నాకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. మూడేళ్ల బాబు ఉన్నాడు. వాడు పుట్టిన సంవత్సరానికి మావారికి అంతకుముందే పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. మోసగించారని బాధ కలిగినా, నన్ను కావాలనుకోవడానికి ఆయన చెప్పిన కొన్ని కారణాలు విన్నాక శాంతించాను. పైగా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నాకు, బాబుకి ఏ లోటూ రానివ్వకపోవడంతో ఆయనకు దూరం కాలేకపోయాను. దురదృష్టంకొద్దీ, ఇటీవలే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు నేను, నా బిడ్డ ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు. మేం ఉంటున్న ఇల్లు మావారి పేరు మీదే ఉంది. అది నా బిడ్డకిగానీ, నాకు గానీ వస్తుందా? అసలు ఆయన ఆస్తిలో మాకు హక్కు ఉంటుందా?
- స్రవంతి (పేరు మార్చాం), పార్వతీపురం
మీరు తెలిసి చేసుకున్నా, తెలియకుండా చేసుకున్నా రెండో పెళ్లి చేసేసుకున్నారు. మీకు బాధ అనిపించినా... మీ పెళ్లి చెల్లదని చెప్పక తప్పదు. ఒక వ్యక్తి తన మొదటిభార్య చనిపోతేనో, విడాకులు తీసుకుంటేనో తప్ప పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే, ఆ వచ్చే భార్యకు ఎటువంటి చట్టపరమైన హక్కులూ ఉండవు. అంటే... మీకు మీవారి ఆస్తుల మీద ఎలాంటి హక్కూ ఉండదు. నిజానికి ఇలాంటి కేసులు, సహజీవనం వంటి కేసులకు సంబంధించి ఆస్తి హక్కు కల్పిస్తూ కొన్ని చ ట్టాలైతే రూపొందాయిగానీ, ఇంకా అమలైతే కావడం లేదు. కాకపోతే మీ బిడ్డకి తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. మీరు తప్పక ప్రయత్నించవచ్చు.
అయితే మీకో చిన్న సలహా. ముందే కోర్టుకు వెళ్లే బదులు, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. మీవారి మొదటి భార్య, పిల్లలను కలిసి మీ పెళ్లి విషయం చెప్పండి. సాధారణంగా నమ్మరు కాబట్టి, మీ పెళ్లికి సాక్ష్యాలేమైనా ఉంటే చూపించండి. మీ బిడ్డకు అన్యాయం జరక్కుండా చూడమని రిక్వెస్ట్ చేయండి. వారు మంచి మనసులో అర్థం చేసుకుంటే సమస్యే ఉండదు. అలా జరగకపోతే అప్పుడు చట్టాన్ని ఆశ్రయించండి. బిడ్డకు తండ్రిగా మీవారి పేరు ఎక్కడ నమోదై ఉన్నా (బర్త్ సర్టిఫికెట్, ఇతరత్రా రిజిస్టర్స్ వంటివి) ఆ డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేయండి. కాస్త ఆలస్యమైనా మీ బిడ్డకు తప్పక న్యాయం జరుగుతుంది. తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది.
- నిశ్చల సిద్ధారెడ్డి, న్యాయవాది
మావారి ఆస్తిలో మాకు హక్కు ఉంటుందా?
Published Tue, Dec 17 2013 12:16 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement