అల్లా కే బందే
నేను నా దైవం
కుమారులు అబ్దుల్ మౌసింఖాన్, అబ్దుల్ ముజమిల్ ఖాన్‌లతో ఎ.కె.ఖాన్.
తల్లి కడుపులో పుడితే తోబుట్టువులవుతాం
కన్నవాళ్లకు పిల్లలమవుతాం
అవ్వాతాతలకు వారసులమవుతాం.
మరి అల్లాహ్ కి ఏమవుతాం?
ఖుదాకి దాసులమవుతాం!
అల్లాహ్ కే బందే అవుతాం
సేవకు దాసులమవుతాం
మంచికి బానిసలమవుతాం
పవిత్రతకు బందీలమవుతాం.
దేవుడున్నాడని మీరు నమ్ముతారా?
ఎ.కె.ఖాన్: దేవుడు లేకుండా సృష్టిలో ఇంత క్రమశిక్షణ ఉండదు. మనుషులైనా, పశువులైనా, ఏ జీవ జాలమైనా, చివరకు గ్రహాలు కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండటం వల్లే సృష్టిలో సమతౌల్యం ఏర్పడింది. దేవుడు లేకుండా సృష్టే లేదసలు.
ఇంత నమ్మకం మీకు ఎలా కలిగింది?
దేవుడు ఉన్నాడని నమ్మి ఒక పనిని చేయడం మొదలుపెట్టి, ఆ పని పూర్తయ్యే విధానాన్ని గమనించండి మీకు తెలుస్తుంది. నిరాశ నిస్పృహలకు లోనయిన చాలా సందర్భాల్లో దేవుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఒకటీ రెండు కాదు... ఎన్నో సంఘటనలు. ఎప్పుడైతే దేవుడ్ని ప్రార్థించడం జరిగిందో అప్పుడు అవి సమకూరిన సందర్భాలున్నాయి. ఇటీవలే మా కుటుంబంలో ఒక సంఘటనే తీసుకుందాం. మా చిన్నబ్బాయి ఒక దశలో విదేశీ ఉద్యోగాలకు వెళ్లడానికి సన్నద్ధమయ్యాడు. ఈ దేశంలో, ఈ సంస్కృతిలో వాడుండాలని దైవాన్ని మేం కోరుకున్నాం. ఐఏఎస్‌గా ఎంపిక కావడం దైవబలం అని నమ్ముతాను. అలాగే డెస్టినీని కూడా నమ్ముతాను. నా కెరియర్‌లోనే రావు అనుకున్నవి వచ్చాయి. వస్తాయి అనుకున్నవి రాలేదు. ఒక ప్రణాళిక అన్నది భగవంతుడి వద్ద సిద్ధంగా ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతుంది.
దేవుడి దగ్గర మన ప్రణాళిక ముందే ఉంటే ఈ దీక్ష ఎందుకు?
రంజాన్ పవిత్రమాసం. చాలా అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాం. ఆ తప్పులను సవరించుకోవడానికి ఒక సమయం కావాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే ఉపవాసం ద్వారా ఆ అవకాశం లభిస్తుంది. రెండవది ఆకలి అనేది తెలిసి వస్తుంది. దీనివల్ల బీదల పాట్లు అర్థమవుతాయి. వారికి చేతనైన సాయం చేయాలనే ఆలోచన కలుగుతుంది. మూడవది.. వీలైనంత వరకు తప్పుడు పనులు చేయకూడదు అని నియమం పెట్టుకుంటాం. ఇస్లాంలో ఈ నెలలోనే ఇవి చేయాలనేది అభిమతం కాదు. ఈ నిష్ట ఎప్పుడూ ఉండాలి. కాకపోతే నెలరోజులు ఎలా నిష్టగా గడుపుతారో మిగతా అంతా అలాగే జీవించడానికి అవకాశం ఉంటుంది.
నేను పోలీస్‌గా ఉన్నప్పుడు.. ఏడాదికి ఒకసారి 15 రోజులు మొబిలైజేషన్ పీరియడ్ ఉండేది. దీంట్లో యోగా, స్పోర్ట్స్, పరేడ్‌లో సెల్యూట్, షూటింగ్... ఇవన్నీ ఉండేవి. దీంట్లో విధి నిర్వహణలో జరిగే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఈ మొబిలైజేషన్ ఎలాంటిదో సంవత్సరాంతంలో చేసే తప్పులు సరిదిద్దుకోవడం ఈ మాసం ఇచ్చే ఒక అవకాశం. ఈ మాసంలో ఒక్కసారైనా పూర్తిగా ఖురాన్ పఠించాలి. రోజూ 1/3 ఖురాన్ తప్పక పఠించాలి. అర్థం చేసుకోవాలి. ఇందులో మన ప్రవర్తన ఎలా ఉండాలో రాసి ఉంటుంది. ఈ టైమ్‌లో అర్థం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.
ఈ మాసంలోనే బీదలకు సాయం చేయమనడంలోని ఉద్దేశ్యం..?
రంజాన్ చివరలో ‘ఈదుల్ ఫితర్’ ఉంటుంది. ఈదుల్ ఫిత్ర్ అంటే బీదల హక్కును కాపాడటం. జకాత్ అంటే దానం. జకాత్ ఏ నెలలోనైనా ఇవ్వచ్చు. కానీ ఈ నెలలోనే ఇవ్వాలనే నియమం తప్పనిసరి. లేకపోతే దానం చేయాలనే ధ్యాస తర్వాత తర్వాత ఉండకపోవచ్చు. పాపాలలో అధికమైన పాపం నిరుపేదల హక్కులు హరించడం. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించడానికి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారో.. ఇది కూడా అలాగే! సంపాదనలో 2.5 శాతం కచ్చితంగా దానం ఇవ్వాలి. మొదట కష్టంలో ఉన్న బంధువులకు, తర్వాత ఇరుగు పొరుగుకి, తర్వాత మిగతా సమాజంలో ఉన్నవారికి. ఇక్కడ మతం, కులం అడ్డురాదు. ఎవరికైనా ఇవ్వచ్చు. రంజాన్‌లో ఏవైనా వండుకుంటే చుట్టుపక్కల వారికీ ఆ ఆహారం ఇవ్వాలనేది నియమం. ఇది సమాజంలో ఉన్న వారికి హక్కుగా వర్తిస్తుంది. ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ నియమం పాటిస్తే సమాజంలో పేదరికం చాలావరకు తగ్గిపోతుంది. ఏ మతమైనా అదే చెబుతుంది.
పేదలకు మీరిచ్చే వాటా?
ఈ మాసంలో నేను, మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. అందరం ఎవరికి ఎంత ఆదాయమో చూసుకొని జకాత్ ఇవ్వాల్సింది ఇంత.. అని లెక్క వేస్తాం. మొత్తం 10–15 లక్షలదాకా అవుతుంది. ఇదంతా మా అమ్మగారికి ఇస్తాం. ఆమె మా బంధువుల పరిస్థితి తెలుసుకుని, అవసరం ఉన్నవారికి ఆ డబ్బును పంపిస్తుంది. ఇది మా అన్ని కుటుంబాలలో తరతరాలుగా వస్తోంది. నాకు తెలిసి ఇలా జకాత్ ఇచ్చేవి వేల కుటుంబాలున్నాయి. జకాత్ తీసుకునేవాడు తిరిగి జకాత్ ఇచ్చే స్థాయికి ఎదగాలి. అప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుంది.
వేలాది కుటుంబాలు పేదలకు ఇలా సాయం చేస్తుంటే సమాజంలో ఇంకా పేదరికం కనిపిస్తూనే ఉంది..!
అంటే, ఆదుకోవాల్సిన వారు అంత ఎక్కువగా ఉన్నారని అర్థం. ప్రభుత్వాలు ఆ పనులను చక్కగా నిర్వర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల ద్వారా ఆ పనులకు పూనుకుంటున్నాం. సింహభాగం వ్యాపారం, విద్యకు కేటాయిస్తున్నాం. లక్షల మంది పిల్లలకు విద్య, చిరువ్యాపారులకు, స్వయంకృషితో ఎదగాలనే అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తున్నాం. ఈ పండగకు ఎంత బీదవారైనా వారు, వారి పిల్లలు కొత్త బట్టలు వేసుకోవాలనేది ఒక ఆచారం. ఎన్ని పాట్లు పడైనా పిల్లలకు కొత్తబట్టలు కొంటారు. కె.సి.ఆర్ గారు ఉద్యమం జరిగే రోజుల నాటి ఒక సంఘటన చెబుతుంటారు. అది రంజాన్ మాసం. వరంగల్‌లో చాలామంది మహిళలు బుర్ఖా ధరించి ఒకచోట నిలబడి ఉండటం చూశారు.
ఎందుకని అడిగితే–‘పిల్లలకు కొత్త బట్టలు కొనడానికి రక్తం అమ్ముకుంటున్నామ’ని చెప్పారట. ఇది కళ్లనీళ్లు వచ్చే సంఘటన. రెండేళ్లుగా 200 ప్లేస్‌లలో ప్రభుత్వం తరపున 2 లక్షల కుటుంబాలకు (భార్యాభర్త, ఒక అమ్మాయికి) భోజనం, కొత్తబట్టలు ఇస్తున్నారు. ఈ సంవత్సరం దీనిని రెట్టింపు చేస్తున్నారు. అలాగే, ఈసారి నాంపల్లిలో అనీస్ ఘుర్బా ఆశ్రమ పిల్లలకు బట్టలు, భోజనం పెట్టించిన తర్వాతే ఇఫ్తార్ విందు. ఆ పిల్లలనీ విఐపిల దగ్గర కూర్చోబెడతాం. ఈ ఏడాది జరుగుతున్న మరో గొప్ప విషయం ఆ ఆశ్రమం వెనుక ఎకరం స్థలంలో ఆధునిక వసతులతో 600 మంది పిల్లలకు సరిపడా (ఎక్కువ మంది అమ్మాయిలు) రక్షణ కల్పించే దిశగా ప్లాన్లు చేస్తున్నాం.
ఇస్లామ్‌లో దైవం స్త్రీకి ప్రత్యేకమైన నిబంధనలు ఏమైనా పెట్టిందా?
ఇస్లాంలో అమ్మాయికి, అబ్బాయికి చదువు విషయంలో ఎక్కడా తేడా లేదు. ముందు ‘చదువు’ అన్నది దైవం చెప్పిన మాట. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకోమని చెబుతుంది. జ్ఞాన సముపార్జనలో చైనాకు కూడా వెళ్లమని చెప్పింది. ఆ దేశంలో ఏ ముస్లింలు ఉన్నారని. అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు ఎవరైతే ఓడిపోతారో బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టాలంటే రెండు కండిషన్స్ ఉండేవి. ఒకటి యుద్ధ పరిహారమైనా చెల్లించాలి. రెండవది అతనికి వచ్చిన విద్య అయినా ఇంకొకరికి నేర్పాలి. సైనికుడు విద్యాధికుడైతే అతని విద్యను బట్టి రిలీజ్ చేసేవారు. మహమ్మద్ ప్రవక్తతోనూ మహిళలు చాలా చర్చలు జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు మార్పు అనేది సమాజంలోనూ వస్తోంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అనుకుంటున్నారు. దీనికి కావల్సిన సపోర్ట్ ఇవ్వడమే దైవత్వం.
విధి నిర్వహణలో రాజకీయ నాయకుల వద్ద తలవంచాల్సిన పరిస్థితి వస్తే... ఇస్లామ్‌లో దైవానికి మాత్రమే తల వంచాలనే నియమం ఉంది కదా!
రాజకీయ నాయకులు ఎప్పుడూ కోరుకునేది వ్యవస్థను సక్రమంగా నడపండి అనేదే! ఇస్లాంలో సాష్టాంగ ప్రణామం నమాజ్‌లో వస్తుంది. దేవుడికే తప్ప ఎవరికీ లేదు. తల్లిదండ్రులలో కూడా తల్లికే ఆ ప్రాధాన్యత ఉంది. ఈ విషయంలో మహమ్మద్ ప్రవక్త మూడు మాటలు చెప్పాడు. ఆ మూడు మాటలు కూడా తల్లి గురించే!
తల్లి, తండ్రి, దైవాన్ని రక్షకులుగా భావిస్తాం. సమాజం పోలీసును రక్షకుడిగా భావిస్తుంది. దైవత్వానికీ, రక్షణ స్థానంలో ఉన్న యూనిఫామ్‌కి సంబంధం ఎలాంటిది?
అన్నింటిలో పోలీస్ ఉద్యోగాన్ని మించిన ఉద్యోగం లేదు. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం అనేది కేవలం పోలీసు ఉద్యోగంలో ఉంది. రక్షణ కల్పించే అవకాశం పోలీసుశాఖలో పనిచేసే వ్యక్తికే ఉంటుంది. కాకపోతే చక్కటి విలువలున్న వ్యక్తి ఈ శాఖలోకి రావాలి. విలువల్లేని వ్యక్తి వస్తే ఇక్కడ కలిగేటంత హాని మరెక్కడా కలగదు. బాధించడం, అవమానించడం, ప్రాణాలు తీయడం.. ఈ ఫీల్డ్‌లోనే జరుగుతాయి. పోలిస్ అంటే దైవ స్వరూపమే!
మీకు దక్కాల్సినవి దక్కనప్పుడు దేవుడి మీద మీకు కలిగిన భావం?
నాకు పెద్ద పెద్ద జిల్లాలో మంచి పోస్టింగ్‌లు వచ్చాయి. కొన్ని నా హక్కు అనుకున్నప్పుడు రాలేదు. అప్పుడు నాకు రావాల్సింది రాలేదు అని బాధపడటంలో అర్థంలేదు. ఎందుకంటే, నాతో పాటు సమర్థత ఉన్నవారికి వాళ్లకు రాకుండా నాకు ఆ పదవులు వచ్చినప్పుడు ‘నన్నే ఎందుకు తీసుకుంటున్నారు?’ అని నేనడగలేదు కదా! 30 ఏళ్ల సర్వీసులో కొన్ని అర్హమైన పోస్టింగ్‌లు రానప్పుడు బాధపడ్డాను. కాకపోతే దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. రిటైర్మెంట్ తర్వాత నాకు బాధ్యతాయుతమైన పదవి వచ్చింది. కొన్నిసార్లు తాత్కాలికంగా బాధపడిన సందర్భాలున్నాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతుంటాయి. నేను క్రికెట్ ఆడుతుంటాను. ఒకసారి అనుకోకుండా ఈజీ బాల్ వస్తుంది. ఒకసారి డిఫికల్టీ బాల్ వస్తుంది. ఒకసారి బోల్డ్ అవుతాం. దీన్నే స్థితప్రతిజ్ఞత అంటారు. దేనికి పొంగిపోనివాడు, దేనికీ కుంగిపోనివాడు.. అనేది భగవద్గీతలోనూ ఉంటుంది.
అయితే, కష్టం అనుకున్న సమయంలో దేవుణ్ణి ప్రార్థించిన సందర్భాలు లేవా?
