రియల్ ఇన్వెస్టర్.. శిబులాల్..
భారీగా రాబడులు అందిస్తుందంటూ.. రియల్ ఎస్టేట్‌పై ఎంత గురి ఉన్నా.. ఎంత సంపన్నులైనా ఎన్ని ఇళ్లు.. స్థలాలు కొంటారు? అయిదో.. పదో.. మహా అయితే ఇరవయ్యో కొనొచ్చు.. కానీ ఏకంగా 700 అపార్ట్‌మెంట్లు అదీ.. అమెరికాలో కొని పారేశారు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో శిబులాల్. ఆయన ఇన్వెస్ట్‌మెంట్ తీరు తెన్నుల గురించే ఈ వారం ప్రముఖుల పెట్టుబడుల కథనం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాల కాలంలో అత్యంత చిన్న స్థాయి నుంచి వేల కోట్ల రూపాయల దిగ్గజంగా ఎదిగిందీ కంపెనీ. సంస్థ సుదీర్ఘ ప్రస్థానానికి పునాది వేసిన వ్యవస్థాపకుల్లో శిబులాల్ కూడా ఒకరు. మిగతా ఫౌండర్లంతా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడమో లేదా ఇతరత్రా పెట్టుబడులకో పరిమితం కాగా.. శిబులాల్ మాత్రం కోట్ల రూపాయల సంపదను జాగర్త చేసుకునేందుకు.. మరింతగా పెంచుకునేందుకు.. రియల్టీని విశ్వసించినట్లున్నారు.
అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎడాపెడా రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనేస్తున్నారు. అమెరికాలో 700 పైగా అపార్ట్‌మెంట్లను కొనేశారు. సియాటిల్, బెల్‌వ్యూ ప్రాంతంలో ఇవి ఉన్నాయి. వీటి విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్టార్‌బక్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థల సీనియర్ ఉద్యోగులు వీటిలో అద్దెకి ఉంటున్నారు.
ఫ్యామిలీ ఆఫీసు..
అమెరికా మాత్రమే కాకుండా.. యూరప్‌లో కూడా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు శిబులాల్. జర్మనీలోని బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్ నగరాల్లో కూడా రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు కొన్నారు. దాదాపు రూ. 6,500 కోట్ల మేర ఉన్న ఆస్తులను మేనేజ్ చేసేందుకు శిబులాల్ ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆఫీస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీని పేరు ఇన్నోవేషన్స్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇండియా.
ఇవే కాకుండా.. భారత్‌లో పలు రిసార్టులు, ప్రాజెక్టుల్లో కూడా శిబులాల్ ఇన్వెస్ట్ చేశారు. కర్ణాటకలోని కూర్గ్‌లో 56 గదుల లగ్జరీ రిసార్టు, తిరువనంతపురం, కొడెకైనాల్ తదితర ప్రాంతాల్లో హోటళ్లు, సుమారు 900 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ, యాలకుల తోటలు.. ఇవన్నీ శిబులాల్ పెట్టుబడుల్లో మచ్చుకు కొన్ని మాత్రమే.