విహంగ విహారి | Sakshi Special Interview With Rajini Lakka | Sakshi
Sakshi News home page

విహంగ విహారి

Published Mon, Sep 23 2019 2:39 AM | Last Updated on Mon, Sep 23 2019 5:28 AM

Sakshi Special Interview With Rajini Lakka

త్రి సముద్ర తోయ పీత వాహన... ఇది గౌతమీ పుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదు. దీనర్థం మూడు సముద్రాల నీటిని తాగిన గుర్రాన్ని వాహనంగా కలిగిన వాడు అని. ఇక్కడ కవి భావం గుర్రం సముద్రం నీటిని తాగిందని కాదు. ఈ మూడు సముద్రాల మధ్యన ఉన్న ప్రదేశాన్నంతటినీ జయించిన వాడు అని అర్థం. మరి... ఈ మూడు సముద్రాల మధ్యనున్న భూభాగాన్ని ఆద్యంతం పర్యటించిన టూరిస్టును ఏమనాలి? వీటితోపాటు ఖండాలు దాటి విహరించిన విహారిని ఏమనాలి? విశ్వ విహారి అనవచ్చా? ‘‘మరో రెండు ఖండాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ విశేషణానికి అర్హత లభిస్తుంది. మరో మూడు– నాలుగేళ్లలో అవి కూడా పూర్తి చేస్తాను’’ అంటున్నారు రజని లక్కా. గుంటూరులో పుట్టి, అనంతపూర్‌లో మెట్టి, బళ్లారిలో స్థిరపడిన మన తెలుగింటి మహిళ రజని. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆమె తన పర్యాటక అనుభవాలను సాక్షితో పంచుకున్నారు.

‘‘స్విమ్మింగ్‌ కోచ్‌గా నేను ఏడాదిలో పది నెలలు టైట్‌ షెడ్యూల్స్‌తో పనిచేస్తాను. వెకేషన్‌ నన్ను బూస్టప్‌ చేస్తుంది. అందుకే ఏటా తప్పకుండా నేషనల్‌ లేదా ఇంటర్నేషనల్‌ ఏదో ఒక టూర్‌ చేస్తాను. అన్నవరం నుంచి అమెరికా వరకు, కూర్గ్‌ నుంచి కెనడా వరకు ప్రతి పర్యటన నుంచి దానికదే ప్రత్యేకమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాను. మన దేశంలోని శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు, కోటలు, సరస్సులు, సముద్రాలు, జలపాతాలను చాలా వరకు చూసేశాను. కృష్ణుడు పుట్టిన మధుర, రాజ్యమేలిన బేట్‌ ద్వారక, ప్రాణత్యాగం చేసిన వేరావల్‌ నా పర్యటనలో భాగాలయ్యాయి.

ఉత్తరాన కశ్మీర్‌ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున పూరీ పట్టణం నుంచి పశ్చిమాన సోమనాథ్‌ వరకు... దాదాపుగా ప్రతి వంద కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేశాననే చెప్పాలి. ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పెండింగ్‌ ఉన్నాయి. ఇక ఖండాల విషయానికి వస్తే ఇప్పటి వరకు నా విహారంలో నాలుగు ఖండాలను చూశాను. ఆఫ్రికా పర్యటన ఒకసారి వాయిదా పడింది. మళ్లీ త్వరలోనే ప్లాన్‌ చేసుకుంటాను. ఇక భవిష్యత్తులో సౌత్‌ అమెరికాను చూడాలి.

వ్యవస్థ పనిచేస్తుంది
ఇన్ని దేశాలను చూసిన తర్వాత మనకు వాళ్లకు ఉన్న ప్రధానమైన తేడా సిస్టమ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో కనిపిస్తుంది. న్యూజిలాండ్‌లో మా మనుమరాలి పాస్‌పోర్ట్‌ కోసం వెళ్తే... మనకిచ్చిన స్లాట్‌ టైమ్‌కి వెళ్తే ఒక నిమిషంలో పాపను ఫొటో తీసి ‘ఫినిష్‌డ్‌’ అని పంపించేశారు. పాస్‌పోర్ట్‌ ఇంటికి వచ్చింది. అప్పుడు నాకు మన దగ్గర పాస్‌పోర్ట్‌ కోసం పడాల్సిన ప్రయాస గుర్తుకొచ్చింది. హాస్పిటల్‌లో డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా అంతే. మన టైమ్‌కి మనం వెళ్లేసరికి మనకంటే ముందు ఒకరు, మన పరీక్షలు పూర్తయ్యేటప్పటికి ఒకరో ఇద్దరో వచ్చి ఉంటారు. అపాయింట్‌మెంట్‌ ఇచ్చి కూడా హాస్పిటల్‌లో గంటలకు గంటలు వెయిట్‌ చేయించే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్‌ ఆఫీసుల్లో మన డాక్యుమెంట్‌లు కచ్చితంగా ఉంటే ‘ఎస్‌’ అంటారు, తేడా ఉంటే ‘నో’ అంటారు. అంతే తప్ప లంచంతో పని జరగడం ఉండదు.

దొడ్డ విశ్వాసం
పాశ్చాత్యదేశాల్లో ఓల్డ్‌పీపుల్‌లో ఎంతటి ఆత్మవిశ్వాసం అంటే... వాళ్లు ఒకరి సహాయం కోసం ఎదురు చూడరు. ఎనభై ఏళ్ల మహిళ కూడా తన కారు తనే డ్రైవ్‌ చేసుకుని వెళ్తుంటుంది. కారులో సామాను దించుకోవడానికి కూడా ఎవరి కోసమూ చూడరు. హోటల్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో వాళ్లకు అవసరమైన వస్తువు అందించబోయినా కూడా సహాయం తీసుకోరు. చక్కటి చిరునవ్వుతో స్నేహపూర్వకంగా నవ్వి సున్నితంగా తిరస్కరించి, వాళ్లే చేసుకుంటారు. మన దగ్గర వయసులో ఉన్న వాళ్లు కూడా తమ పనులు తాము చేసుకోకుండా సహాయకుల్ని పెట్టుకోవడాన్ని దర్పంగా భావిస్తారు. అక్కడ పని చేసుకోవడాన్ని గౌరవిస్తారు.

మనం నేర్చుకోవాల్సిన విషయం అది. పాశ్చాత్య సమాజంలో మరొక గొప్ప సంగతి కూడా గమనించాను... అక్కడ ఒక మనిషికి ఆ వ్యక్తి హోదాలను బట్టి గౌరవం ఇవ్వడం అనేది ఉండదు. కంపెనీ సీఈఓ అయినా అటెండర్‌ అయినా, స్వీపర్‌ అయినా ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం సమానంగా ఉంటుంది. అక్కడ హోదా ప్రదర్శన కూడా కనిపించదు. వర్షం పడుతుంటే మన దగ్గర ఎస్సైకి కానిస్టేబుల్‌ గొడుగు పట్టుకోవడాన్ని చూస్తుంటాం. అక్కడ ప్రధానమంత్రి అయినా సరే తన గొడుగు తనే పట్టుకుంటాడు.

విరిగిన కొండ చరియ
ప్రపంచంలో నచ్చిన ప్రదేశాల్లో మొదటిది న్యూజిలాండ్, రెండవది కెనడా, మూడవది స్విట్జర్లాండ్‌. నా పర్యటన ప్లాన్‌లో గుల్‌మార్గ్‌ ఉంది. స్నోఫాల్‌ చూడటానికి విదేశాలకు వెళ్లడం ఏమిటి? మనదేశంలోనే చూడాలనేది నా పట్టుదల. మానస సరోవర్‌ యాత్రకు వయసు సహకరిస్తుందా లేదా అని ఆలోచిస్తున్నాను. పర్యటనల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగని కాలు బయటపెట్టకుండా ఉండలేం కదా! మనం రోజూ ప్రయాణం చేసే రోడ్డు మీదనే ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. పనులు మానుకుని నాలుగ్గోడలకు పరిమితం కాలేం కదా!  కేదార్‌నాథ్‌ పర్యటన సమయంలో ఉన్నట్లుండి కొండ చరియ విరిగి పడింది.

దారి పొడవునా రెçస్క్యూ సిబ్బంది ఉంటారు. వెంటనే రోడ్డు క్లియర్‌ చేస్తారు. అయితే కొండ చరియలు మరీ ఎక్కువగా పడినప్పుడు ఒకటి రెండు రోజులు వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఆ సంఘటన తర్వాత నేనేమీ పర్యటనలు ఆపలేదు. ఈ ఏడాది జూలైలో కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు ముందుగా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాను. నా జీవిత ధ్యేయం ఒక్కటే... శక్తి ఉన్నంత వరకు పని చేస్తాను, మానసికంగా రిఫ్రెష్‌ కావడానికి పర్యటనలు చేస్తూ ఉంటాను. మనిషి పక్షిలా విహరించాలి. అప్పుడే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆహ్లాదంగా జీవించగలుగుతారు.’’.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

‘భలే’బీడు
గోదావరి పుట్టిన త్రయంబకేశ్వర్, కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్, హిమాలయాల నుంచి మైదానానికి దారి తీసే రొహతాంగ్‌ పాస్, కేదార్‌నాథ్, బదరీనాథ్, హరిద్వార్, రిషికేశ్, బుద్ధగయ, వైష్ణోదేవి, అమర్‌నాథ్‌... ఇలా ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలన్నీ చూడగలిగాను. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఆలయాలు అద్భుతంగా ఉంటాయి. శిల్ప సౌందర్యంలో కర్ణాటకలోని హలేబీడు, బేలూరుకి మించినది కాదు కదా సరిపోలేది కూడా మరోటి లేదనిపించింది. పిల్లలను టూర్‌లకు తీసుకెళ్లే వాళ్లకు నేను చెప్పేదొక్కటే...విదేశీ పర్యటనలకంటే ముందు పిల్లలకు ఇండియాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చూపించండి. అప్పుడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం వాళ్లకు సులువవుతుంది. ఇండియా గొప్పతనం తెలుసుకున్న తర్వాత విదేశాలను చూస్తే పర్యాటకం ద్వారా కలిగే విజ్ఞానంలో పరిపూర్ణత ఉంటుంది.
– రజని లక్కా, స్విమ్మింగ్‌ చాంపియన్‌

రజని చెప్పిన మరికొన్ని విషయాలు
ఇండియా తర్వాతనే...
ప్రపంచ పర్యటనకంటే ముందు మనదేశాన్ని దాదాపుగా చుట్టేసి ఉండడంతో విదేశాల్లో నేను చూసిన ప్రతి ప్రదేశాన్నీ ఇండియాలో ఏదో ఒక ప్రదేశంతో బేరీజు వేసుకోవడం అలవాటైంది. ఆస్ట్రేలియాలోని బ్లూ మౌంటెయిన్స్‌ దగ్గర త్రీ సిస్టర్స్‌ అనేవి నీటి కోత కారణంగా ఏర్పడిన రాతి శిఖరాలు. అది గొప్ప ప్రకృతి అద్భుతమే, అయితే మా బళ్లారికి అరవై కిలోమీటర్ల దూరాన ఉన్న హంపి దగ్గర మాతంగ కొండలు కూడా అలాగే ఉంటాయి. పైగా ఎన్ని శిఖరాలుంటాయో... లెక్కపెట్టడం కూడా సాధ్యం కాదు. పర్యాటక సంపదను ప్రమోట్‌ చేసుకోవడంలో మనం వెనుకబడిపోయాం. ప్రభుత్వం ఓ రెండు దశాబ్దాలుగా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది కానీ ఇంకా ఇంప్రూవ్‌ కాలేదు. పాశ్చాత్యులు ఈ విషయంలో చాలా  ముందున్నారు.

నయాగరా వాటర్‌ ఫాల్స్‌ని అమెరికా వైపు నుంచి కెనడా వైపు నుంచి కూడా చూశాను. గొప్ప జలపాతమే కానీ మన దగ్గర జోగ్‌ జలపాతం, హోగెనక్కల్‌ జలపాతాల సౌందర్యం కూడా నయాగరాకు ఏ మాత్రం తీసిపోదు. జోగ్‌ ఫాల్స్‌ని ఇండియన్‌ నయాగరా అంటారు. శ్వేత సౌందర్యం విషయంలో స్విట్జర్లాండ్‌ను చెప్పుకుంటారు. కానీ అది కశ్మీర్‌ను మించినదేమీ కాదని నా అభిప్రాయం. ఇన్ని ప్రదేశాల్లో నన్ను నిరుత్సాహపరిచిన ప్లేస్‌ జైపూర్‌. చిన్నçప్పుడు పింక్‌ సిటీ అని చదివినప్పుడు చాలా గొప్పగా ఊహించుకున్నాను. చూసినప్పుడు ఆ స్థాయి సంతృప్తి కలగలేదు.

మన కోహినూర్‌
టవర్‌ ఆఫ్‌ లండన్‌లోని జువెల్‌ హౌస్‌లో రాజకుటుంబీకులు వాడిన వస్తువులు ప్రదర్శనలో ఉన్నాయి. కోహినూర్‌ వజ్రంతోపాటు భారత్‌ నుంచి తీసుకువెళ్లిన పెద్ద పెద్ద బంగారు పళ్లాలు, స్పూన్లు, ఇతర పాత్రలు, అనేక వస్తువులను చూసినప్పుడు తీవ్రమైన బాధ మనసుని పిండేసింది. మన దగ్గర ఉండాల్సిన వాటిని తీసుకెళ్లిపోవడమేకాక వాటిని దర్జాగా ప్రదర్శనలో పెట్టుకున్నారని కూడా అనిపించింది. దేశదేశాల వాళ్లు వాటిని అబ్బురంగా చూడడాన్ని గమనించిన తర్వాత అవి అక్కడ ఉండడమే మంచిదనుకున్నాను. అవన్నీ మన దగ్గరే ఉండి ఉంటే వెంకటేశ్వరుడి నగల్లాగ ఒక్కొటొక్కటిగా మాయమై ఉండేవేమో. బ్రిటిష్‌ వాళ్లు వాటిని చక్కగా పరిరక్షించి, ప్రపంచమంతటికీ చూపిస్తున్నారు. పైగా వాళ్ల మ్యూజియం నిర్వహణ తీరు చాలా బాగుంది.

బంగారు కొండ
ఎన్ని ఖండాలు చూసినా... ఇండియాలో ఉన్నన్ని ప్రకృతి అద్భుతాలు మరే దేశంలోనూ ఉండవనే నా నమ్మకం. బద్రీనాథ్‌ పర్యటన అయితే నా జీవితంలో మర్చిపోలేను. సూర్యోదయం సమయంలో కొండ బంగారు రంగులోకి మారుతుంది. ఆ సుందర దృశ్యం కొద్ది సెకన్లు మాత్రమే ఉంటుంది. ఉదయం ఐదు ముప్పావుకి లొకేషన్‌కి వెళ్తే ఆ అద్భుతాన్ని చూడవచ్చు. అయితే దానికి కూడా అదృష్టం ఉండాలంటారు. మనం వెళ్లిన రోజు ఆకాశం మబ్బులు పట్టి ఉంటే ఆ అద్భుతాన్ని చూడలేం. విదేశీయులు ఈ సుందర దృశ్యాన్ని చూడటానికే వస్తారు. పర్యటనల పట్ల విదేశీయులు చూపినంత ఆసక్తి మనవాళ్లు చూపించరు. కెనడాలో మాట్రియల్‌ సిటీ నుంచి క్యుబెక్‌ సిటీకి బస్‌లో వెళ్లాను. ఆ బస్‌లో ప్రయాణించిన పదిహేను మందిలో పది దేశాల వాళ్లున్నారు. ఎక్కువగా సోలో ట్రావెలర్సే.

పర్యాటకుల క్షేమమే ప్రధానం
ఇండియా – పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుంటే మనకు ఎక్కడ లేని ఉత్కంఠ. మ్యాచ్‌ పూర్తయిన తర్వాత టపాకాయల మోత చెవుల్ని చిల్లులు చేస్తుంటుంది. వెస్టర్న్‌ కంట్రీస్‌లో భారతీయులు, పాకిస్తానీయులు ఒక గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టీవీలో మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తారు. కెనడా వెళ్లినప్పుడు టొరంటోలో టాక్సీ ఎక్కిన తర్వాత ఆ డ్రైవర్‌ పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఒక్క క్షణం భయమేసింది. ఇక్కడ మనం ఏర్పరచుకున్న అభిప్రాయమే నా భయానికి కారణం. కానీ అతడు చాలా స్నేహంగా మాట్లాడాడు. శ్రీనగర్‌లో సరస్వతి ఆలయాన్ని చూడాలనుకున్నప్పుడు ఊహించని పరిస్థితి ఎదురైంది. మా టూరిస్ట్‌ గ్రూప్‌కి క్యాబ్‌లు పెట్టిన డ్రైవర్‌లందరూ ఒకే మాటగా ఆ ఆలయానికి వద్దన్నారు. అది నమాజ్‌ టైమ్‌ అని, ఆ సమయంలో వెళ్తే రాళ్లు రువ్వుతారని చెప్పారు. తమకు పర్యాటకుల క్షేమమే ప్రధానమని కూడా చెప్పారు. మేము చూడాలని పట్టుపట్టడంతో మూడు గంటల తర్వాత నమాజ్‌ పూర్తయి వెళ్లిపోతారు అప్పుడు తీసుకెళ్తామని చెప్పి అలాగే చేశారు. ఆ ట్యాక్సీ డ్రైవర్‌లు కూడా ముస్లింలే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement