కొక్కొరొకోడింగ్‌ | Samira Mehta who was a wonder kid learned coding at the age of six | Sakshi
Sakshi News home page

కొక్కొరొకోడింగ్‌

Published Mon, Jan 14 2019 12:10 AM | Last Updated on Mon, Jan 14 2019 12:24 AM

Samira Mehta who was a wonder kid learned coding at the age of six - Sakshi

ఆరేళ్ల ప్రాయంలోనే కోడింగ్‌ నేర్చుకుని వండర్‌ కిడ్‌ అనిపించుకున్న సమైరా మెహతా.. ఎనిమిదేళ్లు వచ్చేసరికే ఓ ప్రత్యేకమైన బోర్డ్‌ గేమ్‌ రూపొందించి ఔరా అనిపించింది. తనకున్న నైపుణ్యాన్ని ఇతర పిల్లలకు కూడా అందించేందుకు గూగుల్‌ ‘కీనోట్‌ స్పీకర్‌’గా మారి  సిలికాన్‌ వ్యాలీలో చిన్నారుల చురుకుదనాన్ని మేలుకొలుపుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ ఇండో– అమెరికన్‌. 

‘కోడర్‌బన్నీజ్‌’ సీఈఓ 
ఐఐటీ– ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాకేశ్‌ మెహతా (ప్రస్తుతం ఇంటెల్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌– కాలిఫోర్నియా) తన ఇద్దరు పిల్లలు సమైరా, ఆదిత్‌లకు బాల్యం నుంచే టెక్‌ పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోడింగ్‌పై పట్టు సాధించిన సమైరా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే.. తోటి పిల్లలకు కోడింగ్‌ పాఠాలు నేర్పించేందుకు వీలుగా ‘కోడర్‌బన్నీజ్‌’ బోర్డ్‌ గేమ్‌ను రూపొందించింది. తద్వారా 2016లో థింక్‌ ట్యాంక్‌ నిర్వహించిన ‘పిచ్‌ఫెస్ట్‌’లో రెండో బహుమతి గెలుపొంది 2500 డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది.

ఆ తర్వాత ‘కోడర్‌బన్నీజ్‌’ పేరు మీదుగానే ఓ సంస్థను స్థాపించి తన బోర్డ్‌ గేమ్‌ను అమెజాన్‌లో అమ్మడం మొదలుపెట్టింది. దీనికి అనూహ్య స్పందన లభించడంతో యంగ్‌ సీఈఓ సమైరా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజిన్స్‌– ఏఐ) కోడింగ్‌పై దృష్టి సారించిన సమైరా ప్రస్తుతం ‘కోడర్‌మైండ్స్‌’ అనే కొత్త బోర్డ్‌ గేమ్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ గేమ్‌ ద్వారా రోబోట్స్‌ తయారుచేసేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలను (ఏఐ మోడల్‌ అభ్యాసం) సులభంగా నేర్చుకోవచ్చు. అయితే ఈ గేమ్‌ రూపకల్పనలో సమైరా తమ్ముడు ఆదిత్‌ (6) కూడా తన వంతు సహాయం చేస్తుండటం విశేషం.

రియల్‌ లైఫ్‌ పవర్‌పఫ్‌ గర్ల్‌
సమైరా ప్రతిభకు ఫిదా అయిన దిగ్గజ సంస్థ గూగుల్‌ ఆమెను సిలికాన్‌ వ్యాలీలో తమ కీనోట్‌ స్పీకర్‌గా నియమించుకుంది. పిల్లలకు కోడింగ్‌ పాఠాలు నేర్పేందుకు ఆమె చేత వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్‌ హెడ్‌క్వార్టర్స్‌ మౌంటేన్‌ వ్యూ (కాలిఫోర్నియా)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ చీఫ్‌ కల్చరల్‌ ఆఫీసర్‌ స్టాసీ సలీవన్‌ సమైరాను కలిశారు. ఆమె వాక్చాతుర్యం, నైపుణ్యానికి ముచ్చటపడిన స్టాసీ.. ‘సమైరా ప్రతిభావంతురాలు. తొందర్లోనే గూగుల్‌లో పూర్తి స్థాయిలో ఆమె పనిచేసే అవకాశం ఉంది’ అంటూ కొనియాడారు. ఇక కార్టూన్‌ నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ విభాగం తమ చానల్‌ రూపొందించిన ‘యంగ్‌ ఇన్‌స్పైరింగ్‌ గరల్స్‌’ అనే కార్యక్రమంలో సమైరాకు చోటు కల్పించి.. ‘ద రియల్‌ పవర్‌పఫ్‌ గర్ల్‌’గా సమైరాను అభివర్ణించింది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ కూడా సమైరా ప్రతిభను గుర్తించింది.

