బాల శివుడి అండ కోటప్పకొండ | Shiva child support kotappakonda | Sakshi
Sakshi News home page

బాల శివుడి అండ కోటప్పకొండ

Published Tue, Nov 15 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

బాల శివుడి అండ   కోటప్పకొండ

బాల శివుడి అండ కోటప్పకొండ

ఆ క్షేత్రంలో శివుడు... బాలుడిగా అవతరించాడు.
ఆ క్షేత్రంలో శివుడు... దక్షిణామూర్తిగా బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశాడు.
ఆ క్షేత్రంలో శివుడు... విష్ణువు పాపాలను కడిగి వేశాడు.
ఆ క్షేత్రంలో శివుడు... తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు.
కొండ మీద మెట్లను ఎక్కడానికే కాదు... జీవితంలోని కష్టాలను దాటడానికీ... భక్తులు కోటప్పను తలుచుకుంటారు!
‘చేదుకో... మమ్మల్ని ఏలుకో’ అని శరణుజొచ్చే ప్రతి ఒక్కరినీ...
చల్లగా చూసే శివుడు... ఎల్లరకూ అభయమిచ్చే దేవుడు ఈ కోటప్ప!!

కార్తీక క్షేత్రాలు - 3
‘చేదుకో కోటయ్య చేదుకో... చేదుకుని మమ్మల్ని ఆదుకో’ అంటూ పారవశ్యంతో త్రికూటేశ్వరుణ్ణి కీర్తిస్తూ భక్తకోటి కోటప్పకొండకు తరలివస్తారు. ఎటు నుండి చూసినా మూడు శిఖరాల (త్రికూటాలు)తో కనిపిస్తుంది కనుక ఈ క్షేత్రం త్రికూటాచలమైంది. ఇక్కడి శివుడు త్రికూటేశ్వరుడయ్యాడు. ఈ శిఖరాలను రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరంగా భావిస్తూ కోటి మంది దేవతలు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేయడం వల్ల కూడా ఈ క్షేత్రం కోటప్ప క్షేత్రంగా మారిందని భక్తులు నమ్మకం. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలోని కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు కాగా, ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది.

తిమ్మరసు దర్శించిన క్షేత్రం
11వ శతాబ్దం నుంచి ఉనికిలో ఉందని భావిస్తున్న త్రికూటేశ్వర క్షేత్రానికి ఎందరో రాజులు, జమీందారులు భూరి విరాళాలు సమర్పించారు. విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో మహామంత్రి తిమ్మరసు కొండవీటిని జయించిన అనంతరం ఈ స్వామిని దర్శించుకుని, కొండకావూరు గ్రామాన్ని ఆలయానికి విరాళంగా సమర్పించిన దానశాసనం ఇక్కడ ఉంది. నరసరావుపేట జమీందారు మల్రాజు ఆలయాన్ని పునరుద్ధరించడంతో పాటు కొండ మీదకు చేరుకునేందుకు సోపాన మార్గాన్ని నిర్మించాడు.

పురాణ ప్రాశస్త్యం
పురాణాల ప్రకారం లయకారుడైన శివుని భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు నిర్వహించే యజ్ఞానికి హాజరై, అవమానాలకు గురై ఆత్మాహుతి చేసుకుని శరీరాన్ని విడిచిపెడుతుంది. దీనితో పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, సతీ వియోగంతో విరాగిగా మారి, తనను తాను బాలునిగా (బాలవటువు) కుదించుకుని దక్షిణామూర్తి (గురు రూపంలో)గా తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు శివుణ్ణి దర్శించి బ్రహ్మోపదేశం చేయమని కోరారు. త్రికూటాద్రికి వస్తే చేస్తానంటాడు శివుడు. అలా వారు త్రికూటాద్రికి రాగా శివుడు బ్రహ్మదిదేవతలకు బ్రహ్మోపదేశం చేసినట్టు ఐతిహ్యం. దక్ష యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించిన విష్ణువు తన పాపాలను పోగొట్టాలని శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు తన శూలంతో కొండపై పొడిచి, జలాన్ని పైకి తీసుకువచ్చాడు. ఆ జలంతో స్నానం చేసిన విష్ణువు తన పాపాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఇక్కడ వెలసిన శివుణ్ణి ‘పాప వినాశనేశ్వరుడు’ అని పిలుస్తారు. బ్రహ్మోపదేశం పొందిన దేవతలు వారి వారి లోకాలకు వెళ్ళిపోగా, పరమశివుడు మాత్రం బాలవటువుగా ఇక్కడే తపస్సులో నిమగ్నమయ్యాడు. ఇదంతా త్రికూటాలలో ఒకటైన రుద్ర శిఖరంపై జరిగిన కథ. ఈ శిఖరంపైనే పాత కోటప్ప ఆలయం ఉంది.

