
కత్తిలాంటి మగాడు!
మా ఊళ్లో రవి అనే అబ్బాయి ఉండేవాడు. చాలా సున్నిత మనస్కుడు. దాంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అతన్ని సూటిపోటి మాటలు అనేవారు అందరూ.
పాఠకుల మాట
మా ఊళ్లో రవి అనే అబ్బాయి ఉండేవాడు. చాలా సున్నిత మనస్కుడు. దాంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అతన్ని సూటిపోటి మాటలు అనేవారు అందరూ. ఎవరే మన్నా... చిరునవ్వు నవ్వేవాడు రవి. ‘‘రవి అబ్బాయి కాదు... అమ్మాయి. మగాడు మగాడిలా ఉండాలి తప్ప రవిలా కాదు’’ అనేవాళ్లు అతని ఫ్రెండ్స్. మగతనం అంటే దురుసుగా ఉండడం, మీసం మెలేయడం మాత్రమేనా? కానే... కాదని నిరూపించాడు రవి.
రెండేళ్లక్రితం జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ దీని గురించి ఊళ్లో చెప్పుకుంటారు. ఎలా వచ్చాడో ఎప్పుడు వచ్చాడో తెలియదు. ఒక పిచ్చోడు చేతిలో కత్తితో వీరవిహారం చేస్తున్నాడు. కనబడ్డవారిపై కత్తితో దాడి చేస్తున్నాడు.అంతా పారిపోతున్నారు తప్ప... ఎవరూ అతణ్ణి బంధించే ప్రయత్నం చేయడం లేదు.
ఇది తెలియని ఒకామె తన కొడుకును ఎత్తుకొని రోడ్డు మీదికొచ్చింది. ఇంతలో ఆ పిచ్చివాడు ఆమె ముందుకు వచ్చి ‘‘నీ బిడ్డను చంపుతాను’’ అని అరుస్తున్నాడు. ఈలోపే రవి దూసుకువచ్చి ఆ ఉన్మాది తల మీద ఒక్కటిచ్చి, ఒడుపుగా అతని చేతిలో నుంచి కత్తి లాక్కున్నాడు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తున్న వాళ్లు వెంటనే వచ్చి వాణ్ణి బంధించారు.
ఇక అప్పటి నుంచి రవికి కత్తి లాంటి మగాడు అని పేరు వచ్చింది. మగతనం అంటే పదే పదే మీసాలు మెలేయడం కాదు... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనే సత్యాన్ని నిరూపించాడు రవి.
- కె.శ్రీదేవి, చింతపల్లి. అనంతపురం జిల్లా