ఆసక్తే తనను నిలిపింది
‘‘సమైరా ఇండియాస్‌ వండర్‌ కిడ్‌ అని నా స్నేహితులు అంటూ ఉంటారు. కానీ తను కూడా అందరిలాంటిదే. కాకపోతే కోడింగ్‌ పట్ల ఉన్న ఆసక్తి ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. అయితే చిన్నతనంలోనే తను ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించడం నాకు ఆనందంగా ఉన్నప్పటికీ.. కీర్తి తాలూకూ ప్రభావం తన మీద పడకూడదు అనుకుంటాను. ఒత్తిడి లేకుండా పనిచేస్తేనే సమైరా మరిన్ని విజయాలు సాధిస్తుంది’’ అని రాకేశ్‌ మెహతా కూతురి గురించి చెప్పారు.
– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌ డెస్క్‌ 

వంద కోట్ల మందికి నేర్పుతా
‘‘ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్‌ స్క్రీన్లకు దూరంగా ఉంటూనే తమ పిల్లలు కోడింగ్‌ టెక్నిక్స్‌ నేర్చుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వారికి కోడర్‌బన్నీజ్‌ వంటి నాన్‌– డిజిటల్‌ బోర్డ్‌ గేమ్స్‌ ఎంతో ఉపయోగకరం. ఈ ప్రపంచంలో ఉన్న సుమారు వంద కోట్ల  మంది పిల్లలకు నా సంస్థ ద్వారా కోడింగ్‌ నైపుణ్యాలు నేర్పించడం నా ఉద్దేశం. నాకు తెలిసీ వాళ్లంతా కోడింగ్‌ చేయగలిగే సామర్థ్యం కలిగిన వారే. కాకపోతే వారి కోసం కొంచెం సమయం కేటాయించడంతో పాటుగా కోడర్‌బన్నీజ్‌ వంటి ఈజీ గేమ్‌ల అవసరం ఉంది. అమెజాన్‌ ద్వారా ఏడాదిలో వెయ్యి బాక్సుల బోర్డ్‌ గేమ్స్‌ అమ్మాను. దాని ద్వారా 35 వేల డాలర్ల ఆదాయం పొందాను.

నేను ఆరేళ్ల వయసులోనే కోడింగ్‌ నేర్చుకున్నాను. ప్రస్తుతం కీనోట్‌ స్పీకర్‌గా కోడింగ్‌ మెళకువలు నేర్పుతున్నాను. ఈ క్రమంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, ఫేక్‌బుక్‌ సీఈఓలను కలవడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. కోడర్‌బన్నీజ్‌ ఐడియాను వారిరువురూ మెచ్చుకున్నపుడు ఎంతో గర్వంగా అన్పించింది. ప్రస్తుతం మా వెబ్‌సైట్‌లో రోబోటిక్స్, గేమ్, ఎడ్యుకేషన్‌ సెక్టార్లలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. వీటన్నింటిలో మా నాన్న పాత్ర ఎంతగానో ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడమే నా ఆశయం’’ అంటూ పదేళ్ల సమైరా తన అనుభవాలను పంచుకుంది. అంతేకాదు తన కంపెనీ పేరిట విరాళాలు సేకరించి అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ పెద్ద మనసు చాటుకుంటోంది కూడా.
– సమైరా (10) , ‘కోడర్‌బన్నీజ్‌’ సీఈఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement