
ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూల కారణం విద్య ఒక్కటే. చక్కటి విద్య కారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్ఫూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.సకల విద్యాస్వరూపిణి, సకల వాజ్ఞయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తక ధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు కూడా వేదవేదాంగవేత్త అవుతాడు. మూర్ఖుడు సైతం మహావిద్వాంసుడుగా మారిపోతాడు. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుంటాడు. అందుకే ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా సరస్వతీ దేవిని ఆరాధించవలసిందే.
వసంత పంచమి ఉదయం పూట స్నానాదికాలు ముగించుకుని శుచి అయి, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచిగంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి, పాయసం నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా భుజించి, అందరికీ పంచిపెట్టాలి. ఐదుగురు బాలలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారి చదువుకు అయ్యే ఖర్చును భరించాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్లు, చెరుకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి.
– డి.శ్రీలేఖ
Comments
Please login to add a commentAdd a comment