యాదవ బాలిక కోసం దిగిన శివుడు...
రుద్రశిఖరంపై బాల వటువుగా తపస్సులో ఉన్న శివుణ్ణి సమీపంలోని యల్లమంద గ్రామానికి చెందిన యాదవ బాలిక ఆనందవల్లి నిత్యం సేవించడం మొదలుపెట్టింది. రోజూ శివుడి కోసం పెరుగు, మజ్జిగ తీసుకొని కొండెక్కి వచ్చేది. శివుడు ఆమెను వదిలించుకోవాలని చూసినా, వీలు కాలేదు. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించదలిచి మాయగర్భం ఇచ్చాడు. నిండుచూలాలుగా ఉన్నప్పటికీ ఆనందవల్లి ప్రయాసతో కొండపైకి వచ్చి బాల వటువుకు సేవలు అందిస్తూనే ఉండేది. దాంతో ప్రసన్నుడైన పరమేశ్వరుడు నీకు ప్రతి రోజూ కొండపైకి వచ్చే శ్రమను కలుగనివ్వనంటూ తనే కిందకు దిగడానికని, వెనుతిరిగి చూడకుండా దారి చూపమని ఆజ్ఞాపించాడు. ఆనందపరవశురాలైన ఆనందవల్లి ముందు నడుస్తుండగా పరమే శ్వరుడు ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు. అయితే వెనక నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఆనందవల్లి కంగారుగా వెను తిరిగి చూసింది. దీంతో పరమేశ్వరుడు ప్రస్తుతం పూజలందుకుం టున్న బ్రహ్మ శిఖరంపై లింగాకారం ధరించాడు. ఆనందవల్లి శివ సాయుజ్యం పొందింది. తన దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆనందవల్లిని దర్శించుకునేలా స్వామి అనుగ్రహించాడు. ఆ ప్రకారమే కోటప్పకొండకు వచ్చే భక్తులు మొదట ఆనందవల్లిని దర్శించుకొని, తర్వాత త్రికూటేశ్వరుణ్ణి కొలుస్తారు.

ప్రభల సంబరం
మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జరిగే ప్రభల సంబరం అంబరాన్ని అంటుతుంది. కోటప్పకొండ ప్రభలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రభల సంబరాన్ని చూసేందుకు భక్తులు ఇక్కడకు తరలివస్తారు. చిన్నారులు నిర్మించే అడుగు ఎత్తు  బాలప్రభలు మొదలుకొని 80 అడుగుల ఎత్తు వరకు ఉండే భారీ ప్రభలను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇక్కడకు తీసుకువస్తారు. గ్రామాలకు గ్రామాలే ఈ ప్రభలు వెంట తరలివస్తాయి. కాలక్రమంలో ఆయా ప్రభలకు విద్యుత్ అలంకరణలు మరింత శోభను తీసుకువచ్చాయి.

ఘాట్ రోడ్డు నిర్మాణం... పెరిగిన భక్తజనం...
కోటప్పకొండ పైభాగానికి చేరుకునేం దుకు నరసరావుపేట జమీందారు రాజా మల్రాజు 1761లో సోపాన (మెట్ల)మార్గాన్ని ఏర్పాటుచేశారు. దీంతో కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో భక్తులు విశేషంగా చేరుకోవడానికి వీలైంది. ఈ మెట్లు ఎక్కడంలో ప్రయాస పడకుండా ఉండేందుకు భక్తులు ‘చేదుకో కోటయ్య చేదుకో’ అని కోటప్పను తలవడం విశేషం. కొండపైకి 1999లో ఘాట్‌రోడ్డు నిర్మించాక భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. ఘాట్‌రోడ్డు నిర్మాణా నికి పూర్వం ఆలయ ఆదాయం ఏటా రూ.7 లక్షలు ఉండేది. నేడు దాదాపు రూ. 10 కోట్ల ఆదాయం లభిస్తోంది.

నిత్యపూజలివే!
శివుడు బాల వటువుగా ఇక్కడ  వెలవడంతో స్వామి వారికి ఇక్కడ కల్యాణం ఉండదు.  విశేష పూజలు, ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. కార్తికమాసంలో ప్రత్యేకంగా కార్తిక అభిషేక పథకాన్ని దేవస్థానం ప్రవేశపెట్టింది. మూల విరాట్టుతోపాటు అభిషేక మండపాలలో భక్తులతో స్వామి వారి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలాగే ఆరుద్రోత్సవ సమయంలో జ్యోతి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి స్వామి వారు ‘మేధా దక్షిణామూర్తి’ స్వరూపం కావడంతో అక్షరాభ్యాస కేంద్రంగా కూడా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది.
- పుట్లూరి శివకోటిరెడ్డి  సాక్షి, నర్సరావుపేట రూరల్

ఇలా చేరుకోవచ్చు!
కోటప్పకొండ క్షేత్రం గుంటూరు జిల్లా నరసరావుపేటకు కేవలం 11 కి.మీ దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా వచ్చే యాత్రికులు నరసరావుపేట చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వామి వారిని దర్శించుకోవచ్చు. అలాగే జాతీయ ర హదారిపై ఉన్న చిలకలూరిపేట నుంచి ఇక్కడకు 17 కి.మీ దూరం ఉంటుంది. రాయలసీమ వైపు నుంచి వచ్చే భక్తులు వినుకొండ మీదుగా నేరుగా పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద నుంచి కొండకు చేరుకోవచ్చు. గుంటూరుకు 55 కి.మీ దూరంలో, నూతన రాజధాని అమరావతి నుంచి 70 కి.మీ దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను కొండకు నడుపుతున్నారు.

ఆకట్టుకుంటున్న పర్యాటక కేంద్రం...
ఘూట్‌రోడ్డులో మధ్యలో భక్తులను సేదతీర్చేందుకు సకలవసతులతో అటవీశాఖ పర్యాటకకేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో కిలకిలరావం పేరుతో పక్షులు, మయూరవనం, జింకల పార్కు, విదేశి కొంగల కేంద్రం, ట్రాయ్ ట్రయిన్, రంగురంగుల చేపల కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇక్కడే ఏర్పాటుచేసిన కాళింది మడుగులో బోటు షికారు యాత్రికులను ఆకట్టుకుంటున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement