స్నేహమెంతో మధురం! | Snehamen Sweet! | Sakshi
Sakshi News home page

స్నేహమెంతో మధురం!

Published Thu, Jul 31 2014 11:49 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

స్నేహమెంతో మధురం! - Sakshi

స్నేహమెంతో మధురం!

ఆగస్టు 3 స్నేహోత్సవం
 
అవి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న రోజులు. ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని శిబిరానికి వచ్చి ‘‘కర్ణా’’ అని పిలుస్తాడు. శ్రీకృష్ణుని గొంతు విని కర్ణుడు వడివడిగా కృష్ణుని వద్దకు వచ్చి అతనికి నమస్కరించి ‘‘కృష్ణా... ఏమిటి ఇంత రాత్రి వేళ ఈ రాక’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణునికి అతని జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని కోరుతాడు.

కర్ణుడు చిన్నగా నవ్వి, ‘‘కృష్ణా, నేనెవరన్నదీ నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకు తెలుసు’’ అన్నాడు. ‘‘ఇంత తెలిసినవాడివి పాండవుల పక్షాన నువ్వెందుకు చేరడం లేదు’’ అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు.
 ‘‘దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితునిగా నేను ఉండాలనుకుంటున్నాను’’’అని అన్నాడు కర్ణుడు. తన జన్మం గురించి తెలిసినా, దుర్యోధనుని విడిచి వెళ్లక అతనికి ధైర్యం చెప్పిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు.
 
ఇక కృష్ణ, కుచేలుర మైత్రి అపురూపమైనది. సాందీపుని వద్ద కృష్ణ, కుచేలురు కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో వారిరువురి మధ్యా స్నేహం ఏర్పడింది. విద్యాభ్యాస కాలమంతా కలసి ఉన్న కృష్ణ, కుచేలురు విద్యాభ్యాసం తర్వాత విడిపోయారు. అధిక సంతానంతో కుచేలుడు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాడు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టలేకపోతున్నాడు. కుటుంబమంతా పస్తులతో గడుపుతున్నారు. అటువంటి సమయంలో కుచేలునికి శ్రీకృష్ణుడు జ్ఞప్తికి వచ్చాడు. శ్రీకృష్ణుని కలసి తన పరిస్థితిని వివరిస్తే అతను కనికరిస్తాడని భావించి కృష్ణుని కలిసేందుకు నిర్ణయించుకున్నాడు. బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు, స్నేహితులను చూసేందుకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు. మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్లాలి అని తర్జన భర్జన పడి కొన్ని అటుకులను మూటగా కట్టుకుని ద్వారకకు బయలుదేరాడు కుచేలుడు.
 
కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడు కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కుశలమడిగాడు. ‘‘మిత్రమా! చాలా రోజులకు కలుసుకున్నాం కదా. ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా?’’ అని ప్రశ్నించాడు.
 
శ్రీకృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు ఎంతగానో సిగ్గుపడిపోయాడు. ఏ సమాధానమూ చెప్పకుండా చేష్టలుడిగి అలాగే ఉండిపోయాడు. కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని కృష్ణునికి ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే కుచేలుడు తను, తన కుటుంబం ఎంతగా బాధపడుతున్నదీ కృష్ణునికి చెప్పకుండానే తిరుగుముఖం పట్టాడు. సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు కుచేలుడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఇటువంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ, కర్ణులను ఆదర్శగా తీసుకుని స్నేహం చెయ్యాలి.
 
- మందరపు సోమశేఖరాచార్యులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement