
జెన్ సదావర్తె
ఈ ఏడాది జనవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ‘నేషనల్ బ్రేవరీ అవార్డ్’ అందుకుంది జెన్ సదావర్తి. 2018 ఆగస్టులో ముంబైలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ముందే హెచ్చరించడం ద్వారా పదిమంది ప్రాణాలను కాపాడగలిగింది సదావర్తి. అందుకు వచ్చిన అవార్డే అది. పన్నెండేళ్ల ఈ చిన్నారి ముంబైలోని ఒక స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. షేక్‌స్పియర్ పుస్తకాల సెట్ మొత్తాన్ని ఇప్పటికే చదివేసింది! ఈ చదవడం తనకు సంబంధించినది. సమాజం కోసం కూడా చాలా చేస్తోంది. ఈమధ్యే.. నిరసన ప్రదర్శనల్లోకి పిల్లల్ని వెంటపెట్టుకుని వెళ్లకూడదనే ఆదేశాలను జారీ చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్కూళ్లలో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరింది. పెద్దయ్యాక లాయర్ అవ్వాలని లక్ష్యం. ఇంగ్లిష్, హిందీ చక్కగా మాట్లాడుతుంది. ఈ రెండు భాషలు చాలు.. సమాజం కోసం ఫైట్ చెయ్యడానికి. అయితే అవి అసలు భాషలే కాదని శివసేన కార్యకర్తలు ఆ అమ్మాయిని మహిళా దినోత్సవ ప్రసంగం నుంచి పక్కకు నెట్టేశారు. ‘‘హిందీలో, ఇంగ్లిష్‌లో కాదు.. అచ్చమైన మరాఠీలో మాట్లాడు’’ అన్నారు. అక్కడితో ఆగిపోలేదు. ‘‘నువ్వీ రాష్ట్రంలో ఉండాలంటే మరాఠీ నేర్చుకోవలసిందే’’ అని బెదిరించారు. బ్రేవరీ అవార్డు తీసుకున్న అమ్మాయి ఆ బెదిరింపులకు భయపడుతుందా! ప్రసంగాన్ని పూర్తి చేసి గానీ వేదిక దిగలేదు.
Comments
Please login to add a commentAdd a comment