విజయపథంలో మానసిక ‘చేతన’ | RR mental 'conscious' | Sakshi
Sakshi News home page

విజయపథంలో మానసిక ‘చేతన’

Published Wed, Apr 2 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

విజయపథంలో మానసిక ‘చేతన’

విజయపథంలో మానసిక ‘చేతన’

పాతికేళ్ల కిరణ్ న్యూస్‌పేపర్‌పై జిగురు రాసి జాగ్రత్తగా అంటిస్తున్నాడు. స్వాతి వాటిని గాలికి ఆరబెడుతోంది. ఇంకో అబ్బాయి వాటిని వరసగా సర్దుతున్నాడు. అలా తయారుచేసిన పేపర్ బ్యాగులు ‘చేతన’ పేరుతో దగ్గరలోని ఆసుపత్రులకు పంపుతారు. అక్కడ రకరకాల చేతివృత్తుల పేర్లతో తయారయ్యే వస్తువులకు బోలెడు గిరాకీ. ఎందుకంటే వాటిని తయారుచేసేది మానసిక వికలాంగులు. ఆ సంస్థని నడిపేది ఓ ఇద్దరు వైద్యులు. ‘శరీరానికైతే వైద్యం చేయగలం. కానీ, మా కంటబడ్డ మానసిక వికలాంగులకు మేం ఏం చేయగలమని మమ్మల్ని మేం పదే పదే ప్రశ్నించుకున్న తర్వాత పుట్టిందే చేతన’ అని చెప్పే మాలా గిరిధర్ మాటల్లో సేవొక్కటే కాదు చక్కని వ్యాపార సూత్రం కూడా ఉంది. అదెలాగంటారా...
 
అప్పటివరకూ ఇంట్లోవారికి భారంగా ఉన్న కిరణ్ ఇప్పుడు ప్రతి నెలా రెండు నుంచి మూడువేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు. స్వాతి విషయానికొస్తే తండ్రి లేడు. తల్లి కష్టం పైనే ఆధారపడ్డ ఇంటికి ఇప్పుడు స్వాతి కూడా సాయం చేస్తోంది. ‘చేతన’ సంస్థలో కిరణ్, స్వాతిలాంటివారు  ఓ ఇరవైమంది ఉన్నారు. చుట్టుపక్కల బోలెడన్నీ చేతివృత్తుల సంస్థలున్నా ‘చేతన’ తర్వాతే ఏవైనా.  పేపరుబ్యాగులు కావాలనుకున్నవారంతా ‘చేతన’ సంస్థలోకే అడుగుపెడుతున్నారు. ఉత్తర కర్ణాటకలో సిర్సి ప్రాంతంలో ఉన్న ‘చేతన’ సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ మాలా గిరిధర్. ‘‘నేను, నా భర్త గిరిధర్ ఇద్దరం పదేళ్ల ఉంచి వైద్యవృత్తిలో ఉన్నాం. మా కంటపడ్డ మానసిక వికలాంగుల సంక్షేమం కోసం మేం చేయగలిగినంతలో ఆర్థిక సాయం చేసేవాళ్లం.

అలాంటివారికి వేళకింత భోజనం పెట్టి పక్కన కూర్చోబెట్టడం సేవ కాదేమోననిపించింది. ఇంకేం చేస్తే వారికి పూర్థిస్థాయిలో న్యాయం చేసినవాళ్లమవుతామంటూ ఆలోచించాం. వారికి చేతినిండా ఏదో ఒకటి పని ఉంటే అంతకన్నా పెద్ద సేవ మరొకటి ఉండదనుకున్నాం. అనుకున్నదే తడవుగా ‘చేతన’ సంస్థను నెలకొల్పాం’’ అంటూ తమ ఆలోచన వెనకనున్న కారణం చెప్పారు మాల.

 200 గంటల శిక్షణ: మామూలువారితోనే ఏదైనా కొత్త పని చేయించాలంటే ముందుగా శిక్షణ అవసరం. అలాంటిది మతిస్థిమితం లేనివారితో పని చేయించడం అంటే మాటలు కాదు. కొన్ని గంటల పాటు, రోజుల పాటు, నెలల పాటు పట్టుదలతో వారికి పని నేర్పించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు డాక్టర్ మాల వారితో ఏకంగా వ్యాపారమే చేయించారు. ‘‘అనుకోవడం వరకూ బాగానే ఉంది కాని మొదలుపెట్టాక అసలు కష్టం తెలిసింది. అప్పటికే దేశంలో పలుచోట్ల మానసిక వికలాంగుల కోసం పనిచేస్తున్న ఓ 20మంది స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల దగ్గర 200 గంటలపాటు శిక్షణ తరగతులకు హాజరయ్యాను. రెండున్నర లక్షల రూపాయలతో ‘చేతన’ వర్క్‌షాపు మొదలుపెట్టాను. వీరితో పాటు మరో 40మంది మానసిక వికలాంగులు ఇళ్ల దగ్గర నుండే పనిచేస్తున్నారు’’ అని వివరించారు మాల.
 
పేపర్ బ్యాగులే కాకుండా, పెన్నుల తయారీ, అరటినార ప్యాకింగ్ కూడా ‘చేతన’లో  చేస్తున్నారు. ‘‘పేపర్ బ్యాగుల తయారీ చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. అందుకే మానసిక వికలాంగులకు ముందుగా అరటినార పని చెబుతాం. ఆ తర్వాత పెన్నులు, పేపర్ బ్యాగుల తయారీ. వీళ్లకి శిక్షణ ఇవ్వడం కోసం ఓ నలుగురు ప్రత్యేక శిక్షకులున్నారు. ఇద్దరు అకౌంటెంట్లు ఉన్నారు. ఆనందానికీ, దుఃఖానికీ తేడా తెలియని మానసిక వికలాంగుల కంట్లో తెలియని సంతోషాన్ని మాత్రం చూస్తున్నాను. ఇక వారి ఇంట్లో వాళ్ల ఆనందానికీ, ఆశ్చర్యానికీ కొదవలేదు’’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు మాల.

 విజయం వారి చిరునామా: సేవకు తృప్తి ఉండాలి. వ్యాపారానికి విజయం కావాలి. ఈ రెండింటీని సాధించిన డాక్టర్ మాల తన కల నెరవేరడం వెనక పట్టుదల మాత్రమే ఉందంటున్నారు. ప్రస్తుతం ‘చేతన’కు పేపర్ బ్యాగులకు సంబంధించి చాలా పెద్ద ఆర్డరు వచ్చింది. ఓ ఏడాదిపాటు  చేతన సిబ్బందికి చేతి నిండా పని ఉంది. అంతకు మించి మాల సాధించాల్సిన విజయం ఏముంటుంది చెప్పండి.
 ‘ఓ డాక్టరుగా ఎంతమంది శరీరాల్ని బాగుచేశానో గుర్తులేదు కాని ఓ ఇరవైమంది మానసిక వికలాంగులను చక్కని పనిమంతుల్ని చేయగలిగానన్న తృప్తి నన్ను అనుక్షణం ఆకాశానికి ఎత్తుతోంది’ అని అంటారు మాల. నిజమే... అందరూ చేయగలిగే పని చేసి చప్పట్లు కొట్టించుకోడానికీ, ‘చేతన’ విజయానికీ చాలా తేడా ఉంది. బోలెడు ఆదర్శం కూడా ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement