటూ ఖర్చు పెడతారు. కానీ, రకుల్ డే వన్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసింది.
రాఖీ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్లు?
రకుల్: నాన్న ఆర్మీ ఆఫీసర్ కదా. ప్రతి రాఖీ పండక్కి వేర్వేరు ఊళ్లలో ఉండేవాళ్లం. అమ్మ మాకు ఇష్టమైన లడ్డూలు, కేకులు, జిలేబీలు చేసేది. ఇంట్లో ఉన్న టాయ్స్ అన్నీ ఓ చోట పెట్టి బెలూన్స్‌తో డెకరేట్ చేసేది. మధ్యలో నేనూ, తమ్ముడు. నేనేమో ‘అమ్మా.. తినొచ్చా’ అంటే.. ‘ముందు రాఖీ కట్టి తర్వాత తిను’ అనేది.
మీ తమ్ముడు గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చారా?
రకుల్: యస్. నాకింకా గుర్తుంది. మిజోరాంలో ఉన్నామప్పుడు. నేను మూడో తరగతి.. అమన్ యుకేజి. అప్పుడే మాట్లాడడం స్టార్ట్ చేశాడు, కొంచం కొంచం అర్థం చేసుకుంటున్నాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో క్యాసెట్స్ మాత్రమే ఉండేవి. అది తెలుసుకుని.. పది పది రూపాయలు దాచి, రూ.60 పెట్టి ‘క్యా కెహనా’ మూవీ క్యాసెట్ కొనిచ్చాడు.
ఈ రాఖీకి ఏం గిఫ్ట్ కొనిస్తున్నారు?
అమన్: ఏం ఇవ్వడం లేదు. రకుల్‌తో సమస్య ఏంటంటే.. ‘నీకు ఏం కావాలి?’ అనడిగితే ‘నువ్ నా కోసం ఏం కొనివ్వలేవు. నా దగ్గర అన్నీ ఉన్నాయి’ అంటుంది.
రకుల్: ‘డోంట్ ట్రబుల్ మి, డోంట్ బి నాటీ. రెస్పాన్సిబిలిటీగా ఉండు’ ... అలాంటివి అడుగుతాను.
తమ్ముడికి ఎప్పుడైనా ఖరీదైన గిఫ్ట్స్ కొనిస్తారా?
అమన్: ఒక్క సెకన్, (నవ్వుతూ..) నా ఫోన్ ఎక్కడుంది.
రకుల్: చేసింది చాలు. ఎన్నిసార్లు నీకు ఫోన్స్ కొనిచ్చాను. టెన్త్ క్లాస్‌లో బ్లాక్‌బెర్రీ ఫోన్ కొనిచ్చాను. ఒక్కరోజులో పోయింది. ఆ తర్వాత రెండుసార్లు కొత్త ఫోన్ కొనిచ్చాను. లాస్ట్ ఫోన్ విండోలో నుంచి కిందపడి పోయింది. అస్సలు జాగ్రత్త ఉండదు. అందుకే ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వను.
ఇంటర్వ్యూ: సత్య పులగం