ఎందుకు లేవు. చాలా ఉన్నాయి. ఆ సమయంలో ఇంకా ఎక్కువ ప్రార్థిస్తాను. ఇప్పుడు కూడా ప్రతి రోజూ ప్రార్థన చేస్తాను. కష్టం గట్టెక్కిన తర్వాత ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఒకసారి ఓల్డ్‌సిటీలో కమ్యూనల్ సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో నేను దేవుణ్ణి పదే పదే ప్రార్థించాను. ‘నేను నా ప్రయత్నం చేస్తున్నాను. నీ సహకారం కావాలి’ అని వేడుకున్నాను. గీతలో కూడా ఒక అంశం ఉంది.. కృష్ణుడు అర్జునుడితో– ‘నీ విధిని నువ్వు నిర్వర్తించు. ఫలితం దైవానికి వదులు..’ అని చెబుతాడు. ‘నీవు ఆ విధిని కూడా చేయలేకపోతే ఆ పనిని దేవునికి అప్పగించు’ అని కూడా దైవం చెప్పిన విషయమే. పాహిమామ్ అంటే అదే కదా! సరెండర్ అయిపోవడం. ఇస్లామ్‌లో కూడా అంతే! చేయాల్సింది అంతా చేయ్, చేయలేని సమయంలో దైవానికి అప్పగించు. మానవప్రయత్నం చేయడం ఒక్కటే మన చేతుల్లో ఉంది. డీప్లీ ఇస్లాంలో 10 సంవత్సరాల కేసులు స్టడీ చేసి చూశాను ఒక్కటి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన లేదు. భగవంతుడు ఉన్నాడు. ఈ కష్టాలు ఇస్తున్నది అతనే, దానిని దాటించే శక్తిని ఇచ్చేది అతనిదే! ఇలా అనుకున్నడప్పుడు మనకు సహనం అలవడుతుంది. ఆ కష్టం కూడా సులువుగా దాటేస్తాం.
ఇస్లామ్‌లో విగ్రహారాధన ఉండదు కదా! ప్రార్థనలో ఏకాగ్రత ఎలా కలుగుతుంది?
ఇస్లామ్‌లో దైవం నిర్గుణాకారం. నమాజ్‌లో ఉన్నప్పుడు మనస్సు నిశ్చలంగా పెట్టుకొని ‘భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు’ అనే నమ్మకంతో చేస్తాను. ఈద్గాలో నమాజ్ చేసేటప్పుడు 2 –3 లక్షల మంది ఉంటారు. ఆ సమయంలో గమనించండి. చిన్న శబ్దం కూడా కాదు. కేవలం ఇమామ్ చదివే విషయాల మీదే ఫోకస్ ఉండాలి. రెప్ప పాటు కాలంలో కూడా నమాజ్ పక్కకు వెళ్లిందంటే అది ప్రార్థన కాదు.
దైవత్వానికి ఆహారానికి ఉన్న సంబంధం ఏంటి?
ఆహారం అన్నది బతికుండటం కోసం, సరైన పోషణ కోసం ఆరోగ్యంగా ఉంటే దైనందిన జీవితం, విధి నిర్వహణ సరిగ్గా ఉంటుంది. ఏ మతంలోనైనా సరే సరైన పోషణ, సరైన ఆహారపు అలవాట్లు తప్పనిసరి. ఆ ప్రాంతాన్ని బట్టి, సంస్కృతిని బట్టి వారికా ఆహారపు అలవాట్లు వస్తాయి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని జడ్జ్ చేయకూడదు.
మిమ్మల్ని ప్రజలుదేవుడిగా భావించిన ఘటనలు ఉన్నాయి కదా!
అలా అని కాదుగానీ... ఒకరోజు అర్ధరాత్రి ఒక వృద్ధురాలు వచ్చింది. కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఆరోగ్యం సరిగా లేదు. కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇల్లెవరిద’ని అడిగాను. ‘మా ఆయనది, ఆయన చనిపోయాడు’ అని చెప్పింది. ఎస్సైని పిలిచి‘కొడుకు, కోడల్ని బయటకు పంపించి, ఈమెను ఆ ఇంట్లో ఉంచండ’ని చెప్పాను. అలాగే జరిగింది. తెల్లవారుజామున ఆమె కోడల్ని, పిల్లల్ని తీసుకొచ్చింది. ‘అయ్యా! చిన్న పిల్లలు. వీళ్ల ముఖాలైనా చూసి ఇంట్లో ఉండనివ్వండి’ అని. అప్పుడు వాళ్లకి చెప్పాను ‘ఆమెను మంచిగా చూసుకోండి. ఈ పిల్లల మొహం చూసి మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండనిస్తాను’ అని. ఇది జరిగి ఎనిమిదేళ్లు జరిగింది. వాళ్లంతా కలిసి మెలిసి ఉన్నారు. చాలా ఆనందం వేసింది. లాలాపేట ఏరియాలో ఒక మహిళ... రైల్వే ఉద్యోగి అయిన ఆమె భర్త చనిపోయాడు.
రావాల్సిన డబ్బులు ఈమెకు అందలేదు. ఈమెకు ఒక బిడ్డ. సపోర్ట్ కోసం ఒక వ్యక్తితో ఉంది. కొన్నాళ్లకు ఈమెకు ఉద్యోగం, ఆ ఎక్స్‌గ్రేషియా కూడా వచ్చింది. ఆమె విడిగా ఉండే ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. పైగా ఈమె డబ్బంతా అతనే తీసుకునేవాడు. బాధించేవాడు. ముందు ఎస్సై దగ్గరకు వెళ్తే అతను ‘నీ ఖర్మ. అనుభవించు’ అన్నాడట. నా దగ్గరకు వచ్చింది. ‘గతం గతః. ఆమె ఇప్పుడు తనుగా బతకాలనుకుంటోంది. అతని నుంచి ఆ డబ్బులు ఇప్పించి కూతురి పేరున ఫిక్స్‌డ్ చేయండి. ఆమెను అతను వేధించకుండా వార్నింగ్ ఇవ్వండి’ అని చెప్పాను. అలాగే జరిగింది. రిటైర్ అయ్యాక కూడా ఇలాంటివే జ్ఞాపకం ఉంటాయి.
మనుషుల్లో మీరు చూసిన దైవత్వం...?
చాలా చోట్ల, చాలా సందర్భాల్లో చూశాను. స్థోమత లేకపోయినా వారు చేసే సాయం ఎంత గొప్పదో ఓల్డ్ సిటీలో ఫైరింగ్ జరిగినప్పుడు చూశాను. మరొక సంఘటన .. 2000వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో కమిషనర్‌గా ఉన్నాను. విక్టర్ అనే ఒక అబ్బాయి కలకత్తాలో చదువుకుంటున్నాడు. హాలీడేస్‌లో ఇద్దరు ఫ్రెండ్స్‌తో ఇంటికి వచ్చాడు. టీ తీసుకురావడానికి అతని తల్లి లోపలికి వెళ్లింది. ఈ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటూ.. ఏమైందో ఏమో అందులో ఒకడు స్క్రూæడ్రైవర్‌తో విక్టర్‌ని పొడిచాడు. అది ఛాతీలోకి దూసుకుపోయి ఆ పిల్లవాడు చనిపోయాడు. వాళ్లు భయపడి పారిపోయారు. కేస్ ఫైల్ అయ్యింది. పారిపోయిన వారిని పట్టుకొని జైల్లో పెట్టారు. ఆ తల్లి మా దగ్గరకు వచ్చింది ఆ అబ్బాయిలను కలవాలని.
పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. ‘ఆమె వారితో ఏదో మాట్లాడాలనుకుంటుంది. ఆ ఏర్పాట్లు అక్కడే ఉండి చూడమ’ని చెప్పాను. ఆమె ఆ పిల్లల దగ్గరకు వెళ్లి ‘ఎందుకు చేశారయ్యా ఈ పని..’ అని అడిగింది. వాళ్లూ ఏడవడం మొదలుపెట్టారు ‘ఇలా జరుగుతుందని ఊహించలేద’ని. ఆ అబ్బాయిలను క్షమించి వదిలేయమని ఈమె వేడుకుంది. పైగా ‘వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడుంటారు?’ అని అడిగింది. ‘ఎందుకు?’ అని అడిగితే.. ‘నేను నా కొడుకును పోగొట్టుకొని బాధపడుతున్నాను. వీళ్లు చేసిన పిచ్చి పని వల్ల జైల్లో ఉన్నారు. దీనికి వాళ్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో.. వాళ్లను ఓదార్చాలి’ అంది. ఎంత గొప్పతనం. ఎంతటి దైవత్వం. సమాజంలో కలిసి పనిచేస్తేనే ఇలాంటి అనుభవాలు కలుగుతాయి.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి