ఫిక్స్ చేశారంటే... వడ్డించిన విస్తరే!
ఉమన్ ఫైనాన్స్
చాలామంది పెట్టుబడి మార్గాలు ఎన్ని అందుబాటులో ఉన్నా కానీ... సంప్రదాయక పెట్టుబడి మార్గమైన, తక్కువ రిస్క్‌తో కూడిన సురక్షితమైన బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వైపే మొగ్గు చూపుతారు. ఇలాంటి వారికి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ వడ్డీని అందజేసే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఒక మంచి అవకాశం. కానీ వీటిలో డిపాజిట్ చేసే సమయంలో క్షుణ్ణంగా అన్ని వివరాలూ తెలుసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది.
కొన్ని కంపెనీలు తమ కంపెనీ పెట్టుబడికి అవసరమైన నిధులను ప్రజల నుండి ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపేణా సమీకరిస్తాయి. ఇవి సాధారణ బ్యాంకు డిపాజిట్‌ల కంటే ఎక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. కాల పరిమితిని కూడా పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం వివిధ వ్యవధులలో అందజేస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
మొదట గమనించవలసిన విషయం ఏమిటంటే.. ఈ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ అనేవి సెక్యూరిటీ లేనివి. అంటే కంపెనీ కనుక దివాళా తీస్తే పెట్టిన పెట్టుబడిని కూడా నష్టపోవలసి ఉంటుంది. కనుక ఏ కంపెనీలోనైతే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయదలచుకున్నారో తప్పనిసరిగాఆ కంపెనీ రేటింగ్ చూసుకోవాలి. ఇఖఐఐఔ, ఐఇఖఅ మొదలైన ఫైనాన్షియల్ సంస్థలు వివిధ కంపెనీలకు, ఆ కంపెనీలు జారీ చేసే వివిధ ర కాల పెట్టుబడి మార్గాలకు రేటింగులను అందచేస్తుంటాయి. వాటిని ఫాలో అవొచ్చు.
కంపెనీ గురించి, గడిచిన సంవత్సరాలలో కంపెనీ స్థితిగతుల గురించి, మేనేజ్‌మెంట్ గురించి క్షుణ్ణంగా పరిశీలించాలి. కంపెనీ డిపాజిట్స్‌పై అందే వడ్డీ రు.5,000 దాటితే టి.డి.ఎస్. (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అదే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ మీద వచ్చే వడ్డీకైతే రు.10,000 దాటితేనే టి.డి.ఎస్. వర్తిస్తుంది. కనుక కంపెనీ డిపాజిట్‌లలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. కంపెనీ రేటింగ్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ కాల వ్యవధిలో డిపాజిట్ చేయడం ఉత్తమం. ఒకవేళ ఎక్కువ కాల వ్యవధితో డిపాజిట్ చేసినట్లయితే కంపెనీ స్థితిగతులు సరిగా లేనట్లయితే సొమ్మును నష్టపోవలసి వస్తుంది. కనుక బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ వడ్డీ రావాలని కోరుకునేవారు, మంచి కంపెనీలు అందజేసే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ గురించి పూర్తిగా చదువుకుని, అర్థం చేసుకుని పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’