ఆర్థరైటిస్ సమస్యకు సాల్క్ పరిశోధకులు ఓ వినూత్నమైన కొత్త చికిత్స పద్ధతిని కనుక్కున్నారు. మందులేసుకోవడం లేదా కీళ్లు మార్పించుకోవడం మాత్రమే ఇప్పటివరకూ ఉన్న కీళ్లనొప్పుల పరిష్కారాలు కాగా.. శక్తిమంతమైన రెండు కొత్త మందులను కలిపి వాడటం ద్వారా నొప్పులు తగ్గించడంతోపాటు కీళ్ల మధ్య ఉండే పదార్థాన్ని మళ్లీ పెరిగేలా చేయవచ్చునని వీరు చెబుతున్నారు. ఎలుకలతోపాటు మానవ కార్టిలేజ్ కణాలపై జరిగిన పరిశోధనలు ఇప్పటికే మంచి ఫలితాలిచ్చాయని ప్రొటీన్ అండ సెల్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం చెబుతోంది. వయసు పెరిగే కొద్దీ కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి కణజాలం అరిగిపోయి నొప్పులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే.
ఊబకాయం కూడా ఈ సమస్యకు కొంతవరకూ కారణమవుతోంది.ఆల్ఫా క్లోథో, టీజీఎఫ్‌ఆర్2 అనే రెండు రసాయన మూలకాలు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవని ఇప్పటికే గుర్తించగా.. సాల్క్ పరిశోధకులు ఈ రెండింటిని కలిపి ఎలుకలపై ప్రయోగించారు. ఈ రెండు మందులు మృదులాస్థి కణాలు అరిగిపోకుండా చేస్తున్నట్లు గుర్తించారు. టీజీఎఫ్‌ఆర్2 కణాలు ముక్కలైపోకుండా అడ్డుకోవడమే కాకుండా.. వృద్ధి చెందేందుకు ఉపయోగపడుతున్నట్లు పరిశోధనల ద్వారా తెలిసింది. ఆరు వారాల చికిత్స తరువాత ఈ రెండు మందులు కలిపి అందించిన ఎలుకల్లో కీళ్లనొప్పుల తాలూకూ లక్షణాలు గణనీయంగా తగ్గిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టినెజ్ రెడొండో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment